logo

చేతులే యంత్రమా.. వ్యాపారి చెప్పిందే నాణ్యతా?

అకాల వర్షాలు చీడపీడల నుంచి మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొద్దోగొప్పో చేతికొచ్చిన పంటను మార్కెట్‌కి తీసుకువెళ్తే గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు వాపోతున్నారు. 

Published : 01 Apr 2023 04:11 IST

కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో నిరుపయోగంగా ఉన్న మిర్చి నాణ్యత యంత్రం

కేసముద్రం, న్యూస్‌టుడే:  అకాల వర్షాలు చీడపీడల నుంచి మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొద్దోగొప్పో చేతికొచ్చిన పంటను మార్కెట్‌కి తీసుకువెళ్తే గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు వాపోతున్నారు. యార్డులో రెండు లాట్లకు గరిష్ఠ ధరలు ఇస్తూ.. మిగిలిన లాట్లకు కనిష్ఠ ధరలు ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మిర్చి నాణ్యతను ఐదు నిమిషాల్లో తెలిపే మిషన్లను జిల్లాలోని కేసముద్రం, మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో మార్కెట్‌కు రూ.13లక్షలు వెచ్చించి సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ సంస్థ రూపొందించిన మిర్చి నాణ్యత యంత్రాన్ని 2022 మార్చిలో ఏర్పాటు చేశారు. ఏడాది పూర్తవుతున్నా ఆ యంత్రాన్ని ఇప్పటి వరకు వినియోగించింది లేదు. నాణ్యత తెలిస్తే తగిన ధరను డిమాండ్‌ చేసే అవకాశం ఉంటుందని అన్నదాతలు చెబుతున్నారు.

తక్కువ ధరకు ఖరీదు చేస్తున్నారు  

ధరంసోతు నరేశ్‌, క్యాంపుతండా, కేసముద్రం : నాణ్యత పేరుతో మార్కెట్‌లో తక్కువ ధరకు ఖరీదు చేస్తున్నారు. వ్యాపారి చేతితో పట్టుకొని తేమ ఉందని చెబుతున్నారు. అత్యవసరంతో ఒకటి రెండు బస్తాలు మార్కెట్‌ బయట విక్రయిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మార్కెట్‌లో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన మిర్చి నాణ్యత యంత్రం నిరుపయోగంగా ఉంది. వినియోగంలోకి తీసుకొస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.

సాంకేతిక లోపం ఉంది

రాజా, మార్కెట్‌ కార్యదర్శి, కేసముద్రం : జిల్లాలోని కేసముద్రం, మహబూబాబాద్‌ మార్కెట్‌ యార్డుల్లో గతేడాది మార్చిలో మిర్చి నాణ్యత యంత్రాలు ఏర్పాటు చేశాం. సాంకేతిక లోపం కారణంగా వినియోగించటం లేదు. ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. త్వరలో వినియోగంలోకి తీసుకొస్తాం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని