logo

ఏజెన్సీలో గాలివాన బీభత్సం

మన్యంలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. వెంకటాపురం, వాజేడు, మంగపేట మండలాల్లో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.

Published : 01 Apr 2023 04:11 IST

వెంకటాపురం-వాజేడు మార్గంలో రోడ్డుపై పడిన చెట్టు.. బురదలో చిక్కుకుపోయిన అంబులెన్స్‌

వెంకటాపురం(ములుగు జిల్లా), న్యూస్‌టుడే: మన్యంలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. వెంకటాపురం, వాజేడు, మంగపేట మండలాల్లో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలగా, ఇళ్ల పైకప్పు రేకులు కొట్టుకుపోయాయి. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట తడిసింది. గాలులకు నిల్వలపై కప్పిన టార్పాలిన్లు సైతం తొలగిపోయి కర్షకులకు నష్టాన్ని మిలిగ్చింది.

రహదారిపై కూలిన చెట్లు

ఈదురు గాలులతో వెంకటాపురం-వాజేడు ప్రధాన మార్గంపై చెట్లు నేలకూలాయి. ఎదుళ్లచెరువు సమీపంలో రోడ్డుపై వృక్షం పడటంతో రాకపోకలు నిలిచాయి. సమీపం నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన అంబులెన్సు బురదలో చిక్కుకుపోయింది. సమాచారం మేరకు అర్‌అండ్‌బీ ఉద్యోగులు ఆలం శ్రీనివాస్‌, సిబ్బంది డోజర్‌ సాయంతో చెట్లను తొలగించారు. ఈ క్రమంలో దాదాపు గంటకు పైగా వాహన రాకపోకలు స్తంభించాయి. వెంకటాపురంలోని కనకదుర్గ ఆలయం సమీప వీధిలో ఓ ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా తొలగిపోయాయి. లోపల సామగ్రి సైతం ధ్వంసమైంది.

కర్షకులకు తీవ్ర నష్టం

తుపాను ప్రభావంతో ఆకస్మికంగా వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. గాలివానతో ఒక్కసారిగా వ్యాపించిన వర్షంతో క్షేత్రాల వైపు కర్షకులు పరుగులు తీశారు. వెంకటాపురం శివారులోని ఇసుక పాయ, ఉప్పేడు, వాడగూడెం, మరికాల, రామచంద్రాపురం, వీరభద్రవరం ప్రాంతాల్లో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట తడిసింది. పక్షం రోజుల కిందట కురిసిన వర్షంతో చేతికందిన పంట తాలుగా మారి నష్టం చేకూర్చగా ప్రస్తుత వర్షం మరింత నష్టాన్ని కలిగించిందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్తు సరఫరాలో అంతరాయం

పిడుగులు, ఈదురుగాలుల ధాటికి విద్యుత్తుశాఖకు నష్టం జరిగింది. వెంకటాపురం మండలం ఉప్పేడులో 15 కేవీ సామర్థ్యం కలిగిన విద్యుత్తు నియంత్రిక పేలింది. చొక్కాలలో రెండు, నూగూరులో మూడు, దానవాయిపేటలో రెండు స్తంభాలు విరిగాయి. కోయబెస్తగూడెం, ఉప్పేడు గొల్లగూడెం, వెంకటాపురం పట్ణంలోని శివాపురం, రెండు పడకల నివాసాల సముదాయం, కస్తూర్బా బాలికల విద్యాలయం ప్రాంతాల్లో 11 కేవీ తీగలు తెగాయి. మండలంలో కరెంటు సరఫరాలో అంతరాయం చోటుచేసుకుంది.

మంగపేట: మండలంలో శుక్రవారం సాయంత్రం అకాల వర్షంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బోరునర్సాపురం సమీప పంట చేల వద్ద స్వల్పంగా రాళ్ల వాన కురిసింది. వరి పంట నేలవాలింది. పంట దిగుబడి తగ్గిపోతుందని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ధాన్యం రాలిపోయింది. మిరప కల్లాల వద్ద మిర్చి పంట తడిసింది.

వెంకటాపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) ప్రాంగణం తటాకాన్ని తలపించింది. వర్షానికి ప్రధాన భవనం చుట్టూ వరద భారీగా చేరింది. నీరు బయటికి వెళ్లేందుకు కాలువలు లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది, రోగులు ఇక్కట్లు పడాల్సి వచ్చింది.

ఆసుపత్రి జలమయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని