logo

వడివడిగా.. ఆయుష్మాన్‌ భారత్‌!

పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందని ద్రాక్షలానే మిగిలిపోతోంది.. ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైతే చికిత్స చేయించుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే లక్షల్లో బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు.

Published : 01 Apr 2023 04:11 IST

ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ఈకేవైసీ నమోదు

న్యూస్‌టుడే, భూపాలపల్లి కలెక్టరేట్‌ : పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందని ద్రాక్షలానే మిగిలిపోతోంది.. ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైతే చికిత్స చేయించుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే లక్షల్లో బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం దేశ జనాభాలో 40 శాతం మంది అత్యంత పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. అలాంటి వారంతా అనారోగ్యం పాలైతే ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు.. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని పేదలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా రూ.2 లక్షల వరకు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం తరహాలోనే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో నమోదు చేసుకున్న ప్రతి వ్యక్తికి దేశ వ్యాప్తంగా ఎక్కడైనా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఈకేవైసీ ద్వారా నమోదుకు చర్యలు తీసుకుంటున్నారు.

చాలా మందికి అవగాహన లేక..

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి సంబంధించి ఈకేవైసీ నమోదు కేవలం 36 శాతమే నమోదు కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 76 మండలాలు ఉండగా దారిద్య్ర రేఖకు దిగువన 4.92 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందులో 15.29 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరందరి వివరాలను ఈకేవైసీ ద్వారా నమోదు చేస్తేనే వారికి ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు మీ సేవ, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ల ద్వారా లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తున్నారు. కార్యక్రమ అమలుకు సంబంధించి సరైన ప్రచారం కల్పించకపోవడంతో చాలా మందికి అవగాహన లేక ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో నమోదు కావడంలో వెనకడుగు పడుతోంది.

దేశంలో ఎక్కడైనా..

రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించడంతో అర్హులైన లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.2 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించే అవకాశం ఉంటుంది. తాజాగా కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా రూ.5 లక్షల వరకు అవకాశం కల్పించారు. అలాగే దేశ వ్యాప్తంగా ఎక్కడైనా రూ.5 లక్షలలోపు ఉచితంగా వైద్య చికిత్సలు పొందే అవకాశం ఉంది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో నమోదు పూర్తయితే సంబంధిత కార్డు పోస్టు ద్వారా ఇంటికి పంపించనున్నారు. ఈ కార్డు ఏ రాష్ట్రంలోనైనా అమలులో ఉండటంతో ఎక్కడైనా వైద్యం పొందే అవకాశం ఉంటుంది.

నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం..

ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో భాగంగా ఈకేవైసీ నమోదుకు సంబంధించి గతంలో ఏఎన్‌ఎం, ఆరోగ్య మిత్రలతో నమోదు చేయించాం. కంటి వెలుగు కార్యక్రమం అమలులో ఉండటంతో నమోదులో కాస్త వెనకబడింది. తాజాగా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ల ద్వారా ఈకేవైసీ నమోదు చేస్తున్నాం.

 డాక్టర్‌ కమల్‌చంద్‌నాయక్‌, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని