logo

అంతులేని విషాదం

ఎంజీఎం ఆసుపత్రి, వరంగల్‌ కలెక్టరేట్‌, కాశీబుగ్గ, న్యూస్‌టుడే: చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాదం కన్నీరు పెట్టిస్తోంది. అన్నదమ్ములిద్దరూ చెరువు రూపంలో మృత్యుఒడిలోకి చేరడంతో తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగిలింది.

Published : 01 Apr 2023 04:11 IST

 చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

కిరణ్‌సింగ్‌, దీపక్‌సింగ్‌ (పాతచిత్రం)

ఎంజీఎం ఆసుపత్రి, వరంగల్‌ కలెక్టరేట్‌, కాశీబుగ్గ, న్యూస్‌టుడే: చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాదం కన్నీరు పెట్టిస్తోంది. అన్నదమ్ములిద్దరూ చెరువు రూపంలో మృత్యుఒడిలోకి చేరడంతో తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగిలింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారులు విగతజీవులై కనిపించారు. వరంగల్‌ జిల్లా ఏనుమాముల మార్కెట్ నుంచి రెడ్డిపురానికి వెళ్లే దారిలో చెరువుశిఖంలో ఉన్న చాకలి ఐలమ్మనగర్‌కు చెందిన దూదాని లఖన్‌సింగ్‌, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె సంతానం. మార్కెట్లో కులీపని చేసుకుంటూ జీవిస్తున్నారు. శుక్రవారం ఉదయం దంపతులిద్దరూ కూలీపనికి, పెద్దకూతురు మౌనిక పాఠశాలకు వెళ్లారు. అందరికంటే చిన్నవాడు లక్కీ ఇంటివద్దనే ఉన్నారు. మూడో కుమారుడు దీపక్‌సింగ్‌(9)  సమీపంలోని కోటచెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయాడు. తమ్ముడు దీపక్‌ను కాపాడేందుకు రెండో అబ్బాయి కిరణ్‌సింగ్‌(12) నీళ్లలోకి దిగారు. ఒకరినొకరు రక్షించుకోవడానికి చేతులు, కాళ్లతో ప్రయత్నించారు. ఊపిరాడక నీటిలో మునిగిపోతున్న పిల్లలను గమనించిన స్థానికులు చెరువులోకి దిగి వారిని బయటకు తీసి ఎంజీఎం ఆసుపత్రి పిల్లల వార్డుకు తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు కంటతడి పెట్టించాయి.  చిన్నారులిద్దరు రెండు నెలల కిందటి వరకు అమ్మమ్మ ఊరు నల్గొండలో ఉంటూ అక్కడే చదువుకున్నారు. వరంగల్‌కు వచ్చాక పిల్లలిద్దరు బడికి వెళ్లడం లేదు. ఎంజీఎంకు వచ్చిన వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు