logo

Warangal - KTR: ‘భవిష్యత్తు నగరం’.. భరోసా ఇవ్వండి!

రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్‌ తర్వాత అభివృద్ధి పరిచేందుకు అన్ని వనరులు ఉన్న నగరం వరంగల్‌. ఇక్కడి ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న అయిదు సమస్యలను పరిష్కరించి వారికి భరోసా కల్పించాల్సి ఉంది.

Updated : 05 May 2023 09:41 IST

ఐదు అంశాలపై మంత్రి  కేటీఆర్‌ దృష్టిసారిస్తే సాకారం
ఈనాడు, వరంగల్‌, కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

‘విశ్వనగరంగా హైదరాబాద్‌ అవతరిస్తోంది.. భవిష్యత్తు నగరంగా ఓరుగల్లును తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది’

2021 ఏప్రిల్‌లో వరంగల్‌ పర్యటనలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌


రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్‌ తర్వాత అభివృద్ధి పరిచేందుకు అన్ని వనరులు ఉన్న నగరం వరంగల్‌. ఇక్కడి ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న అయిదు సమస్యలను పరిష్కరించి వారికి భరోసా కల్పించాల్సి ఉంది. శుక్రవారం మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో దృష్టిపెట్టాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం.


1. ముంపు పరిష్కారం లేదు

వరంగల్‌ నగరాన్ని 2020 ఆగస్టు, సెప్టెంబరులో భారీ వర్షాలు ముంచెత్తాయి. అప్పుడు మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర స్థాయి అధికారులతో నగరమంతా కలియతిరిగారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశారు. మూడేళ్లవుతున్నా పనులు అంతంతమాత్రమే. ఇటీవల కురిసిన అకాల వర్షంతో నగరంలో రహదారులు గోదావరిని తలపించాయి.

* హనుమకొండ నయీంనగర్‌ నాలా విస్తరణ, ఇరువైపులా గోడల నిర్మాణ పనులు మొదలవ్వలేదు. జవహర్‌నగర్‌ నుంచి విద్యానగర్‌ వరకు భూగర్భ డ్రైనేజీ పనులు మధ్యలో ఆగాయి.

* వరంగల్‌ భద్రకాళి నాలాను విస్తరించారు. వరదనీటి కాల్వలు, చుట్టూ రిటైనింగ్‌ గోడ పనులు మొదలు కాలేదు.

* హంటర్‌రోడ్‌ బొందివాగు నాలా అత్యంత ప్రమాదకరం. సగం నగరం దీనివల్లే మునుగుతోంది. నాలా విస్తరణ, స్టార్మ్‌ వాటర్‌, రిటైనింగ్‌ వాల్‌, భద్రకాళి చెరువు వద్ద షట్టర్ల పనులకు డీపీఆర్‌ సిద్ధమైంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి

* కరీమాబాద్‌ సాకరాశికుంట, దేశాయిపేట చిన్నవడ్డేపల్లి, శివనగర్‌, హంటర్‌రోడ్‌ 12 మోరీలు, పోతననగర్‌ వరదనీటి కాల్వల పనులు మొదలవ్వలేదు.


2. నిధుల కొరత

* బల్దియా సొంత ఆదాయం కార్మికుల వేతనాలు, ఇంధనం, కరెంటు బిల్లులకే సరిపోతోంది. జనరల్‌ ఫండ్స్‌లో నిధులు లేవు. నగరంలోని 66 డివిజన్లలో పనులు సాగడం లేదు. టీఎఫ్‌యూఐడీసీలో భారీగా నిధులున్నాయి. గ్రేటర్‌ వరంగల్‌కు ప్రత్యేక గ్రాంటు ఇస్తే పనులు చక చకా ముందుకు సాగుతాయి.

* పాలకవర్గం ఎన్నికై రెండేళ్లయ్యింది. ఒక్కో డివిజన్‌లో రూ.50 లక్షల విలువైన పనులు కూడా పూర్తి చేయలేదని కార్పొరేటర్లు ఆవేదన చెందుతున్నారు. నగరంలోని 66 డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక నిధులు ఇవ్వాలంటున్నారు.

* వరదనీటి కాల్వలు, చుట్టూ గోడలు, ఇతర ముఖ్యమైన పనులకు రాష్ట్ర పురపాలక శాఖ ద్వారా ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలి.


3. రోజూ తాగునీరేది?

నల్లాల ద్వారా సరఫరా అయిన కలుషిత నీరు

* మంత్రి కేటీఆర్‌ 2021 ఏప్రిల్‌లో రాంపూర్‌, న్యూశాయంపేట వద్ద రోజూ తాగునీటి సరఫరాను ప్రారంభించారు. మూడు, నాలుగు నెలల్లో నగరంలోని 66 డివిజన్లలో రోజూ తాగునీటి సరఫరా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెండేళ్లవుతున్నా సాకారమవ్వలేదు. రెండు నెలల కిందట హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసి చెప్పినా బల్దియా తీరుమారడం లేదు. మెట్రో వాటర్‌ బోర్డు విశ్రాంత ఇంజినీర్‌ను రంగంలోకి దింపినా ఫలితం లేదు.

* అమృత్‌, అర్బన్‌ మిషన్‌ భగీరథ తాగునీటి పథకం పనులు అసంపూర్తిగా ఉన్నాయి. లీకేజీలు, గ్రేటర్‌, పబ్లిక్‌హెల్త్‌ ఇంజినీర్ల సమన్వయ లోపంతో సమస్యలు పరిష్కారమవ్వడం లేదు.

* క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తాగునీళ్లు రోజూ కాకుండా దినం విడిచి దినం సరఫరా అవుతున్నాయి. ధర్మసాగర్‌లో సరిపడా నీళ్లు ఉన్నాయి.


4. బాహ్య అంతర వలయ రహదారులు

నగరం చుట్టూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించిన ఔటర్‌ రింగు రోడ్డు

* ఔటర్‌ రింగురోడ్డు నిర్మాణంతో రాజధాని హైదరాబాద్‌ రూపురేఖలే మారాయి. అలా ఓరుగల్లు చుట్టూ బాహ్య వలయ, అంతర వలయం (ఇన్నర్‌ రింగురోడ్డు) నిర్మించాల్సి ఉంది. ఔటర్‌ రింగు రోడ్డు సగం మాత్రమే అదీ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో 45 కిలోమీటర్లు రూ.వెయ్యి కోట్లతో నిర్మించాలి కానీ పనులు కావడం లేదు. ఇన్నర్‌ రింగు రోడ్డు కూడా ప్రారంభం కాలేదు.

* రంగశాయిపేట నాయుడు పంపు నుంచి ఎనుమాముల మీదుగా ఆరెపల్లి శివారు వరకు 9 కిలోమీటర్లు ఇన్నర్‌ రింగురోడ్డు ఏర్పాటు చేసేందుకు రూ.50 కోట్లు కేటాయించారు. ప్రైవేటు భూముల సేకరణ కోసం ‘కుడా’ రూ.100 కోట్లు ఖర్చు పెట్టింది. నిధుల కొరత, రెవెన్యూ శాఖాధికారుల నిర్లక్ష్యంతో మిగిలిన భూసేకరణ ముందుకు సాగడం లేదు.


5. కమిషనర్‌ కావాలి

నగర జనాభా 11 లక్షలు. 66 డివిజన్లు ఉన్న గ్రేటర్‌ వరంగల్‌కు రెండు నెలలుగా పూర్తిస్థాయి కమిషనర్‌ లేరు. ఇంతకాలం పనిచేసిన ఐఏఎస్‌ అధికారిణి ప్రావీణ్య వరంగల్‌ జిల్లా పాలనాధికారిగా పదోన్నతిపై వెళ్లారు. ఆమెకే కమిషనర్‌, ‘కుడా’ వీసీ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా కలెక్టర్‌ బాధ్యతలు ఎక్కువ. అదనంగా రెండు బాధ్యతలు చూడటం ఇబ్బందిగా మారింది.

* కమిషనర్‌ లేకపోవడంతో పాలన అదుపు తప్పింది. పౌరసేవలు జాప్యం, సిటిజన్‌ ఛార్టర్‌ అమలు పరచడం లేదు. అధికారులు, ఉద్యోగులు సరిగా పనిచేయడం లేదు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై పర్యవేక్షణ లేదు. విభాగాధిపతులు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. ప్రజావాణిలో వచ్చే సమస్యలు పరిష్కరించడం లేదు. కాజీపేట, కాశీబుగ్గ సర్కిల్‌ కార్యాలయాల్లో దస్త్రాలు కదలడం లేదు.

* ‘కుడా’లో అధికారుల ఇష్టారాజ్యమైంది. ముఖ్యమైన పనులు ముందుకు సాగడం లేదు. ఆ క్రమంలో అయిదు అంశాలపై మంత్రి కేటీఆర్‌ దృష్టి పెట్టి సమీక్షించి సమస్యను పరిష్కరిస్తే నగరవాసులకు సరైన పాలన అందుతుంది.


నగరం.. గులాబీ  వర్ణమయం

అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద..

నగరంలో శుక్రవారం మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా రోడ్లన్నీ ఫ్లెక్సీలతో నిండిపోయాయి. కూడళ్లు గులాబీ వర్ణమయంగా మారాయి. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్‌  వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

ఈనాడు, హనుమకొండ


పర్యటన ఇలా..

మధ్యాహ్నం 3 గంటలు: కిట్స్‌ కళాశాల
సాయంత్రం 4.30:  బాలసముద్రంలో హనుమకొండ జిల్లా భారాస కార్యాలయం ప్రారంభం
5.00 లష్కర్‌బజారు ప్రభుత్వ పాఠశాలకు..
5.30:  రంగశాయిపేట నాయుడు పంపు వద్ద వరంగల్‌ జిల్లా భారాస కార్యాలయానికి శంకుస్థాపన
6.00: ఇందిరానగర్‌ నాగూర్ల వెంకన్న ఇంటికి
6.30:  గాంధీనగర్‌లో వైకుంఠధామం ప్రారంభోత్సవం  
6.45: కాజీపేట సెయింటు గ్యాబ్రియల్‌ స్కూల్‌లో బహిరంగ సభ అనంతరం హైదరాబాద్‌ ప్రయాణం..

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని