logo

చరవాణి పోయిందా.. దొరుకుతుంది!

చరవాణి.. జీవితంలో భాగమైంది. పెరిగిన సాంకేతికత కారణంగా మాట్లాడటానికే కాదు.. సమాచారం తెలుసుకోవాలన్నా.. నగదు చెల్లింపులు చేయాలన్నా.. చదువు, పాటలు, సినిమాలు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు.. ఏదైనా దరఖాస్తు చేసుకోవాలన్నా.. దీనిపైనే ఆధారపడుతున్నాం.

Published : 12 May 2023 05:22 IST

‘సెయిర్‌’ పోర్టల్‌ను ఇలా సద్వినియోగం చేసుకోండి
భూపాలపల్లి క్రైం, న్యూస్‌టుడే 

చరవాణి.. జీవితంలో భాగమైంది. పెరిగిన సాంకేతికత కారణంగా మాట్లాడటానికే కాదు.. సమాచారం తెలుసుకోవాలన్నా.. నగదు చెల్లింపులు చేయాలన్నా.. చదువు, పాటలు, సినిమాలు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు.. ఏదైనా దరఖాస్తు చేసుకోవాలన్నా.. దీనిపైనే ఆధారపడుతున్నాం. అలాంటిది చోరీకి గురైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించనవసరం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం కొత్తగా సీఈఐఆర్‌ విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఏ కంపెనీకి చెందిన చరవాణి కొనుగోలు చేసినా ముందుగా దాని ఐఎంఈఐ నెంబరును దగ్గర పెట్టుకోవాలి. చరవాణి ఆచూకీ గుర్తించ డంలో ఇదే కీలకం.
వెబ్‌సైట్‌ ఇదే!

కేంద్ర టెలికం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌(సీఈఐఆర్‌) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం www.ceir.gov.in అనే వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి. అందులో రిక్వెస్ట్‌ ఫర్‌ బ్లాకింగ్‌ లాస్ట్‌ / స్టోలెన్‌ మొబైల్‌ లింక్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి.

అప్‌లోడ్‌ ఇలా చేయాలి.. వెంటనే బ్లాక్‌ అవుతుంది : పోయిన ఫోన్‌ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌  ఐడెంటిటీ) నెంబరు, కంపెనీ పేరు, మోడల్‌, సెల్‌ నంబర్‌, అందులోని కొన్ని నెంబర్లు, కొన్న బిల్లు వివరాలను అప్‌లోడ్‌ చేయాలి. చరవాణి ఏరోజు, ఎక్కడ పోయింది. రాష్ట్రం, జిల్లా, ఏ పరిధి పోలీసు స్టేషన్‌ వివరాలు నమోదు చేయాలి. చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మొయిల్‌ ఐడీ, ఓటీపీ కోసం ఫోన్‌ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా పూర్తయిన అనంతరం ఐడీ నెంబరు కేటాయిస్తారు. వెంటనే ఫోన్‌ బ్లాక్‌ అవుతుంది.

ఐడీ ఆధారంగా : ఫోన్‌ పరిస్థితిని తెలుసుకునేందుకు ఐడీ నెంబర్‌ ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా దర్యాప్తు ప్రక్రియతో పాటు మొబైల్‌ దొరికిందా లేదా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

చరవాణులు అందుకున్న బాధితులు

ఇలా కనుక్కుంటారు..

చరవాణి ఐఎంఈఐ సహాయంతో కాల్‌ డాటా రికార్డింగ్‌ (సీడీఆర్‌) విధానంతో పాటు ఇతర సాంకేతిక పద్ధతులు ఉపయోగించి సైబర్‌ క్రైం పోలీసులు పట్టుకోగలుగుతారు. వెబ్‌సైట్‌లో ఫోన్‌ వివరాల నమోదు పూర్తయిన తర్వాత అవన్నీ జిల్లా సైబర్‌ క్రైం విభాగంలోకి చేరుతుంది. వెంటనే వారు పరిశీలిస్తారు. కేసు ఛేదనలో కాల్‌ డాటా విధానాన్ని ఉపయోగిస్తారు. తద్వారా ఫోన్‌ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుంటారు.

దొరికితే అదే వెబ్‌సైట్‌లో అన్‌బ్లాక్‌ 

మొబైల్‌ ఏ కంపెనీదైనా సీఈఐఆర్‌ విధానం దాన్ని పనిచేయకుండా చేస్తుంది. చరవాణి దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్‌సైట్‌లోకి వెళ్లి అన్‌బ్లాక్‌ / ఫౌండ్‌ మొబైల్‌ అనే లింక్‌పై క్లిక్‌ చేయాలి. ఐడీ నమోదు చేయగానే ఫోన్‌ అన్‌బ్లాక్‌ అవుతుంది.

సందేహాలు సమాధానాలు..

ఐఎంఈఐ నెంబర్‌ లేకుంటే ఎలా..: చాలా మందికి ఐఎంఈఐ నెంబర్‌ తెలియకపోవచ్చు. వీరంతా మీసేవలో దరఖాస్తు చేయాలి. ఆ దరఖాస్తు, రసీదును పోలీసు స్టేషన్‌లో ఇవ్వాలి. సెల్‌ నెంబర్‌ ఆధారంగా ఐఎంఈఐ నెంబర్‌ను పోలీసులు వారి వెబ్‌సైట్‌లో గుర్తిస్తారు. ఈ నెంబర్‌ ఆధారంగా సీఈఐఆర్‌ పోర్టల్‌ సహాయం, ఇతర పరిజ్ఞానంతో ఫోన్‌ను పట్టుకుంటారు.

సెకండ్‌హ్యాండ్‌ ఫోన్‌ అయితే..: సెకండ్‌హ్యాండ్‌లో తక్కువ ధరకు చరవాణి వస్తుందని కొనుగోలు చేస్తారు. చోరీకి గురైతే దీన్ని కూడా సెయిర్‌ పోర్టల్‌ ద్వారా గుర్తించే అవకాశం ఉంది. 

కొన్నేళ్ల కిందట చోరీకి గురై ఉంటే..: గతంలో పోయిన ఫోన్లు కూడా సీఈఐఆర్‌ విధానంతో దొరికే అవకాశం ఉంది. సిమ్‌ ప్రస్తుతానికి పని చేస్తూ ఉండాలి. అప్పుడే గుర్తించే అవకాశం ఉంటుంది. ఫోన్‌ పోయిన వెంటనే ఆ నెంబర్‌తో కొత్త సిమ్‌ తీసుకోవాలి. ఐఎంఈఐ నెంబరు, సెల్‌ నెంబర్‌తో వెబ్‌సైట్‌లో వివరాలన్నీ నమోదు చేస్తే కొన్నేళ్ల కింద పోయినవి కూడా పట్టుకుంటారు.

* అపహరణకు గురైన చరవాణిలో వేరే సిమ్‌ వేసినప్పుడు వెంటనే సెల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. తద్వారా దాని లోకేషన్‌ సమాచారం అందనుంది.  


గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు..

- గుండేటి రాకేశ్‌, కాటారం

కాటారంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. కాటారం నుంచి గోదావరిఖనికి బస్సులో వెళ్తున్నాను. బస్సు దిగి జేబు చూసుకునే సరికి ఫోన్‌ కనిపించలేదు. వెంటనే సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశాను. కాటారం పోలీసులు మూడు గంటల వ్యవధిలో పట్టుకున్నారు.  


వెబ్‌సైట్‌తో ఎంతో ప్రయోజనం

- బోళ్ల సమ్మయ్య, చెల్పూర్‌

సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌ ఎంతో ప్రయోజకరంగా ఉంది. నా చరవాణి ఫిబ్రవరి 12న పోయింది. 16 రోజుల కిందట సైట్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేశాను. పోలీసులు కనుక్కొని వారం కింద తిరిగి ఇచ్చారు.


ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం

- సురేందర్‌రెడ్డి, ఎస్పీ, భూపాలపల్లి

సెయిర్‌ వెబ్సైట్‌ ఉపయోగాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. దొరికినవి ఎప్పటికప్పుడు బాధితులకు అందిస్తున్నాం. ప్రజలు ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు