logo

ప్రజా భాగస్వామ్యం.. స్వచ్ఛ నగరానికి శ్రీకారం

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 6 వేల పైచిలుకు పట్టణాల్లో ‘నా జీవితం.. నా స్వచ్ఛ నగరం (మేరా లైఫ్‌.. మేరా స్వచ్ఛ షెహర్‌) కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి జూన్‌ 5 వరకు నిర్వహిస్తోంది.

Published : 26 May 2023 03:52 IST

చెత్త రహితంగా మార్చేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రాలు

ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రంలో పాత దుస్తులు అందజేస్తున్న మహిళలు

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 6 వేల పైచిలుకు పట్టణాల్లో ‘నా జీవితం.. నా స్వచ్ఛ నగరం (మేరా లైఫ్‌.. మేరా స్వచ్ఛ షెహర్‌) కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి జూన్‌ 5 వరకు నిర్వహిస్తోంది. ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2023’ పోటీలో భాగంగా దీన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రెడ్యూస్‌, రీ యూజ్‌, రీ సైకిల్‌(ఆర్‌ఆర్‌ఆర్‌) కేంద్రాలు ఏర్పాటు చేశారు. నగరాన్ని చెత్తరహితంగా మార్చడమే వీటి లక్ష్యం.

ఏం చేస్తారంటే..

గ్రేటర్‌ వరంగల్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు చేపట్టి 66 డివిజన్లలో త్రిబుల్‌ ఆర్‌ కేంద్రాలను ప్రారంభించారు. ప్రజల నుంచి వినియోగించిన (పాత) పునరుత్పత్తి చేసే వస్తువులైన ప్లాస్టిక్‌, పాత దుస్తులు, పుస్తకాలు, పాద రక్షలు సేకరిస్తున్నారు. కేంద్రాల నిర్వహణ బాధ్యతలు స్థానిక స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. 15 రోజుల పాటు కేంద్రాలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చేస్తాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రానికి బహుమతులు ప్రదానం చేయనున్నారు.

ఇలా పనిచేస్తాయి..

* రెడ్యూస్‌: పాత దుస్తులను స్థానిక ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రంలో భద్రపరుస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలు వాటిని శుభ్రం చేసి మురికివాడల్లో నివసించే పేదలకు పంపిణీ చేస్తారు. చిత్తు కాగితాలు, పాత పుస్తకాలు సేకరించి హనుమకొండ పలివేల్పులోని ప్రధాన పొడి చెత్త నిర్వహణ కేంద్రానికి తరలిస్తారు.

* రీ యూజ్‌: పాత బూట్లు, పాదరక్షలు సేకరిస్తారు. వీటిని పొడి చెత్త నిర్వహణ కేంద్రానికి తరలిస్తారు. ఇందులో తోలు వేరు చేసి పునర్వినియోగిస్తారు.

* రీ సైకిల్‌: ప్లాస్టిక్‌ సంచులు, ప్లాస్టిక్‌ బాటిళ్లు, ఇ-వ్యర్థాలు సేకరిస్తారు. పొడి చెత్త నిర్వహణ కేంద్రానికి పంపిస్తారు. ఇక్కడ బెయిలింగ్‌ మిషన్‌తో కట్టలు కట్టి రీ సైక్లింగ్‌ ప్లాంట్లకు తరలిస్తారు.

అందుబాటులో కేంద్రాలు

* ‘నా జీవితం.. నా స్వచ్ఛ నగరం’ కార్యక్రమంలో ప్రజలందర్నీ భాగస్వాములను చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ), స్వచ్ఛ కార్యకర్తలు, ఆర్‌డబ్ల్యూఏ సభ్యులు, కాలనీ కమిటీలు, యువజన సంఘాలు పాలుపంచుకుంటున్నాయి..

* స్థానిక ప్రజలకు అందుబాటులో ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రం ఉంటుంది.  

* ప్రతి కేంద్రంలో 10 మంది సభ్యులుంటారు. ఇంటింటికెళ్లి పాత దుస్తులు, పుస్తకాలు, చిత్తు కాగితాలు, ప్లాస్టిక్‌, పాత బూట్లు, చెప్పులు సేకరిస్తారు.

* సాధారణ గృహాలు, దుకాణాలు, వ్యాపార వాణిజ్య కేంద్రాల నుంచి పాత వస్తువులు తీసుకుంటారు.

* ఆర్‌ఆర్‌ఆర్‌ సెంటర్లో ప్లాస్టిక్‌ సంచులు, ఫ్లెక్సీలు ఉండకుండా చూస్తారు.

అవగాహన కల్పిస్తున్నాం

‘నా జీవితం, నా స్వచ్ఛ నగరం’ కార్యక్రమంలో నగర ప్రజలందరినీ భాగస్వాముల్ని చేస్తాం. నగరంలోని 66 డివిజన్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. పాత దుస్తులు, పుస్తకాలు, చిత్తు కాగితాలు, పాత బూట్లు, ఇ-వ్యర్థాలు విధిగా అందజేసేలా అవగాహన కల్పిస్తాం. చారిత్రక ఓరుగల్లు నగరాన్ని చెత్త రహితం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి.

గుండు సుధారాణి, మేయర్‌, గ్రేటర్‌ వరంగల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని