logo

వానాకాలం సాగుకు ప్రణాళిక సిద్ధం

జిల్లాలో ఈ ఏడాది వానాకాలం పంటల సాగుకు జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది.

Updated : 26 May 2023 06:03 IST

జనగామ మండలం పెద్దపహాడ్‌లో నాట్లకు సిద్ధంగా ఉన్న వరి నారు

జనగామ రూరల్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఈ ఏడాది వానాకాలం పంటల సాగుకు జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. జిల్లాకు అనుకూలమైన, రైతులకు సౌకర్యవంతమైన వరి, పత్తి, కందులు, మొక్కజొన్న, పెసర పంటలకే అధికారులు ప్రణాళికలో ప్రాధాన్యమిచ్చారు.  మొత్తం 3,76,625 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. జిల్లాలో ఎర్ర, నల్ల రేగడి నేలలు ఎక్కువగా ఉండటం.. నీటి వనరుల లభ్యత, వాతావరణ పరిస్థితుల ఆధారంగా అధికారులు ప్రణాళికను రూపొందించారు.
జిల్లాలో ప్రధానంగా సాగవుతున్న వరి, పత్తి, కంది, మొక్కజొన్న పంటలకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను దిగుమతి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రోహిణి కార్తె రావడంతో రైతులు సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల రైతులు వరి నార్లు పోయడం, దుక్కులను సిద్ధం చేసుకోవడం, మరి కొందరు నార్లు పోసేందుకు, పత్తి విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో పత్తి 5,10,000 ప్యాకెట్లు, వరి 57,000 క్వింటాళ్లు, కందులు 440, మొక్కజొన్న 320, వేరుసెనగ 200, పెసర 66 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఎరువులు (మెట్రిక్‌ టన్నుల్లో) .. యూరియా 43,312, డీఏపీ 18,831, ఎంఓపీ 7,533, కాంప్లెక్స్‌ 15,065 అవసరమవుతాయని అధికారులు గుర్తించారు.

ఎరువుల  కొరత లేకుండా చర్యలు

వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధం చేశాం. అవసరమైన మేరకు దిగుబడి చేసేందుకు చర్యలు చేపట్టాం. ప్రధాన పంటలైన వరి, పత్తి, కంది, మొక్కజొన్నతో పాటు పప్పు ధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తాం.

వినోద్‌కుమార్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని