logo

ఫిస్ట్‌బాల్‌లో రాణిస్తున్న యువకులు

జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన ఇద్దరు యువకులు ఫిస్ట్‌బాల్‌ క్రీడలో రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చుతున్నారు.

Updated : 26 May 2023 06:04 IST

తమిళనాడులో బంగారు పతకం సాధించిన తెలంగాణ జట్టు సభ్యులు(పాతచిత్రం)

పాలకుర్తి, న్యూస్‌టుడే: జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన ఇద్దరు యువకులు ఫిస్ట్‌బాల్‌ క్రీడలో రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చుతున్నారు. పలు పోటీల్లో పాల్గొని పతకాలు, బహుమతులు అందుకున్నారు. ఇతర దేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ క్రీడ ఇప్పుడిప్పుడే మన దేశంలో ఆదరణ పొందుతోంది.

ఆట వివరాలివి..

ఫిస్ట్‌బాల్‌ కోర్టు 50 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఒక్కో జట్టులో మొత్తం 10 మంది క్రీడాకారులు ఉంటారు. వీరిలో  ఐదుగురు మైదానంలో ఆడతారు. మరో ఐదుగురు ప్రత్యామ్నాయ సభ్యులుగా కోర్టు వెలుపల ఉంటారు. కోర్టులో ఆడుతున్న సమయంలో ఎవరికైనా గాయాలైతే.. బయట ఉన్న వారు జట్టు తరఫున వెంటనే బరిలోకి దిగుతారు. ఆట మొత్తం మూడు సెట్లలో ఉండగా.. 11 పాయింట్లు ఉంటాయి. ఒక జట్టు రెండు సెట్లలో గెలిస్తే విజేతగా ప్రకటిస్తారు. ఈ ఆట కొద్దిగా వాలీబాల్‌ క్రీడను పొలి ఉంటుంది.

సాధించిన విజయాలు

తెలంగాణ జట్టులో చెన్నూరుకు చెందిన బాలబోయిన సందీప్‌, జోడు సంతోష్‌ కొన్నేళ్లుగా ఆడుతున్నారు.  గతేడాది మార్చిలో జరిగిన సౌత్‌జోన్‌ జాతీయస్థాయి పోటీల్లో వీరు ప్రథమస్థానంలో నిలిచారు. 2020-21లో 4వ సీనియర్‌ జాతీయస్థాయి ఛాంపియన్‌షిప్‌ (తమిళనాడు, కాంచిపురం)పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడి బంగారు పతకం సాధించారు. 2022 ఆగస్టులో పంజాబ్‌(లుథియానా)లో జరిగిన పోటీల్లో నాల్గో స్థానంలో, 2021 బిహార్‌లో జరిగిన పోటీలో ప్రథమస్థానం సాధించారు.  గతేడాది జూన్‌లో హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని నాల్గో స్థానంలో నిలిచారు.

నాలుగేళ్ల క్రితం ఎంపికయ్యాను

ఫిస్ట్‌బాల్‌ క్రీడపై నేటితరం యువకులు ఆసక్తి చూపాలి. హైదరాబాద్‌లో శిక్షణ తీసుకొని రాష్ట్రస్థాయి జట్టుకు నాలుగేళ్ల క్రితం ఎంపికయ్యాను. అప్పటి నుంచి తెలంగాణ తరఫున ఆడుతూ విజయాలు సాధిస్తున్నాం. చెన్నూరుకు చెందిన జోడు సంతోష్‌ నైపుణ్యం కలిగిన క్రీడాకారుడు. ఆయనతో కలిసి ఆడటం చాలా సంతోషంగా ఉంటుంది.

బాలబోయిన సందీప్‌, క్రీడాకారుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని