logo

భగ్గుమంటున్న డంపింగ్‌ యార్డులు

స్వచ్ఛ భూపాలపల్లి అంటూనే స్వచ్ఛతకు తూట్లు పొడుస్తున్నారు. తడి, పొడి చెత్తపై అవగాహన పెంచాలంటూనే చెత్త కుప్పలను గుట్టలుగా పోస్తున్నారు.

Published : 26 May 2023 03:52 IST

నిప్పంటుకున్న చెత్త కుప్పలు

న్యూస్‌టుడే, భూపాలపల్లి: స్వచ్ఛ భూపాలపల్లి అంటూనే స్వచ్ఛతకు తూట్లు పొడుస్తున్నారు. తడి, పొడి చెత్తపై అవగాహన పెంచాలంటూనే చెత్త కుప్పలను గుట్టలుగా పోస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం సూచనలకు పురపాలిక అధికారుల ఆచరణకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. సుమారు రెండు ఎకరాల్లో విస్తరించి ఉన్న డంపింగ్‌ యార్డు పర్యవేక్షణను పూర్తిగా గాలికొదిలేశారు. అపరిశుభ్రతతో పాటు అనారోగ్య సమస్యలకు కారణంగా నిలుస్తోంది. యార్డును చదును చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఇదేంటని పాలకవర్గం ప్రశ్నించే పరిస్థితుల్లో లేదు. వేసవి వచ్చిందంటే యార్డులో చెలరేగుతున్న మంటలతో చుట్టుపక్కల ఉన్న వందలాది చెట్లకు నష్టం ఏర్పడుతోంది. ముఖ్యంగా డంపింగ్‌ యార్డు పక్కనే సింగరేణి యాజమాన్యం నిర్మించిన సోలార్‌ విద్యుత్తు ప్లాంటుకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 30 వార్డులుండగా ఇందులోని 24 వార్డుల్లో సేకరించిన చెత్తంతా సీఆర్‌నగర్‌ ప్రాంతంలోని డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. ప్రతిరోజు సుమారు తొమ్మిది టన్నుల వరకు చెత్తను సేకరిస్తున్నారు. మున్సిపల్‌ పరిధిలో చెత్తను చదును చేసే యంత్రాలు లేవు. మంటలు ఆర్పేందుకు వాటర్‌ ట్యాంకర్లు అందుబాటులో లేవు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

* డంపింగ్‌ యార్డులో రాత్రి పగలూ కాపలాదారులను నియమించాలి.

* యార్డులో భారీ మొత్తంలో చెత్త కుప్పలుగా పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

* సాధ్యమైనంత వరకు యార్డులో పేరుకుపోయిన చెత్త కుప్పలను చదును చేసే ప్రక్రియ ప్రతి రోజు కొనసాగాలి. గతంలో శ్మశానవాటిక ప్రాంతంలో పోసిన చెత్త మంటలు అంటుకోవడంతో జనాలకు ఇబ్బంది ఏర్పడింది.

* డంపింగ్‌ యార్డులో శాశ్వత పరిష్కారంగా తప్పనిసరిగా వాటర్‌ సంపుల నిర్మాణం ఉండాలి. దాదాపు 25 వేల లీటర్ల నీటిని నిల్వ చేసుకునేలా సంపులను అందుబాటులోకి తీసుకురావాలి.

* ప్రమాద సమయాల్లో అగ్నిమాపక శకటం సంఘటన స్థలానికి రావడానికి అనుకూలంగా రహదారి ఉండేలా చర్యలు తీసుకోవాలి.

అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి

డంపింగ్‌ యార్డుతో కాలనీవాసులకు అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. కాలనీలో చాలా మంది నిరుపేద కుటుంబాలకు చెందినవారే నివాసం ఉంటున్నారు. పిల్లలు, పెద్దలు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. డంపింగ్‌ యార్డుకు వ్యర్థాలను తీసుకొచ్చి ఇష్టానుసారం పడేయడం, కాలినప్పుడల్లా కాలుష్యం, పొగ కమ్ముకోవడంతో శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్నాం.

పాషా, సీఆర్‌నగర్‌

పశువులు మృత్యువాత పడుతున్నాయి

డంపింగ్‌ యార్డులో పేరుకుపోయిన చెత్తను చదును చేయకపోవడంతో చెత్త కుప్పలపై ప్లాస్టిక్‌ కవర్లు తిని పశువులు ఇప్పటి వరకు పదుల సంఖ్యలో మృతి చెందాయి. డంపింగ్‌ యార్డులో చెలరేగుతున్న మంటలతో వెలువడే పొగ కిలోమీటర్‌ దూరం వరకు కమ్మేస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో తిరిగే జనాలకు దగ్గు, ఆయాసం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. యార్డును సమర్థంగా నిర్వహించాలి.

రమేష్‌, శాంతినగర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు