logo

కొబ్బరి బోండం.. మరింత ప్రియం!

వేసవి ఎండల నుంచి కాస్త ఉపశమనం ఇచ్చే కొబ్బరి బోండాల ధరలు భారీగా పెరిగాయి. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు రవాణా ఛార్జీల భారం కూడా కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

Updated : 27 May 2023 06:25 IST

న్యూస్‌టుడే, బాలసముద్రం

వేసవి ఎండల నుంచి కాస్త ఉపశమనం ఇచ్చే కొబ్బరి బోండాల ధరలు భారీగా పెరిగాయి. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు రవాణా ఛార్జీల భారం కూడా కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, రాజమండ్రి, చింతపుడి, నిడదవోలు, పాలకొల్లు పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు కొబ్బరి బోండాలు దిగుమతి అవుతుంటాయి. ఆ ప్రాంతాల్లో విపరీతంగా పెరిగిపోతున్న ఎండల కారణంగా చెట్ల పైకి ఎక్కి కాయలు కోసే కూలీలు రావడం లేదని దిగుమతిదారులు చెబుతున్నారు. బెంగళూరు, కేరళ ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. దీంతో రవాణా ఛార్జీలను కలుపుకొని ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉత్పత్తి తగ్గి వినియోగం పెరిగింది..

మే మొదటి వారంలో బోండాల ధరలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. పది రోజుల నుంచి ఎండల తీవ్రత పెరగడంతో జనం ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. నగరంలో ఒక్కసారిగా వినియోగం పెరగడంతో అరకొరగా వస్తున్న సరకు సరిపోవడం లేదు.

* వరంగల్‌ నగరంలోని ప్రధాన కేంద్రాల్లో టోకు విక్రేతలు ఉన్నారు. వీరి నుంచి విడిగా విక్రయించే వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. నగరానికి విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు వస్తుంటారు. దీంతో ఈ వేసవిలో రోజుకు సగటున లక్ష బోండాలు అమ్ముతున్నారు. సుమారు 500 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

బోండం ధర నెల కిందట రూ.30 ఉండేది.. ప్రస్తుతం రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. లీటరు కొబ్బరు నీటికి రూ.100 తీసుకునేవారు. అలాంటిది రూ.130 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. పూజలకు వినియోగించే కొబ్బరి కాయ ధర రూ.5 వరకు పెరిగింది.


తప్పనిసరిగా కొంటున్నాం

సాత్‌పడి ఆంజనేయులు, నయీంనగర్‌

నెల కిందట బోండాల ధరలు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఒక్కసారిగా  పెరిగాయి. మండుతున్న ఎండల కారణంగా కొనాల్సిన పరిస్థితి. నగరంలో కొన్ని చోట్ల బోండాలు విక్రయించే దుకాణాలను సరకు అందక మూసి వేశారు.


సరిపడా అందడంలేదు

తౌటం సదానందం, టోకు వ్యాపారి, హనుమకొండ

రోజుకు ఒక లారీ కొబ్బరి బోండాలు కావాలని ఆర్డరు చేస్తే వారానికి ఒక లారీ పంపిస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం అక్కడ కాయలు తెంపే కూలీల కొరత ఏర్పడింది. కొన్ని సార్లు సరకు అందక దుకాణం మూసివేస్తున్నాం. వినియోగదారులతో పాటు రిటైల్‌ వ్యాపారులు సైతం ఇబ్బంది పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని