logo

ధాన్యం సొమ్ముకు అన్నదాతల ఎదురుచూపులు

జిల్లాలో ఏప్రిల్‌ చివరి నుంచి జిల్లా పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Updated : 29 May 2023 05:01 IST

బచ్చన్నపేట మండలం ఆలింపూర్‌లో కొనుగోలు కేంద్రం

జనగామటౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఏప్రిల్‌ చివరి నుంచి జిల్లా పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఐకేపీ కేంద్రాల నుంచి జిల్లాలో ఎంపిక చేసిన 38 రైస్‌ మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిన రైతుల ఖాతా, ఇతర వివరాలతో జిల్లా పౌరసరఫరాలశాఖ కార్యాలయానికి పంపించిన తర్వాత ప్రభుత్వం పౌరసరఫరాల శాఖకు ఇస్తున్న డబ్బుల ఆధారంగా రైతులకు సొమ్ము చెల్లిస్తున్నారు.


1.11 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్ల సేకరణ

ఏప్రిల్‌ చివరి వారం నుంచి జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో మొత్తం 195 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది యాసంగి లక్ష్యంగా 1.90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నాటికి 1.11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇప్పటికే 35 కేంద్రాల పరిధిలో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవడంతో కేంద్రాలను ఎత్తివేశారు. మరో 165 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రాకుండా కలెక్టర్‌ శివలింగయ్య ఆధ్వర్యంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రతి రోజూ గ్రామాల్లో పర్యటిస్తూ.. కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు ధాన్యం తరలింపు, తరుగు తీత.. తదితర విషయాల్లో మిల్లర్లకు కచ్చితమైన నిబంధనలు విధించారు.  ధాన్యంలో ఇష్టానుసారంగా తరుగు తీయకుండా పౌరసరఫరాలశాఖ అధికారులే కాకుండా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌, వెస్ట్‌జోన్‌ డీసీపీ సీతారాం తదితరులు కూడా రైస్‌మిల్లులను తనిఖీ చేస్తుండడం గమనార్హం.


చెల్లించాల్సింది రూ.128 కోట్లు

జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి అక్కడి రైస్‌మిల్లులకు, ఆ తర్వాత జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి ధాన్యం సొమ్ము చెల్లింపు కోసం రైతుల వివరాలను పంపిస్తున్నారు. శుక్రవారం నాటికి రైతులకు ఇంకా రూ.128 కోట్ల  సొమ్ము చెల్లించాల్సి ఉంది. జిల్లా పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో రూ.41 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా రూ.87 కోట్ల సొమ్ము.. కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లుల వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం నుంచి జిల్లా పౌరసరఫరాలశాఖ కార్యాలయానికి వస్తున్న డబ్బుల ఆధారంగా రైతులకు చెల్లింపులు చేస్తున్నారు. ఒక్కో రైతుకు తన పంట విక్రయించాక సుమారు 15 నుంచి 20 రోజుల్లోగా ధాన్యం సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది.


జాప్యం లేకుండా చర్యలు

- సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్‌

జిల్లా వ్యాప్తంగా రైతులకు సజావుగా ధాన్యం సొమ్ము చెల్లిస్తున్నాం. రైతుల వివరాలను సకాలంలో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బుల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. రైతులకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని