logo

తండ్రిపై కత్తితో దాడి చేసిన తనయుడు

తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కొడుకే కాలయముడిగా మారి వృద్ధుడైన తండ్రిపై కత్తితో దాడి చేసిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో ఆదివారం చోటు చేసుకుంది.

Published : 29 May 2023 03:16 IST

తీవ్ర గాయాలతో రాములునాయక్‌

తొర్రూరు, న్యూస్‌టుడే: తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కొడుకే కాలయముడిగా మారి వృద్ధుడైన తండ్రిపై కత్తితో దాడి చేసిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో ఆదివారం చోటు చేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే స్థానిక ఆర్టీసీ బస్టాండులో అందరూ చూస్తుండగానే వృద్ధుడిని కత్తితో పొడిచి గాయపరిచాడు. తొర్రూరు రెండో ఎస్సై లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం టేకులకుంట తండాకు చెందిన మాలోతు రాములునాయక్‌ (75)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు  శంకర్‌, చిన్నకుమారుడు స్వామినాయక్‌ నెక్కొండలో నివాసముంటుండగా రాములునాయక్‌ టేకులకుంటతండాలో నివాసముంటున్నాడు. భూమి పంపకం విషయంలో కొన్ని రోజులుగా రాములునాయక్‌, స్వామినాయక్‌ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాములునాయక్‌ మూడు రోజుల క్రితం మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం చారితండాలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఆదివారం తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సులో తొర్రూరు బస్టాండుకు వచ్చి దిగాడు. అప్పటికే బస్టాండ్‌లో మాటువేసి ఉన్న స్వామినాయక్‌ వెంట తెచ్చుకున్న కత్తితో తండ్రి మెడ, కుడిచేతిపై నరికాడు.  అక్కడున్న ప్రయాణికులు కేకలు వేయడంతో స్వామినాయక్‌ ద్విచక్రవాహనంపై అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వృద్ధుడిని 108 వాహనంలో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రాములునాయక్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. రాములునాయక్‌ పెద్దకుమారుడు శంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు