logo

శాలసిద్ధి.. పాఠశాలల సమగ్రాభివృద్ధి

పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా ‘శాలసిద్ధి’ కార్యక్రమం అమలుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. పాఠశాలల స్వరూపం, బలాలు, బలహీనతలు వెల్లడించే సమగ్ర దర్పణంగా దీన్ని పరిగణిస్తున్నారు.

Published : 31 May 2023 05:03 IST

జిల్లా నుంచి 30 బడుల ఎంపిక
న్యూస్‌టుడే, భూపాలపల్లి

భూపాలపల్లి పాఠశాలలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు

పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా ‘శాలసిద్ధి’ కార్యక్రమం అమలుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. పాఠశాలల స్వరూపం, బలాలు, బలహీనతలు వెల్లడించే సమగ్ర దర్పణంగా దీన్ని పరిగణిస్తున్నారు. గతంలో పాఠశాలల పునఃప్రారంభం కాగానే ఉపాధ్యాయుల సహకారంతో ఏడు కేటగిరీల్లో 46 రకాల అంశాలపై సమాచారాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులకు పంపేవారు. శాలసిద్ధిలో పొందుపర్చిన వివరాలు, జరుగుతున్న అభివృద్ధికి పొంతన ఉండటం లేదు. అందుకే విద్యాశాఖ ‘శాలసిద్ధి’ కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి పకడ్బందీగా నిర్వహించి, సరైన వివరాలను సేకరించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాలల ప్రణాళిక, పరిపాలనా సంబంధ జాతీయ విశ్వవిద్యాలయం (ఎన్‌యూఈపీఏ) ఆధ్వర్యంలో పాఠశాల ప్రమాణాలు మూల్యాంకనానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ప్రతి పాఠశాలను ఒక వ్యవస్థగా మూల్యాంకనం చేయడం, జవాబుదారీతనంతో ముందడుగు వేసే సంస్కృతిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మొదటి విడతలో ఒక్కో జిల్లా నుంచి 8 మంది హెచ్‌ఎంలకు హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కల్పించారు. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తమ పాఠశాల వనరులు, అభివృద్ధి లక్ష్యాలు, ఆటంకాలు, వాటిని అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. పాఠశాల నేడు ఏ స్థాయిలో ఉంది..? అత్యున్నత స్థాయికి వెళ్లాలంటే ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలనేది నిర్ధారించుకోవాలి.. దీనికిగాను పాఠశాల సిబ్బంది ఒక ప్రణాళిక తయారు చేసుకొని, దాన్ని సాధించడానికి నివేదిక రూపొందించుకోవాల్సి ఉంటుంది. అన్ని రకాలైన ప్రధాన అంశాలపై సమగ్ర అవగాహన పెంచుకొని పాఠశాల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రచన చేయాలి.

సేకరించే అంశాలు ఇవే..

* పాఠశాలకు అవసరమైన వనరులు, వినియోగం * బోధనాభ్యాసన మదింపు * విద్యార్థుల ప్రగతి సాధన, అభివృద్ధి * ఉపాధ్యాయుల పనితీరు, వృత్తిపరమైన అభివృద్ధి నిర్వహణ * పాఠశాల నాయకత్వం, నిర్వహణ * సమ్మిళిత విద్య ఆరోగ్యం, భద్రత * ఉపయుక్తమైన సహజ భాగస్వామ్య తదితర అంశాలు

విద్యార్థులు ఎక్కువ ఉన్న పాఠశాలల్లో..

2023-24 విద్యా సంవత్సరంలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ప్రతి జిల్లా నుంచి విద్యార్థులు ఎక్కువగా ఉన్న 30 పాఠశాలలను మొదటి దశలో ఎంపిక చేశారు. ఇందులో 10 ఉన్నత పాఠశాలలు, 5 ప్రాథమికోన్నత, 15 ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి. ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, ఇద్దరు ఉపాధ్యాయులు, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల నుంచి ప్రధానోపాధ్యాయుడు, ఒక ఉపాధ్యాయుడు జిల్లా ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా ముందుకు సాగుతారు. వారు సేకరించిన వివరాలను ప్రత్యేక వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. జిల్లాలో మొత్తం 69 ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు 44, ప్రాథమిక పాఠశాలలు 319 వరకు ఉన్నాయి.


కచ్చితమైన సమాచారం ఇవ్వాలి

- కిషన్‌రావు, ఏఎంవో భూపాలపల్లి

సమగ్ర వికాసానికి ఎంతో దోహదపడే కార్యక్రమం. దీని అమలుకు ఎంపిక చేసిన పాఠశాలల నుంచి కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలి. ప్రధానోపాధ్యాయులు సరైన అవగాహనతో సమాచారం అందించాలి. కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయుడు పాలుపంచుకొని, పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని