logo

మంత్రి వర్యా దృష్టి సారించండి!

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అనేక రకాల పథకాలను తెస్తున్నా క్షేత్రస్థాయిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అనేక సమస్యలు వెంటాడుతున్నాయి.

Published : 31 May 2023 05:03 IST

ఈనాడు, వరంగల్‌, ఎంజీఎం ఆసుపత్రి, నయీంనగర్‌, న్యూస్‌టుడే

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అనేక రకాల పథకాలను తెస్తున్నా క్షేత్రస్థాయిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. బుధవారం హనుమకొండ జిల్లాలో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటన నేపథ్యంలో వైద్యపరంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లావాసులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం..

పర్యటన వివరాలు

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం వరంగల్‌ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మధ్యాహ్నం 12.45:  హంటర్‌ రోడ్డులోని ఫాదర్‌ కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ప్రారంభిస్తారు.
2.45: హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో నిర్మించిన రేడియాలజీ ల్యాబు(టీహబ్‌) ప్రారంభోత్సవం.
3.30: కాకతీయ మెడికల్‌ కాలేజీలో రూ.28 కోట్లతో నిర్మించిన అకడమిక్‌ బ్లాక్‌ ప్రారంభిస్తారు.
సాయంత్రం 4.15: వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించి సమీక్షిస్తారు.
5.15: హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.
6.00: హనుమకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఆడిటోరియంలో కార్మిక యుద్ధభేరి సభలో పాల్గొంటారు.
7.30: హనుమకొండ నుంచి సిద్దిపేటకు బయలుదేరుతారు

బీపీ యంత్రం పనిచేయక వెనుదిరుగుతూ...

వెల్‌నెస్‌ సెంటర్‌లో అన్నీ సమస్యలే

హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వెల్‌నెస్‌ కేంద్రం సమస్యలకు నిలయంగా మారింది. ఉమ్మడి జిల్లా ఉద్యోగులు, పాత్రికేయులకు మెరుగైన వైద్యసేవలందించాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటుచేశారు.

* ఇక్కడ ప్రధాన పరీక్షలు జరిపే యంత్రాలన్నీ మూలన పడున్నాయి. 8 నెలల కిందట నుంచే రక్తపోటును నిర్ధారించే పరీక్షలు చేయడం లేదని రోగులు చెప్పారు. ఎవరైనా బీపీ పరీక్షలను చేయించుకోవడానికి వస్తే వారిని బయటకు పంపించేస్తున్నారు.

* ఔషధాల కొరత వేధిస్తోంది. వైద్యులు రాసిచ్చే చీటీలో 8 రకాల మందులుంటే సిబ్బంది ఒకటి రెండు మాత్రమే ఇస్తున్నారు. మిగిలినవి బయట కొనమని చెబుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా ఇక్కడ బీపీ, చక్కెర వ్యాధి మందుల కొరత ఉంది.

సమయపాలన పాటించని వైద్యులు..: వైద్యులు సమయపాలన పాటించడం లేదు..  మంగళవారం ‘ఈనాడు, ఈటీవీ’ బృందం వెళ్లి చూడగా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఇద్దరు వైద్యుల్లో ఒకరు ఉదయం పూట అలా వచ్చి వెళ్తున్నారని చెబుతున్నారు.

* నిపుణులైన  వైద్యుల కొరత వేధిస్తోంది. ఎముకలు, జనరల్‌ ఫిజీషియన్‌, గైనకాలజీ విభాగాలలో ఒక్కొక్కటి చొప్పున ఖాళీలు ఉన్నాయి.  దీనిపై వెల్‌నెస్‌ సెంటర్‌ బాధ్యుడు డాక్టర్‌ కమల్‌చంద్‌ నాయక్‌ను వివరణ కోరగా, ఆసుపత్రిలో మందులు, వైద్యుల కొరత ఉన్నది వాస్తవమేనని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించామని చెప్పారు. పది రోజుల్లోపు అన్ని మందులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వైద్యుల నియామకానికి సంబంధించి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు

కేఎంసీలో రోగ నిర్ధారణ పరీక్షలకు ఇక్కట్లు

కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సూపర్‌ స్పెషాలిటీ వైద్య శాలలో తగినంత మంది వైద్యుల నియామకం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ రోగ నిర్ధారణ పరీక్షల నమూనాలు తీసుకుంటున్నా వాటిని పరీక్షించేందుకు ఎంజీఎంపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రయోగశాల, పరికరాలు ఉన్నా, పాథాలజిస్టు, మైక్రోబయాలజిస్టులు లేక రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించడం లేదు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఎంజీఎంకు అనుబంధంగా పనిచేస్తోంది. దీనికి ప్రత్యేక హోదా ఇచ్చి నిధులు కేటాయిస్తే  వైద్య సేవలు వేగంగా అందే అవకాశం ఉంది.

కేఎంసీలోని హనుమకొండ జిల్లా క్షయనివారణ కేంద్రాన్ని తెలిపే బోర్డు ఏర్పాటు చేయలేదు. రోగులు వెతుక్కుంటూ వస్తున్నారు

టీబీ కేంద్రాల సూచిక లేక అయోమయం

కాకతీయ మెడికల్‌ కాలేజీ ఆవరణలోని హనుమకొండ జిల్లా క్షయ నివారణ కేంద్రానికి నేమ్‌ బోర్డు లేక ఆ కేంద్రం తెలుసుకొని వెళ్లడానికి రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎంజీఎం కూడలిలో ఉండేది. వరంగల్‌, హనుమకొండ జిల్లాలు ఏర్పడిన తర్వాత కేఎంసీలోకి మార్చారు. దీంతో వైద్యం కోసం వచ్చిన రోగులు ముందు ఎంజీఎం కూడలిలోని వరంగల్‌ క్షయ నివారణ కేంద్రానికి వస్తున్నారు. హనుమకొండ జిల్లా రోగులకు కేఎంసీలోని  కేంద్రంలో చికిత్స అందిస్తున్నారని ఇక్కడి సిబ్బంది చెప్పి పంపిస్తున్నారు. చాలా మందికి కేఎంసీలోని కేంద్రం తెలియక సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి, మెడికల్‌ కాలేజీలోకి వెళ్లి అయోమయానికి గురవుతున్నారు.

ఎంజీఎం కూడలిలోని వరంగల్‌ జిల్లా క్షయ నివారణ కేంద్రంలో వైద్యుడు లేక నిరీక్షిస్తున్న రోగులు

వైద్యుడి కొరత

ఎంజీఎం కూడలిలోని వరంగల్‌ జిల్లా క్షయ నివారణ కేంద్రంలో వైద్యుడు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.  ప్రభుత్వం నుంచి ఈకేంద్రానికి మంజూరైన పోస్టులు లేకపోవడంతో ఈకేంద్రంలో ఇద్దరు ల్యాబు టెక్నీషియన్లు, ఒకహెల్త్‌ సూపర్‌వైజర్‌ తప్ప కనీసం ఒక అటెండర్‌ సైతం లేరు.  తెమడ పరీక్షల కోసం సీబీ, ట్రూనాట్ పరీక్ష యంత్రాలుండాలి. ప్రస్తుతం ఇక్కడ ఒక ట్రూనాట్ యంత్రం మాత్రమే ఉంది.  


థైరాయిడ్‌ మందులు లేవు

- సముద్రాల లక్ష్మీనారాయణ, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు

రెండేళ్లుగా ఇక్కడికి వస్తున్నా. బీపీ, మధుమేహం మందులు కొరత ఉంది. ఇక్కడ అందిస్తున్న వైద్యసేవలపై సంతృప్తి కలగడం లేదు. థైరాయిడ్‌ మందుల కొరత కూడా ఉంది. ప్రభుత్వం స్పందించి వైద్యసేవలను మెరుగుపరచాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని