logo

లారీలు రావు.. ధాన్యం తరలదు!

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘ఈనాడు’ నిర్వహించిన వీడియో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది.

Updated : 31 May 2023 05:47 IST

వీడియో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి విశేష స్పందన
ఈనాడు వీడియో కాల్‌

రైతులతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ శ్రీరాములు

ములుగు, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘ఈనాడు’ నిర్వహించిన వీడియో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వీడియో కాల్‌ ద్వారా వారి సమస్యలను ఏకరువు పెట్టారు. రైతుల సమస్యలకు పౌరసఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ శ్రీరాములు ఓపికతో సమాధానం చెప్పారు. వెంటనే లారీలు, సంచులను సమకూర్చుతామని హామీ ఇచ్చారు.

గోనె సంచులు లేవంటున్నారు. ధాన్యం తూకం వేసిన తర్వాత కూడా ధాన్యం తరలించాలంటే లారీలు రావడం లేదు. వెంటనే సంచులు, లారీలు సమకూర్చాలి.

తొట సంపత్‌, వెంకటాపూర్‌ మండల కేంద్రం

కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ద్వారా ఇండెంట్‌ పెట్టి ఫోన్‌ చేయమనండి. సంచులకు ఎలాంటి కొరత లేదు. లారీలు కూడా పంపిస్తాం.

కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి రెండు నెలలు అవుతోంది. తేమ వచ్చింది. పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తూకం వేసిన ధాన్యం బస్తాలను తరలించేందుకు లారీలు రావడం లేదు. ఈ రోజు కురిసిన వర్షానికి సంచులు తడిచాయి. మళ్లీ వాటిని ఆరబెడుతున్నాం. ఏం చేయాలో తోచడం లేదు.

బోయిని చిన ఓదెలు: మంగపేట

ఈ రోజు లేక రేపు లారీలు పంపిస్తాం. ఇప్పుడే సొసైటీ సీఈవోతో మాట్లాడతా. లారీలు పంపించే ఏర్పాటు చేస్తా.

ధాన్యం బస్తాలను చూపిస్తున్న రైతు

గోవిందరావుపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసి చాలా రోజులవుతోంది. వాటిని మిల్లుకు తరలించేందుకు లారీలు రాక ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే లారీలను సమకూర్చాలి.

ఆకుల సోమా, గోవిందరావుపేట

జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ శ్రీరాములు : లారీలు పంపించే ఏర్పాట్లు చేస్తాం.

ఐకేపీ ఆధ్వర్యంలో ఏటూరునాగారంలోని ఆకులవారి గణపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లారీలు మాత్రం రావడం లేదు. లారీ పంపడానికి డబ్బులు అడుగుతున్నారు. 

చిక్కుల విజయ్‌, ఏటూరునాగారం

లారీలు పంపించే ఏర్పాటు చేస్తాం.  మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగితే మాకు సమాచారం ఇవ్వండి వారిపై చర్యలు తీసుకుంటాం.

తేమ వచ్చి చాలా రోజులైంది. ఈ రోజు వర్షం పడి ధాన్యం తడిచింది. సంచులను ఎప్పుడు ఎత్తుతారో తెలియడం లేదు. సంచులు కూడా లేవంటున్నారు.

ఆకుల భోజ ఏటూరునాగారం

లారీలు పంపించే ఏర్పాటు చేస్తాం. అక్కడ సేకరించిన ధాన్యాన్ని ఏటూరునాగారంలోనే నిల్వ చేసేందుకు ఒక గోదామును కూడా ఎంపిక చేశాం. సంచులు కూడా పంపిస్తాం.

ఏటూరునాగారంలోని జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలు రావడం లేదు. తూకం వేసి ఐదు రోజులవుతోంది.

పుట్ట శ్రీనివాస్‌

లారీలను పంపించే ఏర్పాటు చేస్తా

ధాన్యం నిర్దేశించిన ప్రకారం తేమ శాతం వచ్చింది. టోకెన్‌ కూడా ఇచ్చారు. అయినప్పటికీ లారీలు రాక సంచులు కొనుగోలు కేంద్రంలోనే నిల్వ ఉన్నాయి. ఒకవేళ లారీలో ఎత్తినా మిల్లుల వద్ద దిగుమతి ఆలస్యమవుతోంది.

పిట్టల శ్రీకాంత్‌, తాడ్వాయి

లారీలు పంపించే ఏర్పాటు చేస్తాం. కేంద్రం ఇన్‌ఛార్జితో ఫోన్‌ చేయించండి. ఈ రోజు ఒకటి, రేపు ఒకటి పంపించే ఏర్పాటు చేస్తాం. వేసవి ఎండలు ఉండడంతో మిల్లుల వద్ద హమాలీలు మధ్యాహ్నం పని చేయడం లేదు. దాంతో కొంత జాప్యం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని