logo

నాలుగు నెలలుగా జీతాల్లేవు!

నగరంలోని 66 డివిజన్లలో ఇంటింటా చెత్త సేకరణ చేస్తున్న స్వచ్ఛ ఆటోల యజమానులైన డ్రైవర్లకు నాలుగు నెలలుగా జీతాలివ్వడం లేదు. ఐదేళ్ల ఒప్పంద కాలపరిమితి ముగిసింది.

Published : 31 May 2023 05:03 IST

స్వచ్ఛ ఆటో డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

స్వచ్ఛ ఆటోల యజమానులతో మాట్లాడుతున్న ఉపకమిషనర్‌ రషీద్‌, ముఖ్యఆరోగ్యాధికారి డాక్టర్‌ రాజేష్‌

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: నగరంలోని 66 డివిజన్లలో ఇంటింటా చెత్త సేకరణ చేస్తున్న స్వచ్ఛ ఆటోల యజమానులైన డ్రైవర్లకు నాలుగు నెలలుగా జీతాలివ్వడం లేదు. ఐదేళ్ల ఒప్పంద కాలపరిమితి ముగిసింది. కొత్తగా ఒప్పందం చేయక పోవడంతో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. పలు దఫాలుగా మేయర్‌, కమిషనర్‌, ప్రజారోగ్య విభాగం అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో మంగళవారం గ్రేటర్‌ వరంగల్‌ ప్రధాన కార్యాలయం ముందు హనుమకొండకు చెందిన డ్రైవర్‌ అలకట్ల రాజేష్‌ పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. తోటి డ్రైవర్లు వారించడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలియడంతో స్వచ్ఛ ఆటోల ఓనర్‌ కం డ్రైవర్లు బల్దియా కార్యాలయానికి చేరుకున్నారు. పోర్టికో ముందు నిరసనకు దిగారు. ఉపకమిషనర్‌ రషీద్‌, ముఖ్య ఆరోగ్యాధికారి డాక్టర్‌ రాజేష్‌ చర్చలు జరిపారు. జనవరి నుంచి జీతాలివ్వడం లేదని, ఒప్పందం ముగిసినా, కొత్తగా ఒప్పందం చేయడం లేదని డ్రైవర్లు వాపోయారు. ఒక నెల జీతం చెక్కు సిద్ధమైందని, మరో రెండు నెలల జీతాలు నాలుగైదు రోజుల్లో చెల్లిస్తామని ముఖ్య ఆరోగ్యాధికారి తెలిపారు. తదుపరి ఒప్పందంపై రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకుడికి లేఖ రాశామని, అనుమతి రాగానే ఖరారు చేస్తామన్నారు.

మేయర్‌ను కలిసిన డ్రైవర్లు

స్వచ్ఛ ఆటో డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలియగానే మేయర్‌ గుండు సుధారాణి బల్దియా కార్యాలయానికి వచ్చారు. ముఖ్యఆరోగ్యాధికారితో కలిసి డ్రైవర్లతో చర్చలు జరిపారు. మీ సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని, వారం రోజుల్లో పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లిస్తామని మేయర్‌ హమీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని