logo

Indian Railway: రైళ్ల రద్దు.. ఆపై ఆలస్యం!

నెక్కొండ- చింతలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైను పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే మే 21 నుంచి పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది.

Updated : 31 May 2023 08:56 IST

ప్రత్యామ్నాయం లేక ప్రజల అవస్థలు

న్యూస్‌టుడే, డోర్నకల్‌, కాజీపేట: నెక్కొండ- చింతలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైను పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే మే 21 నుంచి పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను  రోజు విడిచి రోజు నిర్ణీత సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరేలా రీ-షెడ్యూల్‌ చేసింది. మిగతా రైళ్లు సైతం దాదాపు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం ఒక్క రైలు కూడా ఆగడం లేదు. జూన్‌ 7 వరకు ఇదే పరిస్థితి ఉండనుంది. దీంతో రైలు ప్రయాణం నరకప్రాయంగా మారింది. ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ముందస్తు సమాచారం ఇవ్వకుండా..

కొన్ని సార్లు అధికారులు రైళ్లను ముందస్తు సమాచారం ఇవ్వకుండా రద్దు చేస్తున్నారు. దారి మళ్లిస్తున్నారు. విషయం తెలియక ప్రయాణికులు స్టేషన్లకు వచ్చి ఆందోళన చెందుతున్నారు. ఇటీవల దిల్లీ మార్గంలో నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించడం వల్ల మంచిర్యాల, రామగుండం ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

డోర్నకల్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ వద్ద ప్రయాణికుల రద్దీ

ఇదీ పరిస్థితి.. 

* డోర్నకల్‌, మహబూబాబాద్‌ పరిసర ప్రాంతాల ప్రజలు వరంగల్‌, కాజీపేట, సికింద్రాబాద్‌ వెళ్లేందుకు ఎక్కువగా శాతవాహన ఎక్స్‌ప్రెస్‌పై ఆధారపడతారు. భద్రాచలం రోడ్‌, కారేపల్లి వైపు నుంచి డోర్నకల్‌ వచ్చేవారు కాకతీయ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తారు. ఈ రెండింటినీ రద్దు చేశారు. వీటితో రద్దైనవాటిలో డోర్నకల్‌- కాజీపేట, విజయవాడ- డోర్నకల్‌ మెమూ, భద్రాచలం రోడ్‌- బలార్షా సింగరేణి రైళ్లు కూడా ఉన్నాయి.
* వరంగల్‌ వైపు వెళ్లేందుకు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ ఉన్నప్పటికీ ఉదయం 8.53 గంటలకు రావాల్సిన రైలు మధ్యాహ్నం 12 దాటాక వస్తుండటంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బంది పడుతున్నారు. రైళ్ల రద్దు, దారి మళ్లింపుతో అత్యవసర పనులపై దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. రోడ్డు మార్గాన వెళ్లాలంటే అధిక వ్యయమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేక మహబూబాబాద్‌, ఖమ్మం వెళ్లి ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాన్ని వెతుక్కుంటున్నారు. కృష్ణా, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రోజూ గంటల కొద్దీ ఆలస్యంతో నడుస్తున్నాయి..
* అందరికీ అందుబాటులో ఉండే డోర్నకల్‌ పుష్‌పుల్‌ రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాజీపేట, వరంగల్‌ నుంచి ప్రతి రోజు మహబూబాబాద్‌, నెక్కొండకు రైతులు ఉదయం పూట పాలు, కూరగాయలు రైళ్లలో తీసుకెళ్తారు. పుష్‌పుల్‌ లేని కారణంగా ప్రస్తుతం మహబూబాబాద్‌ ప్రాంతాల్లో కూరగాయల ధరలు అధికమయ్యాయి.

రోడ్డు మార్గమే శరణ్యం..

బల్లార్షా మార్గంలో రైళ్ల రద్దు లేదా ఆలస్యం కారణంగా రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వస్తోంది. సిర్‌పూర్‌కాగజ్‌నగర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లడానికి రోడ్డు మార్గం చాలా దూరం. రెండు మూడు బస్సులు మారాలి. రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లి, మందమర్రి రాఘవపురం, బిజిగిరిషరీఫ్‌ ప్రాంతాలకు రోడ్డు మార్గం సరిగ్గా లేదు.

రైళ్లు రద్దు కావడంతో కాజీపేట రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న ప్రయాణికులు

మూడో లైను పనుల వల్లే..

మూడోలైను పనులతో పాటు సిగ్నల్స్‌ తీగలు తెగిపోవడం లాంటి సమస్యల వల్ల కొన్ని సార్లు రైళ్లను రద్దు చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే రద్దు చేయడంతో పాటు దారి మళ్లించడం చేస్తున్నామని వివరిస్తున్నారు. రైళ్ల ఆలస్యం నివారణ చర్యల్లో భాగంగానే మూడోలైను పనులు జరుగుతున్నాయి. ఇది తెలంగాణలోనే పెద్ద ప్రాజెక్టు, ప్రయాణికులు సహకరించాలని కోరుతున్నారు.


గోల్కొండ రీ-షెడ్యూల్‌ సమయం మార్చాలి

- చెరుకుపల్లి మనోహర్‌, డోర్నకల్‌

గుంటూరు- సికింద్రాబాద్‌ మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ రైలు సమయాన్ని రీ-షెడ్యూల్‌ చేయడంతో రైలు ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు వెళుతుందో.. తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఈ రైలును డోర్నకల్‌ జంక్షన్‌లో రెండు గంటల పాటు నిలిపారు. దీంతో మహబూబాబాద్‌, వరంగల్‌, కాజీపేట, సికింద్రాబాద్‌ వెళ్లాల్సిన ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోయారు. ప్రవేశాల నిమిత్తం మంగళవారం నెక్కొండలోని గురుకులానికి వెళ్లాల్సిన విద్యార్థులు గోల్కొండకు హాల్టింగ్‌ లేని కారణంగా ఇబ్బంది పడ్డారు. గోల్కొండ రైలు నిర్ణీత సమయానికి అరగంట, 45 నిమిషాల తేడాతో నడిపితే అందరికి ఉపయోగకరంగా ఉంటుంది.


ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి

- రాజారాం, గొల్లచర్ల

ఆర్టీసీ ప్రత్యామ్నాయ బస్సులు నడపాలి. డోర్నకల్‌-మహబూబాబాద్‌, డోర్నకల్‌-ఖమ్మం మధ్య బస్సులు నడిపితే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు అక్కడి వరకు వెళ్లి వేరొక బస్సును ఆశ్రయించే వీలుంటుంది. డోర్నకల్‌ నుంచి భద్రాచలం, ఇల్లెందు, కారేపల్లికి వెళ్లే ప్రయాణికులు కనీస సౌకర్యం లేక అల్లాడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు