‘బలోపేతం చేద్దాం.. అధికారంలోకి తీసుకొద్దాం’
కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు.
రంగంపేట, పోచమ్మమైదాన్, న్యూస్‌టుడే: కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు. బుధవారం వరంగల్ పోచమ్మమైదాన్ సమీపంలోని ఓ వేడుకల మందిరంలో జిల్లా బాధ్యతల స్వీకరణ, జిల్లా కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి పని చేసి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు. ప్రాణం పోయే వరకు కాంగ్రెస్‌లోనే ఉంటూ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. పార్టీలో ఉంటూ గొడవలు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లాలోని నియోజకవర్గ ఇన్‌ఛార్జులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని తెలిపారు. రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీ అని, ఈ నెల 2 నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్సవాలు చేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ. పూటపూటకు పార్టీ మారుతున్న నాయకులకు భవిష్యత్తు ఉండదని, ఆ నాయకులను నమ్మవద్దని తెలిపారు. కేవలం ఐదు నెలలు కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి తెలిపారు. చిన్న చిన్న గొడవలు చేయించి కాంగ్రెస్ గెలుపును ఆపలేరని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు నూతన అధ్యక్షురాలిని గజమాలతో ఘనంగా సత్కరించారు. సమావేశానికి రాష్ట్ర పరిశీలకురాలిగా శోభారాణి హాజరవగా, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, శ్రీనివాస్, వెంకట్రాంరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
కొండా దంపతులు దూరం
వరంగల్ జిల్లా కాంగ్రెస్ తొలి విస్తృత స్థాయి సమావేశం రసాభాసగా మారింది. పరకాల నియోజకవర్గానికి చెందిన నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గొడవ జరగడాన్ని టీపీసీసీ సీరియస్‌గా పరిగణించింది. కారణమైన వారిపై క్రమ శిక్షణ చర్యలకు సిద్ధమైంది. మొదటి సమావేశానికి మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దూరంగా ఉండటంపై అధిష్ఠానం ఆరా తీసింది. సమావేశానికి ఆహ్వానం లేదని కొండా దంపతులంటున్నారు. ఒకటి రెండుసార్లు చరవాణిలో మాట్లాడామని, బుధవారం సమావేశం గురించి చెప్పానని డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అంటున్నారు. డీసీసీ అధ్యక్షురాలి నియామకమైన నాటి నుంచే కొండా, స్వర్ణ మధ్య విభేదాలు మొదలయ్యాయి. వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఇరువురు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. వరంగల్ తూర్పులో నాకు తెలియకుండా, సమాచారం ఇవ్వకుండా డీసీసీ అధ్యక్షురాలు పర్యటించడం ఎంతవరకు పద్ధతి అని కొండా అంటున్నారు. నేను జిల్లా అధ్యక్షురాలినని, ఎక్కడైనా పర్యటిస్తానని స్వర్ణ అంటున్నారు. తూర్పు ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం ఇద్దరు పోటీ పడుతున్నారని ప్రచారం మొదలైంది. ఇందులో భాగంగానే బుధవారం జరిగిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి కొండా దంపతులు, ఆయన అనుచరులు దూరంగా ఉన్నారని తెలిసింది. ఉదయం పోచమ్మమైదాన్‌లో సమావేశానికి గైర్హాజరైన మాజీ ఎమ్మెల్సీ మురళి సాయంత్రం లేబర్‌కాలనీ, రంగశాయిపేటలో నిర్వహించిన సమావేశాలకు హాజరయ్యారు.
ఠాణాలో పరస్పరం ఫిర్యాదులు
మట్టెవాడ: కార్యకర్తల సమావేశంలో దాడుల ఘటనపై ఇరువర్గాలు ఇంతేజార్‌గంజ్ ఠాణాలో ఫిర్యాదులు చేసుకున్నారు. జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు దూపాకి సంతోష్, ఇతరులు కట్టస్వామిపై కులం పేరుతో దూషించి, తీవ్రంగా అవమానపరిచాడని ఫిర్యాదు చేశారు. అకారణంగా తనపై దూపాకి సంతోష్, ఇతరులు దాడి చేశారని కట్టస్వామి ఫిర్యాదు చేశారు. దాడి ఘటనలో తన చరవాణి, బంగారు గొలసు పోయినట్లు తెలిపారని, రెండు వర్గాల ఫిర్యాదులు అందాయని ఇంతేజార్‌గంజ్ సీఐ మల్లేష్ తెలిపారు.
ఆగిన కాంగ్రెస్ సమావేశం
రంగశాయిపేట: మద్యం ప్రియుల హల్‌చల్ కారణంగా శంభునిపేటలో జరగాల్సిన కాంగ్రెస్ సమావేశం రద్దైంది. బుధవారం సాయంత్రం స్థానిక వేడుకల మందిరంలో 41వ డివిజన్‌కు చెందిన భారాస యువకులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు సమక్షంలో చేరికల కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొంత మంది మద్యం ప్రియులు అక్కడికి చేరుకొని కార్యక్రమం ఎవరు పెట్టారంటూ అద్దాలు పగుల గొట్టారు. ద్విచక్ర వాహనాలను కింద పడేశారు. దీంతో అర్ధంతరంగా కార్యక్రమాన్ని రద్దు చేసి లేబర్‌కాలనీకి మార్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TTD: సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
Chandrayaan 3: జాబిల్లిపై సూర్యోదయం.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు ఇస్రో ప్రయత్నాలు
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Manipur: మణిపుర్లో మరోసారి ఉద్రిక్తతలు.. కర్ఫ్యూ సడలింపులు రద్దు!