logo

నవ రంగాలు.. ప్రగతి సోపానాలు

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక, పర్యాటక, విద్యుత్తు వంటి రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తోంది. 

Updated : 01 Jun 2023 04:55 IST

రేపటితో పదో వసంతంలోకి తెలంగాణ
ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక, పర్యాటక, విద్యుత్తు వంటి రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తోంది.  స్వరాష్ట్రం ఏర్పడి రేపటితో తొమ్మిదేళ్లు పూర్తవుతున్న వేళ ఉమ్మడి వరంగల్‌ జిల్లా తొమ్మిది రంగాల్లో సాధించిన అభివృద్ధిపై ప్రత్యేక కథనం..


1.విద్యకు పెద్దపీట

మ్మడి జిల్లాలో విద్యావెలుగులు ప్రసరిస్తున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. సర్కారు బడులకు కార్పొరేట్‌ కళను తీసుకొచ్చేందుకు ‘మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి’ కార్యక్రమం అమలవుతోంది.

ఉమ్మడి జిల్లాలో..

ప్రభుత్వ బడులు: 3,328

గురుకుల, ఆశ్రమ పాఠశాలలు: 255

మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి  మొదటి విడతలో ఎంపికైన పాఠశాలలు: 949

కేటాయించిన నిధులు (రూ.కోట్లలో): 208.45


2.సాగులో భళా

వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. కాళేశ్వరంతో సాగునీటి సౌకర్యం మెరుగుపడింది. మిషన్‌ కాకతీయతో చెరువులు, కుంటల్లోని పూడిక తీతతో భూగర్భ జలాలు పెంపొందాయి. ఎస్సారెస్పీ కాలువలను పునరుద్ధరణ చేయడంతో చివరి ఆయకట్టుకు నీరందుతోంది.  24 గంటల ఉచిత కరెంట్‌తో రెండు పంటలు పుష్కలంగా పండుతున్నాయి.  రైతుబంధు,  రైతుబీమా పథకాలు అమలవుతున్నాయి. రైతువేదికలను అందుబాటులోకి తీసుకొచ్చారు.5వేల ఎకరాలకు ఒక ఏఈవోను కేటాయించారు.

సాధారణ సాగు విస్తీర్ణం (ఎకరాల్లో): 18,02,280

సాగవుతున్న ఆయిల్‌పామ్‌ విస్తీర్ణం (ఎకరాల్లో): 13,401

రైతు వేదికలు: 349


3. సకల జనుల సంక్షేమం

రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తోంది. ఆసరా, దళిత బంధు, ట్రైకార్‌, ఆరోగ్యలక్ష్మి, న్యూట్రిషన్‌ కిట్లు, గొర్రెల పంపిణీ, రైతులకు పెట్టుబడి సాయం, రైతుబీమా ఇలా పలురకాల  పథకాలు ఉమ్మడి జిల్లాలోని లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.


4. అందరికీ ఆరోగ్యం

వైద్యరంగంలో గొప్ప మార్పు వచ్చింది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులోకి వస్తోంది. తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సెంటర్లను ఏర్పాటు చేసి సుమారు 57 రకాల పరీక్షలు చేస్తున్నారు. పల్లెదవాఖానాలను ఏర్పాటు చేసి  వైద్యులతో సేవలందిస్తున్నారు. కంటి వెలుగు, ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాలు అమలవుతున్నాయి.


5. మౌలిక సదుపాయాలు

ఉమ్మడి జిల్లాలో  రహదారి కష్టాలు తీరాయి. జాతీయ, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రహదారులు 14,192.57 కిలోమీటర్లు విస్తరించాయి.

పల్లెల్లో వైకుంఠధామాలను నిర్మించారు. ఇంటింటా సేకరించిన చెత్తను గ్రామశివారుల్లో వేసేందుకు డంపింగ్‌యార్డులను నిర్మించారు. పల్లె, పట్టణ పకృతి వనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరందిస్తున్నారు.


6. పర్యాటకానికి చిరునామాగా

చారిత్రక కాకతీయుల కట్టడాలు, నింగిని తాకే జలపాతాలు, పురాతన ఆలయాలు, పచ్చని అడవులతో రమణీయమైన ప్రకృతికి నెలవు ఉమ్మడి వరంగల్‌.. రాష్ట్రం ఏర్పడ్డాక పర్యాటక ప్రాంతాలు ప్రాచుర్యం పొందాయి. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కింది. ఏటూరునాగారం అభయారణ్యంలో ట్రెక్కింగ్‌, నైట్ క్యాంపింగ్‌, వనకుటీరాలు, బర్డ్స్‌ వాచింగ్‌ లాంటి కార్యక్రమాలతో ప్రకృతి పర్యాటకం ఊపందుకుంది. పాండవుల గుట్టలు, జైన్‌ మందిర్‌, వెయ్యి స్తంభాల గుడి, ఖిలా వరంగల్‌, భద్రకాళి బండ్‌, పాలకుర్తి, వల్మిడి, బమ్మెర టూరిజం కారిడార్‌ను అభివృద్ధి పర్చారు.

లక్నవరం సరస్సు వద్ద రూ. 5 కోట్లతో నూతన తీగల వంతెన నిర్మించారు.  

పాలకుర్తి, వల్మిడి, బమ్మెర, టూరిజం కారిడార్‌కు రూ. 61.67 కోట్లు కేటాయింపు.

దివంగత మాజీ ప్రధాని పీˆవీ నరసింహారావు స్వగ్రామం వంగరలో పర్యాటకాభివృద్ధికి రూ.4 కోట్లు  

గిరిజన పర్యాటక వలయం(ట్రైబల్‌ సర్క్యూట్) కింద రూ.88 కోట్లతో ఆరుచోట్ల హోటళ్లు, కాటేజీలను నిర్మించారు.

హరిత హోటళ్ల సంఖ్య: 17

ఉమ్మడి జిల్లాకు వచ్చే పర్యాటకులు: 25 లక్షలు


7. పారిశ్రామికాభివృద్ధి

మ్మడి జిల్లాలో పారిశ్రామిక రంగం ఊపందుకుంది. ప్రభుత్వం పరిశ్రమల అనుమతులకు టీఎస్‌ఐపాస్‌తో ఔత్సాహికులను ప్రోత్సహిస్తోంది.

భూపాలపల్లి జిల్లాలో 4 భూగర్భ, 2 ఉపరితల బొగ్గు గనులతో వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.   సింగరేణిలో కార్మికులకు 2017 నుంచి కారుణ్య నియామకాలను ప్రవేశపెట్టి 1200 మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించింది.

గణపురం మండలం చెల్పూరు శివారు దుబ్బపల్లిలో 1100 మెగావాట్ల థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం ఉంది. ప్రాజెక్టులో 850 మంది ఇంజినీర్లు, జేపీఏలు, ఆర్టిజన్లు తదితర కార్మికులు 2వేల మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక 600 మంది ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించింది.

జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కల్లెం, మాణిక్యాపురంలలో దాదాపు 10 వేల మందికి ఉపాధి కలిగే 150 ఎకరాల్లో టెక్స్‌టైల్‌ పార్కు పనులు జరుగుతున్నాయి.

గీసుకొండ, సంగెం మండలాల్లో మెగా టెక్స్‌టైల్‌ పార్కులో  గణేశ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించింది.  రూ. 300 కోట్లతో కంపెనీ ప్రారంభించగా.. దాదాపు 1000 మందికి ఉపాధి లభిస్తోంది. కైటెక్స్‌ కంపెనీ ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నారు.

తరిగొప్పుల, దేవరుప్పులలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల కోసం భూసేకరణ చేపడుతున్నారు.

చిన్న పరిశ్రమలు: 9251


8. విద్యుత్తు వెలుగులు

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోతలు లేని విద్యుత్తు సరఫరా అవుతోంది. బిల్లులపై భారం తగ్గింది. గృహాలు, వ్యవసాయానికి నిరంతరాయం సరఫరా చేస్తున్నారు. పరిశ్రమలకు కూడా కోతలు లేని విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కరెంట్‌ సమస్యలు లేకుండా ఆశాఖ అధికారులు దత్తత తీసుకొని పరిష్కరిస్తున్నారు.


9. క్రీడలకు అందలం

ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు కొదవ లేదు. క్రీడల్లో రాణించే వారికి ప్రోత్సాహం కల్పిస్తోంది. పల్లెల్లోని క్రీడాకారులను కూడా ప్రోత్సహించేందుకు పల్లె క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తెచ్చింది.  


మెరుగుపడిన గురుకుల విద్య

- మైస శ్రీనివాస్‌, టీపీటీఎఫ్‌ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

రాష్ట్రం ఏర్పడ్డాక గురుకులాల్లో విద్య మెరుగుపడింది. గ్రామ బడులు మూసివేయకుండా కొనసాగించాలి. వాటిలోనూ గురుకులాల స్థాయి సౌకర్యాలు కల్పించాలి.


బీడు భూములు వృద్ధిలోకి వచ్చాయి

- నేతాజీ, రైతు, చిన్నముప్పారం

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఎస్సారెస్పీ కాలువల పునరుద్ధరణతో సాగునీటి కష్టాలు తప్పాయి. పుష్కలంగా నీరందుతుండడంతో బీడు భూములు వృద్ధిలోకి వచ్చాయి. ప్రభుత్వం రాయితీ ద్వారా ఆధునిక యంత్రాలను అందిస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని