logo

నిర్వహణ ఖర్చులు పెరిగాయ్‌..!

పోషకాహారం తీసుకోని చాలా మందిలో రక్తహీనత, తక్కువ బరువు, తరుచు అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది.

Published : 01 Jun 2023 03:26 IST

భూపాలపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పోషకాహారం తీసుకోని చాలా మందిలో రక్తహీనత, తక్కువ బరువు, తరుచు అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి నుంచి ప్రజలను బయట పడేసేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది.  వాటి ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. నిత్యవసర సరకుల ధరలు పెరడంతో ఈ కేంద్రాల నిర్వాహకులు అదనపు ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ధరలు వందల్లో... చెల్లించేది రూపాయల్లో...

అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణి, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం నుంచి తక్కువ మొత్తంలో చెల్లింపులు చేస్తున్నారు. నిత్యావసర ధరలు పెరిగినా ప్రభుత్వం చెల్లింపులు మాత్రం పెంచలేదు. కేంద్రంలో బియ్యం, పప్పు. కోడిగుడ్లు ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్నా వాటిని వండటానికి కావాల్సిన సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. వంటకు కావాల్సిన వస్తువుల కోసం రోజుకు గర్భిణి, బాలింతలకు 2.10రూపాయలు, పిల్లలకు 0.95 పైసలు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఈ మొత్తం ప్రస్తుత ధరలకు ఏమాత్రం సరిపోక అదనపు భారం తమపై పడుతోందని కేంద్రం నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు చాలా వరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. భూపాలపల్లి పట్టణంలో రెండు గదులు ఉన్న ఇంటికి రూ.3వేలకు పైగా అద్దె ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1500 పైనే ఉంటుంది. కాని ప్రభుత్వం మాత్రం వెయ్యి రూపాయలే చెల్లిస్తున్నది. వంట గ్యాస్‌కు సంబందించి ఒక్కో పిల్లవానికి 20 పైసలు, బాలింతలు, గర్భిణిలకు 30 పైసలు మాత్రమే చెల్లిస్తుంది. ప్రస్తుతం గ్యాస్‌ సిలండర్‌ రూ.1200 ఉన్నది. అదనంగా స్టేషనరీ, ఇతర ఖర్చులు పెరగడంతో కేంద్రాల నిర్వహణ భారమైంది. దశాబ్దం క్రితం నాటి ధరలే ఇప్పుడు చెల్లిస్తున్నారని అంగన్‌వాడీ సిబ్బంది వాపోయారు.


నిబంధనల మేరకు చెల్లిస్తున్నాం..

-  శైలజ, ఇన్‌ఛార్జి డీడబ్ల్యూవో

జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో లబ్ధిదారులకు నిబంధనల మేరకు పౌష్టికాహారం అందేలా కృషి చేస్తున్నాం. నిత్యావసర సరుకుల సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే బిల్లులు చెల్లిస్తున్నాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని