logo

విక్రయానికి సిద్ధంగా ప్రభుత్వ భూమి..

ప్రభుత్వమే లే అవుట్‌ చేసి ప్రజలకు స్థలాలను అమ్మడానికి కసరత్తు ప్రారంభించింది. క్రయవిక్రయాలకు వీల్లేని ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను లే అవుట్‌ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Published : 01 Jun 2023 03:26 IST

పురపాలిక పరిధిలో లే అవుట్‌కు ఏర్పాట్లు..

భూపాలపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వమే లే అవుట్‌ చేసి ప్రజలకు స్థలాలను అమ్మడానికి కసరత్తు ప్రారంభించింది. క్రయవిక్రయాలకు వీల్లేని ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను లే అవుట్‌ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలోని భూములతో పాటు భూ యజమానులు ముందుకొస్తే ప్రైవేటు భూముల్లో లే అవుట్‌ చేసి బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి సమాయత్తమవుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాశీంపల్లి వద్ద 10 ఎకరాల ప్రభుత్వ భూమి, మరో 10ఎకరాల ప్రైవేట్‌ భూమిని గుర్తించారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం రానుంది.

ప్రైవేట్‌ స్థలాల్లోనూ..

ప్రభుత్వ, అసైన్డ్‌ భూములే కాకుండా ప్రైవేటు భూముల్లోనూ ప్రభుత్వ పరంగా లే ఆవుట్‌ చేసి, వాటిని విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయినట్లు రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. ఏయే ప్రాంతంలో లే అవుట్‌ చేస్తే ఫలితాలు వస్తాయి, ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ, అసైన్డ్‌, ప్రైవేట్‌ భూముల లెక్కలను అధికారులు ఆరా తీస్తున్నారు. అసైన్డ్‌ భూములు ఎక్కువగా ఉన్న వేశాలపల్లి, జంగేడు, కాశీంపల్లి ప్రాంతాల్లో అధికారులు భూముల సేకరణపై దృష్టి పెట్టారు. ఆసిక్తి కలిగిన రైతులు, భూ యజమానులు ముందుకు వస్తే వారి భూముల వివరాలను పరిశీలించి హైదరాబాద్‌లోని కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు జిల్లా అధికారులు నివేదిస్తారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చాకే ప్లాట్ల విక్రయాలు చేపడుతారు. భూములు లే అవుట్‌కు అప్పగిస్తే భూ యజమానులకు, రైతులకు చెల్లింపులు ఎలా చేస్తారనే దానిపై పూర్తి మార్గదర్శకాలు తెలియాల్సి ఉంది.


కనీసం 20 ఎకరాలు

ప్లాట్లు చేయడానికి అనుకూలంగా ఉండాలంటే ఒకే చోట సుమారుగా 20 ఎకరాలు అవసరమని అధికారులు చెబుతున్నారు. రైతులు, భూ యజమనాలు ముందుకు వస్తే అనుమతులన్నీ అధికారులే చూసుకుంటారు. మురుగు కాల్వలు, రహదారులు, ప్రజా అవసరాల రీత్యా ఉద్యానవనం, ప్రార్థన మందిరాలకు పది శాతం స్థలం వదలడం, విద్యుత్తు సౌకర్యం, తాగునీటి వసతి వంటి తదితర మౌలిక వసతులు ప్రభుత్వమే కల్పిస్తుంది. మొత్తం స్థలంలోనే 40 శాతం మురుగు కాల్వలు, రోడ్ల నిర్మాణాలకే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. మిగితా 60 శాతం స్థలంలో ఏర్పాటైయ్యే ప్లాట్లలో సగం భూమి యజమానికి అప్పగిస్తుంది. మిగితా సగం ప్లాట్లు ప్రభుత్వం వేలం పాటల్లో విక్రయిస్తుంది. భూమి రకాన్ని బట్టి ఒకవేళ ప్లాట్ల ఏర్పాటుకు అధికంగా ఖర్చయితే యజమానికి 40 శాతం, ప్రభుత్వానికి 60 శాతం ప్లాట్లు కేటాయించాల్సి ఉంటుంది. అసైన్డ్‌, ప్రైవేటు భూముల్లో లే అవుట్‌ చేయాలంటే సదరు రైతులు సమ్మతిస్తేనే అధికారులు ఈ ప్రక్రియ మొదలు పెడతారు. ఈ విషయమై భూపాలపల్లి తహసీల్దార్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ప్లాట్లు చేసి విక్రయించాలనే ఆదేశాలు కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం నుంచి వచ్చాయని స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు సర్వే నెంబర్లలలో 20 ఎకరాల వరకు భూములను ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని