logo

నిచ్చెనలే దిక్కు!

వీధి దీపాల మరమ్మత్తులకు ఇంకా పాత పద్ధతులే పాటిస్తున్నారు. బొంగు కర్ర నిచ్చెనలతో కాలనీల్లో దీపాలు బాగు చేస్తున్నారు.

Published : 02 Jun 2023 02:55 IST

నిచ్చెన సాయంతో వీధి దీపానికి మరమ్మతులు..

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: వీధి దీపాల మరమ్మత్తులకు ఇంకా పాత పద్ధతులే పాటిస్తున్నారు. బొంగు కర్ర నిచ్చెనలతో కాలనీల్లో దీపాలు బాగు చేస్తున్నారు. వరంగల్‌ నగరం స్మార్ట్‌సిటీగా పేరు గాంచినా  ఆధునిక విధానాలు, యంత్రాల వినియోగించడం లేదు. గత రెండేళ్ల క్రితం పట్టణ ప్రగతి ద్వారా సుమారు రూ.110కోట్లతో కంఫాక్టర్లు, టిప్పర్లు, డంపర్‌ప్లేసర్లు, మినీ ఆటోలు, ట్రాక్టర్లు, నీళ్ల ట్యాంకర్లు తదితర వాహనాలు కొనుగోలు చేశారు. కాని వీధి దీపాలు బాగు చేసేందుకు ఒక్క వాహనం కొనుగోలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాలనీల్లో దీపాలు బాగు చేసేందుకు ఎలక్ట్రికల్‌ ఒప్పంద కార్మికులు నించెనలు వాడుతున్నారు. చాలాసార్లు కార్మికులు గాయపడ్డారు. గురువారం 49వ డివిజన్‌ గోపాలపూర్‌ సురేంద్రపురి కాలనీలో ఇమ్మడి చంద్రశేఖర్‌ అనే ఒప్పంద కార్మికుడు వీధి లైటు మరమ్మతు చేస్తూ ప్రమాదవశాత్తు నిచ్చెన పై నుంచి కింద పడి మృతి చెందాడు.


ఒకే ఒక ల్యాడర్‌

గ్రేటర్‌ వరంగల్‌ ఎలక్ట్రికల్‌ విభాగంలో ఒకే ఒక ల్యాడర్‌ ఉంది. వీధి దీపాల మరమ్మత్తులు, చెట్లు తొలగింపు ఇతర అత్యవసర సేవలకు ఇదే వాడుతున్నారు. నగరంలోని 66 డివిజన్లలో సుమారు 50,548 వీధి దీపాలున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో వీధి లైట్లు ఉంటే రిపేర్ల కోసం ఒక్కటే ల్యాడర్‌ ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులు నిచ్చెనలు వాడుతున్నారు. వీధి దీపాల విభాగంలో నాలుగు సర్కిళ్లు కాజీపేట, హనుమకొండ, వరంగల్‌, కరీమాబాద్‌ ఉన్నాయి. 120 మంది ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారు. నిచ్చెనతో సగటున ఒక రోజుకు 20-25 లైట్లు మరమ్మతు చేస్తున్నారు. ల్యాడర్‌ అందుబాటులో ఉంటే 40-50 దీపాలు మరమ్మత్తు చెయొచ్చని కార్మికులంటున్నారు. కనీసం ఒక్కో సర్కిల్‌కు ఒక్కో ల్యాడరైనా సమకూర్చాలని సిబ్బంది కోరుతున్నారు.


ఎలక్ట్రిషియన్‌ మృతి

గోపాలపురం, భీమారం, న్యూస్‌టుడే: వరంగల్‌ కార్పొరేషన్‌ వీధి దీపాల విభాగంలో పనిచేసే కార్మికుడు ప్రమాదవశాత్తు నిచ్చెన పైనుంచి కిందకు జారి పడి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన హనుమకొండ మండలం గోపాలపూర్‌లోని సురేంద్రపురి కాలనీ రోడ్డునెంబర్‌- 6లో చోటు చేసుకుంది. కేయూ క్రైమ్‌ ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపూర్‌లోని సరస్వతినగర్‌ కాలనీకి చెందిన ఇమ్మడి చంద్రశేఖర్‌ (54) వరంగల్‌ కార్పొరేషన్‌లో వీధి వీపాల విభాగంలో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా గురువారం గోపాలపూర్‌ సురేంద్రపురి కాలనీ రోడ్డు నెంబర్‌-6లో నిచ్చెన సాయంతో విద్యుత్తు స్తంభంపైకి ఎక్కి విద్యుత్తు దీపాన్ని అమరుస్తున్నాడు. నిచ్చెన జారిపోవడంతో కింద పడి తలకు గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబసభ్యులు కేయూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న కేయూ క్రైమ్‌ ఎస్సై విజయ్‌కుమార్‌ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు