logo

మన ఊరు-మనబడిలో ములుగు ముందంజ

ప్రభుత్వ పాఠశాలలకు పునర్‌ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టింది.

Published : 02 Jun 2023 02:55 IST

రాష్ట్ర స్థాయిలో వరంగల్‌ జిల్లాకు 27వ స్థానం

ములుగు జిల్లా వాజేడు మండలం నాగారంలోని ప్రభుత్వ పాఠశాల

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలకు పునర్‌ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధి పనులు పూర్తయిన పాఠశాలలకు వేసవి సెలవుల్లో ఆకతాయిల నుంచి రక్షణ కల్పించేందుకు నెలకు రూ.5 వేల వేతనంతో కాపలాదారులను కూడా నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా పథకం అమలుతీరును మదింపు చేసి జిల్లాలకు ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ములుగు జిల్లా రాష్ట్రంలోనే మూడో ర్యాంకు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొదటి స్థానం సాధించింది. వరంగల్‌ జిల్లా 27వ స్థానంతో సరిపెట్టుకుంది. మొదటి విడతలో చేపట్టిన పనుల పురోగతిని సమగ్రంగా విశ్లేషించి పోటీ ఫలితాలను ప్రభుత్వం ప్రకటించింది. దిగువ స్థానాల్లో ఉన్న జిల్లాల్లోని అధికారులు మరింత శ్రద్ధతో పనులను త్వరగా పూర్తి చేయడానికి ఈ ర్యాంకులు దోహదపడతాయని అధికారులు చెబుతున్నారు.


మదింపు ఎలా చేశారంటే..

మన ఊరు మనబడి పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు పూర్తయిన బడులకు 50 మార్కులు, పూర్తయిన పనులకు 30 శాతం, చేసిన ఖర్చులకు 20 శాతం చొప్పున గణించి వంద మార్కులను నిర్దేశించారు. పనులను వీలైనంత త్వరగా నాణ్యతగా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. మండల నోడల్‌ అధికారులను, జిల్లాస్థాయి అధికారులను పురమాయించింది. అధికారులు కూడా రోజువారీ విధులకు హాజరవుతూనే మన ఊరు మనబడి పనులను పర్యవేక్షించారు. జిల్లా అధికారులు తరచూ సందర్శించి పనుల్లో జాప్యాన్ని గుర్తించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.


సకాలంలో రికార్డులను సమర్పించలేకపోయాం

మన ఊరు మనబడి పథకానికి ఎంపికైన పాఠశాలల్లో వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తున్నామని అధికారులు తెలిపారు. కొన్ని అనివార్య కారణాలతో, ఇంజినీర్ల పని ఒత్తిడితో పనులను సకాలంలో నమోదు చేయలేదన్నారు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు భౌతికంగా పూర్తయినా, వివరాలు నమోదు కాకపోవడంతో వెనుకబడినట్లు కనిపిస్తుందన్నారు. జనగామ జిల్లా కూడా మొదటి స్థానంలో నిలిచేలా ఉందని, కానీ పనుల ఒత్తిడితో సకాలంలో రికార్డులను సమర్పించలేకపోయామని వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని