logo

తండా నిండా.. ఉద్యోగులే!

ఒకప్పుడు ఆ గిరిజన తండాలో చదువుకున్న వారు, ఉద్యోగం చేసేవారు కనిపించని పరిస్థితి.. ఇప్పుడా పరిస్థితి లేదు..

Published : 02 Jun 2023 02:55 IST

ఆల్వార్‌బండ(శంకర్‌) తండాలో నిర్మించిన ప్రధాన ద్వారం

న్యూస్‌టుడే, జఫర్‌గఢ్‌(స్టేషన్‌ఘన్‌పూర్‌): ఒకప్పుడు ఆ గిరిజన తండాలో చదువుకున్న వారు, ఉద్యోగం చేసేవారు కనిపించని పరిస్థితి.. ఇప్పుడా పరిస్థితి లేదు.. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. విదేశాల్లో స్థిరపడ్డవారు ఉన్నారు.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.. జఫర్‌గఢ్‌ మండలంలోని ఆల్వార్‌బండ(శంకర్‌) తండాలో 110 కుటుంబాలు, జనాభా 552 ఉంది. నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పడింది. మొదట్లో ఇక్కడ పాఠశాల లేకపోవడంతో తండా పెద్దమనిషి బానోతు శంకర్‌నాయక్‌ ప్రైవేట్‌గా ఒక ఉపాధ్యాయున్ని తీసుకొచ్చి పిల్లలకు అక్షరాలు నేర్పించారు. ఆయన కృషి ఫలితంగా డీఎన్‌టీ(గిరిజన పాఠశాల)ను ప్రభుత్వం తండాలో ఏర్పాటు చేసింది. శంకర్‌నాయక్‌ కుమారుడు వెంకట్రాంనాయక్‌ ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని తండాలో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదువుల్లో ప్రోత్సహించారు. తండాకు చెందిన దివంగత బానోతు హరిలాల్‌ కుమారులు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరు తండాకు వెళ్లేందుకు ప్రధాన ద్వారం వద్ద అల్వార్‌స్వామి ఆలయానికి తోరణాన్ని నిర్మించారు. తండావాసులే గుట్టపై ఉన్న ఆల్వార్‌ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నారు.

రెండిళ్లకో ఉద్యోగి..

తొలిసారిగా ఉద్యోగం సాధించిన వెంకట్రాంనాయక్‌ ఆర్‌జేడీగా పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత తండాకు చెందిన బానోతు యాకిన్‌చందు గ్రూప్‌-1 పరీక్ష రాసి ఉద్యోగం సాధించాడు. ఈయన్ను ఆదర్శంగా తీసుకొని మరికొందరు యువతీ యువకులు చదువుల్లో పోటీపడుతున్నారు. తండాకు చెందిన వారిలో ముగ్గురు వైద్యులు(ఎంఎస్‌), 10 మంది బ్యాంకు ఉద్యోగులు, జైలు వార్డెన్‌, దూరదర్శన్‌లో ఒకరు, టెలీ కమ్యూనికేషన్‌లో ఇద్దరు, సాఫ్ట్‌వేర్‌లో ముగ్గురు, ఆర్‌టీవో ఒకరు, ఉపాధ్యాయులు ఇద్దరు, డీఆర్‌డీవోలో ఒకరు, రైల్వేలో నలుగురు, ఆర్‌టీసీలో ఇద్దరు, ఫుడ్‌ కార్పొరేషన్‌లో ఒకరు, స్టీల్‌ ప్లాంట్‌లో ముగ్గురు, ఎన్‌ఆర్‌ఐలు ముగ్గురు, రెవెన్యూలో ఒకరు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. వీరుకాక ప్రైవేట్‌ రంగాల్లో దాదాపు వంద మంది వరకు ఉంటారని తండా వాసులు తెలిపారు. రెండిళ్లకు ఒకరు ఉద్యోగులు ఉన్నారు. తండాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో కలిపి దాదాపు 200 మంది వరకు ఉంటారని పేర్కొన్నారు.


ఎంతో సంతోషంగా ఉంది

బానోతు వెంకట్రాంనాయక్‌, విశ్రాంత ఆర్‌జేడీ

తండా పిల్లలకు చదువు చెప్పించాలని మా నాన్న ఎంతో కష్టపడ్డారు. ఆయన ప్రోత్సాహంతో నేను తండా నుంచి తొలి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాను. మా పిల్లలు ఇద్దరు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రోజు ప్రతి రెండిళ్లకు ఒకరు ఉద్యోగం చేస్తున్నారు. పోటీపడి పిల్లలు చదివి, ఉద్యోగాలు చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని