నలుగురిని బలి తీసుకున్న నిద్రమత్తు..
కలియుగ ప్రత్యక్ష దైవాన్ని చూసి పులకరించిపోయారు. ఆడపడుచు కుమారుడి పుట్టి వెంట్రుకల మొక్కు తీరడంతో పాటు వేంకటేశ్వర స్వామిని చూడాలన్న కోరిక నెరవేరిందని.. ఆనందంతో వెనుదిరిగారు..
మరో ఇద్దరికి గాయాలు
బస్సును ఢీకొట్టిన కారు
వెంకటమ్మ, వెంకన్న, అశోక్, శాన్వితాక్షరి
(పాతచిత్రాలు)
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్,న్యూస్‌టుడే, దంతాలపల్లి, ఏర్పేడు: కలియుగ ప్రత్యక్ష దైవాన్ని చూసి పులకరించిపోయారు. ఆడపడుచు కుమారుడి పుట్టి వెంట్రుకల మొక్కు తీరడంతో పాటు వేంకటేశ్వర స్వామిని చూడాలన్న కోరిక నెరవేరిందని.. ఆనందంతో వెనుదిరిగారు.. కారు చోదకుడి నిద్రమత్తు అదే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి- రేణిగుంట ప్రధాన రహదారిపై ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ శ్రీహరి కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన నెమ్మది వెంకటమ్మ, లింగయ్య దంపతులకు కుమారులు దినేష్ అలియాస్ వెంకన్న, రాంబాబు, అశోక్, కుమార్తె రేణుక ఉన్నారు. 18 ఏళ్ల కిందట లింగయ్య మృతి చెందారు. వెంకటమ్మ కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించింది. ఇద్దరు కుమారులు, కుమార్తె పెళ్లి చేసింది. వెంకన్న, రాంబాబు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువులు సాధించారు. వెంకన్న జనగామలో ఉంటూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో, రాంబాబు జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు అశోక్ గతంలో ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ప్రభుత్వ కొలువు సాధించడానికి ఇంటివద్ద చదువుకుంటున్నారు. ఈక్రమంలో కూతురు రేణుక తన కుమారుడి పుట్టువెంట్రుకల మొక్కును తీర్చడానికి తిరుపతికి వెళ్లడంతో తల్లిని, అన్నదమ్ములను వేడుకకు రావాలని పిలిచింది. వెంకటమ్మ తన ముగ్గురు కుమారులు, ఇద్దరు మనవరాళ్లతో కలిసి మే 30న సొంత కారు (టీఎస్ 26 ఇ 7432)లో వెళ్లారు. వేడుక అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం తెల్లవారు జామున తిరిగి ఇంటికి బయలుదేరారు. డ్రైవింగ్ చేస్తున్న రాంబాబు నిద్రమత్తులో శ్రీకాళహస్తి మార్గంలోని ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద శ్రీకాళహస్తి నుంచి ప్రయాణికులతో తిరుపతి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ03 టీడీ 5082) ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందు సీటులో కూర్చొన్న అశోక్ (35), వెంకన్న చిన్న కుమార్తె శాన్వితాక్షరి (6), వెనుక సీటులో కూర్చొన్న వెంకటమ్మ (65) అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వెంకన్న (40), రాంబాబు (38), భాన్వితాక్షరి (10) శ్రీకాళహస్తి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రికి తరలించారు. వీరిలో వెంకన్న చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. కారు నడుపుతున్న రాంబాబు నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ప్రమాదంలో నుజ్జయిన కారు
దంతాలపల్లిలో విషాదం
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదం నెలకొంది. భర్త, చిన్న కుమార్తె మృతి చెందగా పెద్ద కుమార్తె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో వెంకన్న భార్య జ్యోతి రోదించిన తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. గాయపడిన రాంబాబు భార్య సంధ్య గర్భిణి కావడంతో పుట్టింటికి వెళ్లింది. అప్పటికే వారికి నాలుగు సంవత్సరాల కూతురు ఉంది.
బలవంతంగా తీసుకెళ్లి..: పిల్లలను తిరుపతికి పంపించడానికి తల్లి జ్యోతి ఇష్టపడలేదు. వారిద్దర్ని ఇంట్లోని గదిలో వేసి తలుపులు పెట్టింది. తండ్రి వెంకన్న బలవంతంగా తీసుకెళ్తుండడంతో పెద్ద బిడ్డను తీసుకెళ్లి.. చిన్న కూతురును ఇంటి వద్ద తనతో ఉంచాలని కోరినా వినలేదు. శాన్వితాక్షరి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ పూర్తి చేసింది. మరికొద్ది రోజుల్లో యూకేజీ చదివేందుకు తిరిగి హైదరాబాద్ వెళ్లేది. ఈ క్రమలో అనూహ్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రితో పాటు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrayaan 3: జాబిల్లిపై సూర్యోదయం.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు ఇస్రో ప్రయత్నాలు
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Manipur: మణిపుర్లో మరోసారి ఉద్రిక్తతలు.. కర్ఫ్యూ సడలింపులు రద్దు!
-
JDS: భాజపా నేతలతో దేవెగౌడ కీలక భేటీ.. ఎన్డీయేలో జేడీఎస్ చేరికకు రంగం సిద్ధం?
-
Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
-
Rupert Murdoch: ‘ఫాక్స్’ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగిన రూపర్ట్ మర్దోక్