logo

మావోయిస్టుల కుట్రను ఛేదించిన పోలీసులు

మన్యంలో మావోయిస్టుల కుట్రను ఆదిలోనే పోలీసులు ఛేదించారు. పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర ఏర్పాటుకు, రహదారి నిర్మాణ పనుల యంత్రాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నించిన నలుగురు మావోయిస్టు సానుభూతిపరులను బుధవారం రాత్రి ములుగు జిల్లా వాజేడు మండలంలో అరెస్టు చేశారు.

Published : 02 Jun 2023 02:55 IST

నలుగురు     సానుభూతిపరుల అరెస్టు
మందుపాతర సామగ్రి స్వాధీనం

వివరాలను వెల్లడిస్తున్న సీఐ శివప్రసాద్‌, పక్కన ఎస్సైలు అశోక్‌, తిరుపతిరావు, సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ సతీశ్‌

వెంకటాపురం, న్యూస్‌టుడే: మన్యంలో మావోయిస్టుల కుట్రను ఆదిలోనే పోలీసులు ఛేదించారు. పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర ఏర్పాటుకు, రహదారి నిర్మాణ పనుల యంత్రాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నించిన నలుగురు మావోయిస్టు సానుభూతిపరులను బుధవారం రాత్రి ములుగు జిల్లా వాజేడు మండలంలో అరెస్టు చేశారు. వివరాలను వెంకటాపురం పోలీసు స్టేషన్‌ వద్ద సీఐ కాగితోజు శివప్రసాద్‌ వెల్లడించారు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల సూచనలతో వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్‌కు కొన్నాళ్లుగా ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్లపల్లికి చెందిన పుల్లూరి నాగరాజు, ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన వావిలాల నర్సింగరావు, ఎంపెల్లి జాషువా, వాజేడు మండలం గుమ్మడిదొడ్డికి చెందిన పెట్రోల్‌ బంక్‌ యజమాని కంబాలపల్లి గణపతి కొరియర్లుగా పని చేస్తున్నారు. కాంట్రాక్టర్లు, వ్యాపారులను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిత్యావసర సామగ్రి, మందులను మావోయిస్టులకు సరఫరా చేస్తూ.. పోలీసుల కదలికలను సైతం చేరవేస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టు నాయకుడు సుధాకర్‌ సూచనలతో వాజేడు-గుమ్మడిదొడ్డి రహదారిలో పోలీసులను హతమార్చేందుకు మందుపాతర సామగ్రితో పాటు ఇక్కడున్న రహదారి నిర్మాణ యంత్రాలను తగులబెట్టేందుకు డీజిల్‌ను తీసుకొచ్చారు. ఈ రోడ్డు మార్గంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా మావోయిస్టు సానుభూతిపరులుగా నిర్ధారణ జరిగింది. వీరి నుంచి కార్డెక్స్‌, ఎలక్ట్రిక్‌ వైర్లు, డిటోనేటర్‌, బ్యాటరీలు, టిఫిన్‌బాక్సు, ద్విచక్రవాహనంతో పాటు నాలుగు చరవాణులు, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. సమావేశంలో వాజేడు ఎస్సై ఆర్‌ అశోక్‌, వెంకటాపురం ఎస్సై కె.తిరుపతిరావు, సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు