అమరుల త్యాగం..ప్రజల మదిలో పదిలం
అమరవీరుల త్యాగఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం శుక్రవారంతో పదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. మలి దశ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ నుంచి ఎందరో పిడికిళ్లు బిగించి ఉప్పెనలా ఉరికారు.
మానుకోటలో 36 అడుగుల ఎత్తైన అమరుల స్మారక చిహ్నం
న్యూస్‌టుడే, మహబూబాబాద్: అమరవీరుల త్యాగఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం శుక్రవారంతో పదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. మలి దశ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ నుంచి ఎందరో పిడికిళ్లు బిగించి ఉప్పెనలా ఉరికారు. తమ ఆత్మబలిదానాలతోనైనా పాలకులకు కనువిప్పి కలిగి ప్రత్యేక రాష్ట్రం ఇస్తారన్న భావనతో ప్రాణత్యాగాలు చేశారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం వారి త్యాగాలను గుర్తించి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వడమేగాక ఆర్థికసాయమందించింది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అమరుల కుటుంబ స్థితిగతులపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.
నర్సంపేట, న్యూస్‌టుడే
రూ.10 లక్షల ఆర్థికసాయం.. అటెండర్ ఉద్యోగం
నర్సంపేటలో తొగటి రాజ్‌కుమార్ విగ్రహం
నర్సంపేటలో స్థానిక అంబేడ్కర్ కూడలిలో ఐకాస ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఒక రోజు దీక్షలో తొగటి రాజ్‌కుమార్ కూర్చున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చాక ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మార్పణం చేసుకున్నారు. రాష్ట్రం సిద్ధించాక ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయమందించింది. తండ్రి సదానందానికి స్థానిక జడ్పీఎస్‌ఎస్ బాలుర పాఠశాలలో అటెండర్‌గా ఉద్యోగం ఇచ్చింది. ఆయన రెండేళ్ల కిందట మృతి చెందగా ఆ కొలువును అమరుడి సోదరుడు కళాధర్ చేస్తున్నారు.
తెలంగాణ అమరుల త్యాగాలకు గుర్తుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 36 అడుగుల ఎత్తైన తెలంగాణ అమరుల స్మారక చిహ్నాన్ని జిల్లా పూర్వ ఐకాస ఆధ్వర్యంలో గత నెల 29న ఆవిష్కరించారు. 2010లోనే అప్పటి సర్పంచి భూక్యా నెహ్రూనాయక్ ఆధ్వర్యంలో పంచాయతీ తీర్మానం చేసి ప్రస్తుత అంబేడ్కర్ కూడలి వద్ద స్థలాన్ని కేటాయించారు. రాజకీయ ఐకాస జిల్లా కన్వీనర్ డోలి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ చిహ్నం నిర్మాణం చేపట్టారు. ఈ ఏడాది మే 29న పూర్వ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆవిష్కరించారు. రాష్ట్రంలోని హైదరాబాద్, మంచిర్యాల, కరీంనగర్‌లో ఉన్న స్మారక చిహ్నాల కంటే ఇది ఎత్తైనది.
చెన్నారావుపేట మండలంలో ముగ్గురు..
చెన్నారావుపేట: అమీనాబాద్‌కు చెందిన పెండ్లి రవీందర్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఆర్థికసాయం అందించి కుమారుడు రంజిత్‌కు నర్సంపేట తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ సహాయకుడిగా ఉద్యోగం ఇచ్చింది. ప్రభుత్వ ఇచ్చిన ఆర్థిక సాయంతో చెల్లెలు పెళ్లి చేసినట్లు రంజిత్ తెలిపారు.
* డిగ్రీ చదువుతున్న పాపయ్యపేటకు చెందిన మహ్మద్ సవేర అనే యువతి 2010 మార్చి 3న ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ఆమె సోదరుడు సద్దాంకు ఉద్యోగం ఇవ్వగా మహబూబాబాద్ మండల పరిషత్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన గుర్రం స్వామి 2010లో క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. స్వామి కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల ఆర్థికసాయం, స్వామి అన్న భార్య రజితకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వగా ఆమె మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో పని చేస్తున్నారు.
సోదరుడికి..
టేకుమట్ల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవేడుకు చెందిన దంపతులు ఈశ్వరమ్మ, సర్వేశ్వరచారికి ముగ్గురు సంతానం.. రెండో కుమారుడు శ్రీనివాసచారి 2012లో పురుగు మందుతాగి ఆత్మహత్య చేసుకొని అమరుడయ్యారు. ఆయన తమ్ముడు సంపూర్ణచారికి రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌వో ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం కాటారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. సంపూర్ణచారి తల్లి ఆలనాపాలనా చూసుకుంటున్నారు.
గుర్తుకొస్తున్నారు..
దుగ్గొండి: దుగ్గొండి మండలంలో మూడు గ్రామాలకు చెందిన ఐదురుగు ప్రాణాలు త్యాగం చేసి అమరులయ్యారు. వీరిని స్థానికులు తరచూ గుర్తు చేసుకుంటారు..
* మధిరకు చెందిన అంబరగొండ మల్‌హల్‌రావు కిరోసిన్ పోసుకొని ఆత్మబలిదానం చేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసి భార్య అనురాధకు కొలువు ఇచ్చింది.
* లక్ష్మీపురానికి చెందిన రాయరాకుల పృథ్వీరాజ్, కొలగాని మల్లయ్య, మూమునూరి మహేందర్ అసువులు బాయగా, వీరందరి కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చారు.
* వెంకటాపురం నివాసి కుడుతాల మహేందర్ సైతం ఆత్మార్పణ చేసుకోగా ప్రభుత్వం రూ.10 లక్షలు అందించగా ఆయన కుమార్తె పేరుతో బ్యాంకులో డిపాజిటు చేశారు. ఆయన తమ్ముడికి ఉద్యోగం ఇవ్వగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ప్రభుత్వం చేయూతతో వారి కుటుంబాలకు సాంత్వన
నీటి పారుదలశాఖలో కొలువు
నెక్కొండ: నెక్కొండకు చెందిన మహమ్మద్ ఖాజా 2010 జూన్ 23న రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించారు. ఖాజాకు భార్య బీబీ, ఇద్దరు కుమారులు యాకూబ్‌పాష, జావిద్, కుమార్తె రజియా ఉన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక జూన్ 2, 2016న ఆయన కుమారుడు యాకూబ్‌పాషకు వరంగల్‌లో నీటిపారుదల శాఖలో అటెండర్‌గా ఉద్యోగం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అదే శాఖలో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ప్రభుత్వమిచ్చిన రూ.10 లక్షలతో కుమార్తె పెళ్లికి చేసిన అప్పులు తీర్చానని.. కొంత చిన్న కుమారుడి ఇంటి నిర్మాణానికి వెచ్చించినట్లు అమరుడి భార్య తెలిపారు.
జనగామలో..
జనగామ, న్యూస్‌టుడే: తరిగొప్పులకు చెందిన సాంబారి నర్సింలు, చంద్రకళ దంపతుల రెండో కుమారుడు సాంబారి నవీన్ 2012 ఏప్రిల్ 2న.. తన ప్రాణదానంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని కోరుతూ లేఖ రాసి విష గుళికలు మింగి, తర్వాత ఇంటికొచ్చి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రభుత్వం నవీన్ కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించింది. నవీన్ అన్న నాగార్జునకు ప్రభుత్వ కొలువు కల్పించింది. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో రుణ బాధ నుంచి విముక్తి పొందామని కుటుంబ సభ్యులు తెలిపారు.
* జనగామకు చెందిన శ్రీమంతోజు కృష్ణమూర్తి, లక్ష్మి దంపతుల కుమారుడు రామలింగాచారి స్థానిక ఏబీవీ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 2010 జనవరి 22న జనగామలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం రామలింగాచారి భార్య సృజనకు ఉద్యోగం కల్పించింది. రూ.10 లక్షల సాయం అందజేసింది. రామలింగాచారికి ఇద్దరు కుమారులు ఉండగా.. ఒకరు ఇంటర్, మరొకరు పాఠశాల విద్య చదువుతున్నారు.
* నర్మెట్ట మండలం హన్మంతాపూర్‌కు చెందిన మేకల కొమురయ్య, అరుణ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మేకల శ్యాంకుమార్ కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న సమయంలో 2011 నవంబర్ 2న ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు అనాథలయ్యారు. ప్రభుత్వం వారికి రూ.10 లక్షల సాయం అందించింది. శ్యాంకుమార్ సోదరుడు సతీష్‌కు సర్కార్ కొలువు ఇచ్చి అండగా నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/10/2023)
-
Rahul Gandhi: నేను చెప్పింది మోదీ అంగీకరించారు: రాహుల్ గాంధీ
-
TMC: మా ఎంపీలు, మంత్రులపై దిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు: తృణమూల్ కాంగ్రెస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!
-
MiG 21: 2025 నాటికి మిగ్-21 యుద్ధ విమానాల సేవలు నిలిపేస్తాం: ఎయిర్ చీఫ్ మార్షల్