logo

సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రగతి పథం

అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రగతి పథంలో పయనిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

Published : 03 Jun 2023 04:36 IST

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి దయాకర్‌రావు

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రగతి పథంలో పయనిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ కలెక్టరేట్‌లో శుక్రవారం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లితో పాటు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాజయ్య, జడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, కలెక్టర్‌ శివలింగయ్య, అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, డీసీపీ సీతారాం, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జమున తదితరులు పాల్గొన్నారు. ఉదయం 8.45 గంటలకు దయాకర్‌రావు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ తదితరులు సందర్శించారు. జనగామ జిల్లాలో గత దశాబ్ది కాలంలో చేపట్టిన అభివృద్ధి, ప్రగతి ఫలాలను మంత్రి దయాకర్‌రావు తన ప్రసంగంలో వివరించారు. ఆ వివరాలివి..

వేదికపై మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు యాదగిరిరెడ్డి, రాజయ్య, జడ్పీ ఛైర్మన్‌ సంపత్‌రెడ్డి, కలెక్టర్‌ శివలింగయ్య, అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ తదితరులు

వ్యవసాయ రంగంలో పురోగతి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు జనగామ ప్రాంతం కరవు పీడిత ప్రాంతంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో దేవాదుల ప్రాజెక్టు ద్వారా జనగామ ప్రాంతానికి గోదావరి జలాలను తరలించాం. ఇప్పుడు జిల్లాలోని చెరువులన్నీ జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలో 4.51 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తూ వ్యవసాయాన్ని పండగలా మార్చాం. రైతుబంధు కింద 2018 నుంచి 2023 వరకు జిల్లాలో 1,68,447 మంది రైతుల ఖాతాల్లో రూ.1700 కోట్లను జమ చేశాం. ప్రభుత్వమే రైతుల తరఫున బీమా ప్రీమియం చెల్లించి, చనిపోయిన రైతుల కుటుంబాలకు ఐదు రోజుల్లోనే రూ.5లక్షలు బీమా పరిహారాన్ని అందించే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. జిల్లాలో 8,348 మంది రైతులకు రూ.1.68 కోట్ల విలువైన రాయితీ విత్తనాలు అందించాం. 2014 నుంచి 2018 వరకు 84,000 మంది రైతులకు రూ.411.67 కోట్లను చెల్లించాం. 2017 నుంచి ఇప్పటి వరకు గొల్ల కురుమలకు రూ.210 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేశాం. జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు చేసే రైతులకు నాలుగేళ్లలో ఒక హెక్టారుకు రూ.69,502 చొప్పున అందజేశాం. ఇప్పటి వరకు జిల్లాలో 3 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌  సాగులోకి తెచ్చాం.

మత్స్య, సహకారశాఖలో..

జిల్లాలో మత్స్య, సహకారశాఖల్లో పురోగతి సాధించాం. 4,536 చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో వంద శాతం రాయితీపై రూ.8.31 కోట్ల విలువైన చేప, రొయ్య పిల్లలను వదిలాం. మత్స్యకారులకు రాయితీపై వాహనాలను అందిస్తున్నాం. జిల్లాలో మరణించిన 21 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.82 లక్షల ప్రమాద బీమా పరిహారం చెల్లించాం. సహకారశాఖ ద్వారా రూ.139 కోట్ల రుణాలను అందించాం.

చెరువులకు మరమ్మతు పనులు  

జిల్లా వ్యాప్తంగా మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా చెరువులకు మరమ్మతు పనులు చేపట్టాం. జిల్లాలో నాలుగు విడతలుగా రూ.169.38 కోట్లతో 543 చెరువులు, కాలువలకు మరమ్మతు చేశాం. చెరువుల మరమ్మతు పనుల తర్వాత 29,578 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చాం. గతంలో జిల్లాలో తాగునీటికి తీవ్ర ఇబ్బంది ఉండేది. మిషన్‌ భగీరథ పథకంలో జిల్లాలో మొత్తం 611 ఆవాసాలకు రూ.840 కోట్లు ఖర్చు చేసి ప్రతి ఇంటికీ సురక్షిత నీటిని అందిస్తున్నాం.

వైద్య రంగంలో..

జిల్లాలో వైద్య రంగంలో గణనీయమైన ప్రగతి సాధించాం. తల్లీ బిడ్డల సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్యను పెంచుతూ కేసీఆర్‌ కిట్లను అందిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 22,978 మందికి కేసీఆర్‌ కిట్లను అందించాం. జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో రూ.48 లక్షలతో అత్యాధునిక మార్చురి భవనాలను నిర్మించాం. రూ.60 లక్షలతో రేడియాలజీ విభాగం, రూ.54 లక్షలతో బచ్చన్నపేట, పాలకుర్తి సీహెచ్‌సీల్లో అభివృద్ధి పనులు చేపట్టాం.  జనగామ పట్టణంలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేశాం. ఎంసీహెచ్‌లో ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో ప్రసవాలు జరుగుతున్నాయి. జనగామకు వైద్య కళాశాల మంజూరు చేశాం. రూ.190 కోట్లతో వైద్య కళాశాల నిర్మాణానికి 23 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. రూ.23 కోట్లతో 50 పడకల క్రిటికల్‌ కేర్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతున్నాం. కంటి వెలుగు పరీక్షల్లో భాగంగా జిల్లాలో 2,23,000 మందిని పరీక్షించి 35,000 మందికి రీడింగ్‌ కంటి అద్దాలు, 31,000 మందికి దూరపు చూపు కంటి అద్దాలను పంపిణీ చేశాం.

గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు

జిల్లాలో గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యమిస్తున్నాం. ఉపాధి హామీ పథకంలో భాగంగా 1,17,000 కుటుంబాలకు జాబ్‌కార్డులు అందించాం. 8,95,000 కుటుంబాలకు పని కల్పించాం. పంచాయతీలకు రూ.196.14 కోట్ల నిధులను విడుదల చేశాం. రూ.13.64 కోట్ల వ్యయంతో జిల్లాలో 62 రైతు వేదికలను నిర్మించాం. ఆసరా పింఛన్ల కింద అర్హులైన 1,41,000 మందికి వెయ్యి చొప్పున రూ.922 కోట్లను పంపిణీ చేశాం. కల్యాణలక్ష్మి పథకంలో 19,722 మందికి రూ.179.98 కోట్లు అందించాం. జిల్లాలో 483 క్రీడా ప్రాంగణాలను పూర్తి చేశాం. రైతులకు 24 గంటల  పాటు ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం. నూతన విద్యుత్తు ఉపకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. దళితబంధు పథకం కింద 185 యూనిట్లకు రూ.18.50కోట్లు అందించాం. పేద విద్యార్థుల కోసం 17 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశాం. మన ఊరు మన బడి పథకంలో రూ.175.37 కోట్ల ఖర్చుతో వివిధ సౌకర్యాలు కల్పించాం. జిల్లాకు మంజూరైన 4,000 రెండు పడక గదుల ఇళ్లకు గాను 1,350 ఇళ్లు పూర్తి చేశాం. 524 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశాం. జనగామ పట్టణంలో ఆదర్శ మార్కెట్‌ నిర్మించాం. పట్టణ ప్రకృతివనాలను ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు