logo

నమోదు పెంపు లక్ష్యంగా..

నూతన విద్యా సంవత్సరం (2023-24) ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించే ప్రధాన లక్ష్యంతో శనివారం నుంచి 9 వరకు  ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట పేరిట నిర్వహించే ప్రత్యేక నమోదు కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొననున్నారు.

Published : 03 Jun 2023 04:46 IST

నేటి నుంచి బడిబాట షురూ..
న్యూస్‌టుడే, మానుకోట, డోర్నకల్‌, మరిపెడ

గతేడాది బడిబాటలో భాగంగా శనిగపురంలో పిల్లల పేరు నమోదు  చేస్తున్న ఉపాధ్యాయుడు

నూతన విద్యా సంవత్సరం (2023-24) ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించే ప్రధాన లక్ష్యంతో శనివారం నుంచి 9 వరకు  ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట పేరిట నిర్వహించే ప్రత్యేక నమోదు కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొననున్నారు. నమోదు ప్రక్రియను ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించాలి. ప్రత్యేక నమోదు జరిగాక ఈ నెల 12 నుంచి నుంచి 17వరకు పాఠశాల స్థాయిలో వివిధ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కరపత్రాలు, బ్యానర్లు తదితర ప్రచార సామాగ్రి వ్యయం కోసం ప్రధానోపాధ్యాయులు పాఠశాల నిధులను వినియోగించుకోవచ్చు. బడిబాట కార్యక్రమ నిర్వహణలో జిల్లా, మండల, పాఠశాల స్థాయిలో సమావేశాలను నిర్వహించాలి.మంత్రులను, ప్రజాప్రతినిధులను, జిల్లా పరిషత్‌, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులను ఆహ్వానించాలి. గ్రామ సభలను నిర్వహించాలి. కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలి. రాష్ట్రంలో అత్యధికంగా ప్రవేశాలు పెంపొందించిన మూడు జిల్లాలు, 10 పాఠశాలలను గుర్తించి అభినందించనున్నారు.

ఇదీ కార్యక్రమం..

* ప్రతి ఆవాస ప్రాంతంలో బడిఈడు పిల్లల వివరాలను ఉపాధ్యాయులు గుర్తించి వారిని సమీప పాఠశాలల్లో చేర్పించాలి.
* ప్రభుత్వ పాఠశాలల్లో నమోదును పెంచి నాణ్యత గల విద్యను అందించాలి.
* సమాజ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి.
* సమీప అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఐదేళ్ల వయసు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి.
* గ్రామ విద్యారిజిస్టర్‌లో తాజా వివరాలు నమోదు చేయాలి.
* ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఆరో తరగతిలో చేర్పించాలి.
* తక్కువ నమోదు గల పాఠశాలలను గుర్తించి తల్లిదండ్రుల సహకారంతో సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలి.
* బడి బయట (ఇంతవరకు నమోదుకాని) ఉన్న పిల్లలను గుర్తించి వారి వయసుకు తగినట్లు తరగతుల్లో చేర్పించాలి.


విజయవంతంగా నిర్వహించాలి
పి.రామారావు, జిల్లా విద్యాశాఖాధికారి

ప్రత్యేక నమోదు లక్ష్యంగా నిర్వహించే బడిబాట కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయుడు పాల్గొని విజయవంతం చేయాలి.ముఖ్యంగా మారు మూల గ్రామాల్లో బడిఈడు పిల్లలను తప్పనిసరిగా చేర్పించేలా ప్రత్యేక కృషి చేయాలి.ఈ కార్యక్రమ నిర్వహణలో భాగంగా శుక్రవారం సమగ్రశిక్ష సమన్వయకర్తలు, అధికారులతో సమావేశం నిర్వహించాం.ప్రత్యేక ప్రణాళికలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని