logo

ప్రగతి బాటలో మానుకోట..!

అనేక ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. తొమ్మిదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధిని సాధించుకున్నాం.

Updated : 03 Jun 2023 05:34 IST

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో మంత్రి సత్యవతిరాథోడ్‌

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, మహబూబాబాద్‌: అనేక ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. తొమ్మిదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధిని సాధించుకున్నాం. గిరిజన జిల్లా అయిన మానుకోట ప్రగతి బాటలో పయనిస్తోంది. ఈ అభివృద్ధి మార్గం ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వ సంకల్పానికి బలం చేకూరుతోంది.’ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన రాష్ట్ర పదో అవతరణ దినోత్సవాలకు ఆమె ముఖ్య అతిథి హాజరయ్యారు. అంతకు ముందు ఆఫీసర్స్‌ క్లబ్‌ సమీపంలో ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పరిపాలన కేంద్రీకరణలో భాగంగా ఏర్పడ్డ మహబూబాబాద్‌ జిల్లా సమగ్రాభివృద్ధి, ప్రజాసంక్షేమానికి సర్కారు రూ. వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి చేసిన ప్రసంగం ఆమె మాటల్లోనే..

సంక్షేమం

గిరిజన సంక్షేమశాఖ పరిధిలో 19 ఆశ్రమ పాఠశాలలు, ఆరు వసతి గృహాలు, తొమ్మిది కళాశాల వసతి గృహాలు, 104 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో 8,861 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ట్రైకార్‌ ద్వారా గిరిజన లబ్ధిదారులకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.20.85 కోట్లతో 732 మందికి 2,606 యూనిట్లు లబ్ధి చేకూర్చాం. 1,12,395 మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నాంÙ. ఇందుకు నెలకు రూ.1658 కోట్లు వెచ్చిస్తున్నాం. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకంలో భాగంగా  ఇప్పటి వరకు 30,954 మందికి రూ.26.98 కోట్లు మంజూరు చేశాం.

విద్యకు పెద్దపీట

కార్పొరేట్‌ తరహాలో సర్కారు బడుల సమగ్ర స్వరూపాన్ని మార్చేందుకు మన ఊరు-మన బడి, మన బస్తీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మొదటి దశలో 316 పాఠశాలలను ఎంపిక చేశాం. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో రూ. 26 కోట్లు, ప్రభుత్వ నిధులు రూ.46 కోట్లతో సౌకర్యాలు కల్పిస్తున్నాం.

వ్యవసాయాభివృద్ధి

2022-23లో జిల్లాలో వానాకాలం, యాసంగి సీజన్‌లో 6,08,028 ఎకరాలు సాగు చేశారు. 1,80,406 మంది అన్నదాతలకు రైతుబంధు పథకంలో పెట్టుబడి సాయంగా రూ.1640 కోట్లు అందించాం. 2023లో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు అందిస్తాం. ఈ ఏడాది 8,264 ఎకరాల్లో పంటనష్టపోయిన 24,958 మంది రైతులకు రూ.2,066 లక్షల నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదికను అందించాం. జిల్లాలో 6,067 ఎకరాల్లో 1374 మంది రైతులు ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నారు.

ఇళ్ల పట్టాల పంపిణీ

2022 వరకు ప్రభుత్వ స్థలాలో నివసిస్తున్న నిరుపేదల ఇళ్ల స్థలాలను జీవో నంబరు 58, 59లో క్రమబద్ధీకరించనున్నాం. 58 జీవో ఉత్తర్వుల ప్రకారం 5401 దరఖాస్తులకు 742 మందికి పట్టాలు అందించాం. 59 జీవో ఉత్తర్వుల ప్రకారం 1390 దరఖాస్తులకు 370 మందికి పట్టాలు ఇచ్చాం. పొడిగించిన గడువు ప్రకారం జీవో నంబరు 58 ఉత్తర్వులకు 5159, జీవోనంబరు 59 ఉత్తుర్వులకు 973 దరఖాస్తులు స్వీకరించాం.

పోడు రైతులకు పట్టాలు

అడవులనే నమ్ముకుని జీవిస్తున్న అదివాసుల జీవన సంస్కృతులను కాపాడటానికి సర్కారు కృషి చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు ఆ భూములపై హక్కులు కల్పించేలా పోడు పట్టాలందించబోతున్నాం. జిల్లాలోని తొమ్మిది మండలాల్లోని 152 పంచాయతీలోని 320 హ్యాబిటేషన్ల రైతులను గుర్తించాం. 24,181 ఆర్జీలను పరిష్కరించాం. 67,730 ఎకరాలకు పట్టాలు అందజేయనున్నాం.

ఆరోగ్యమే ఆనందం

జిల్లాలో మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రభుత్వ వైద్య, నర్సింగ్‌ కళాశాల మంజూరైంది. ఈ ఏడాది నుంచే బోధన కొనసాగిస్తున్నాం. రూ.550 కోట్లతో వైద్యకళాశాల, అనుబంధంగా రూ.40 కోట్లతో 200 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నాం. జిల్లా ఆసుపత్రిని 330 పడకల ప్రభుత్వ సాధారణ వైద్యశాలగా ఉన్నతీకరించాం. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో 5 పీహెచ్‌సీలను ఎంపిక చేశాం.
* అమర వీరుల కుటుంబాలను సన్మానించి. వివిధశాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు, సిబ్బందికి అవార్డులను అందించారు. వేడుకల్లో జడ్పీ అధ్యక్షురాలు ఆంగోతు బిందు, ఎంపీ మాలోతు కవిత, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, కలెక్టర్‌ శశాంక, జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ డెవిడ్‌, డీఎఫ్‌వో రవికిరణ్‌, తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని