logo

దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాం

రాష్ట్రం ఏర్పడి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకున్నాం. సంక్షేమ పథకాల అమలులో సీఎం కేసీఆర్‌ తనదైన శైలిలో చెరగని ముద్ర వేస్తూ.. ముందుకు సాగుతున్నారు.

Published : 03 Jun 2023 04:46 IST

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ విప్‌ ఎంఎస్‌. ప్రభాకర్‌రావు

జాతీయ జెండాకు అభివాదం చేస్తున్న ప్రభుత్వ విప్‌ ప్రభాకర్‌రావు, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ గాష్‌ ఆలం

ములుగు, న్యూస్‌టుడే: ‘రాష్ట్రం ఏర్పడి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకున్నాం. సంక్షేమ పథకాల అమలులో సీఎం కేసీఆర్‌ తనదైన శైలిలో చెరగని ముద్ర వేస్తూ.. ముందుకు సాగుతున్నారు. పేదల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎప్పటికప్పుడు వినూత్న విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతూ.. బంగారు తెలంగాణ ఫలాలను అట్టడుగు వర్గాలకు చేరవేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాం. సబ్బండ వర్గాల సంక్షేమానికి కొత్త బాటలు వేయడమే కాకుండా దేశానికి కొత్తదారిని చూపుతున్నాం. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల పక్షపాతిగా నిలుస్తున్నాం. దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గొప్ప వేడుకగా నిలిచిపోనున్నాయి. ప్రతి రంగంలో సాధించిన ప్రగతిని నేటి నుంచి 21 రోజుల పాటు పండగ వాతావరణంలో నిర్వహించనున్నాం. మారుమూల ప్రాంతమైన ములుగు జిల్లాపై అభిమానంతో కేసీఆర్‌ వైద్య కళాశాలతో పాటు గిరిజన విశ్వవిద్యాలయం కేటాయించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవన నిర్మాణానికి రూ.65 కోట్లతో అనుమతి ఇచ్చార’ని ప్రభుత్వ విప్‌ పేర్కొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును ఆయన వివరించారు.
జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఎంఎస్‌. ప్రభాకర్‌ రావు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో జరిగే వేడుకల్లో భాగంగా ప్రాంగణానికి చేరుకున్న ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

* రైతుల్లో ఆత్మ విశ్వాసం నింపడంలో ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది. జిల్లాలో రైతు బంధు పథకం ద్వారా ఇప్పటివరకు  6,83,023 మంది రైతులకు రూ. 645.02 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది.  రైతు భీమా కింద 963 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.48.15 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది.* సూక్ష్మ నీటి సేద్యం పథకంలో భాగంగా 2074 మంది లబ్ధిదారులకు 5136.4 ఎకరాల్లో రూ.13.52 కోట్లతో బిందు సేద్యం పరికరాలను అందించాం. * దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 120 మంది దళిత కుటుంబాలను గుర్తించి రూ.12 కోట్లు వెచ్చించాం. * జిల్లాలో నాణ్యమైన వైద్య సేవలందించేందుకు రూ.20 లక్షల నిధులతో నూతన భవనాల నిర్మాణం పూర్తి చేసి సిబ్బందిని నియమించాం. ప్రాంతీయ ఆసుపత్రిలో రూ.32 లక్షలతో టీ హబ్‌ భవనం నిర్మాణం చేశాం. మాతా శిశు సంరక్షణ కోసం రూ.7 కోట్లతో ఏటూరునాగారంలో భవన నిర్మాణం చేసుకున్నాం. పోషకాహార లోప నియంత్రణకు జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికచేసి కేసీఆర్‌ న్యూట్రిషియన్‌ కిట్లు గర్భిణీలకు అందించాం. * జిల్లాలోని 981 కిలోమీటర్ల పైపులైన్‌ పూర్తి చేసి తాగునీరందించేందుకు రూ.148.03 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. 1213 కిలోమీటర్ల పైపులైన్‌తో 606 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణాలు పూర్తి చేసి 89,983 కనెక్షన్లు ఇచ్చి మిషన్‌భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నాం.* నిరుపేదలకు 90.36 కోట్లతో మంజూరైన 1,797 గృహాలకు గాను ఇప్పటివరకు 1085 గృహాలు పూర్తి చేయడం జరిగింది. పూర్తయినవి లబ్ధిదారులకు అందించాం. మిగిలిన 712 గృహాలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. *పేదింటి ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కాకుండా కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్‌ ద్వారా రూ.1,16,116 అందిస్తున్నాం. ఈ పథకం కింద 9,805 మందికి రూ.93.46 కోట్లు అందించాం.* జిల్లాలో 24,814 వేల వ్యవసాయ బావులకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం*రాష్ట్రస్థాయిలో ఇంటర్‌ ఫలితాల్లో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు రూ. 783 కోట్ల నిధులతో అదనపు తరగతి గదులు తదితర మౌలిక వసతులు కల్పించడం జరిగింది. *వివిధ పథకాల ద్వారా రూ.462 కోట్లతో రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టు ద్వారా నక్సలైట్‌ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు వేశాం. 3 వంతెనల నిర్మాణం కోసం రూ.4.20 కోట్లు, నూతన రహదారుల నిర్మాణం కోసం 36 కిలోమీటర్లలో రూ.40 కోట్లతో మరమ్మతు పనులు చేశాం.* జిల్లాలో 104 పరిశ్రమలకు గాను 210 దరఖాస్తులు రాగా 181 అనుమతులు సకాలంలో అందజేయడం జరిగింది. టీ ఐడియా ద్వారా 84 పరిశ్రమలకు రూ.6.59 కోట్లు, టీ ఫ్రెడ్‌ ద్వారా 250 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.1.97 కోట్లు రాయితీ మంజూరు చేశాం.  * రామప్ప దేవాలయం వద్ద ప్రసాద్‌ పథకంలో భాగంగా రూ.61.99 కోట్లతో పర్యాటక అభివృద్ధి కింద మౌలిక సదుపాయాల పనులు చేపట్టాం. స్వదేశీ దర్శన్‌ పథకంలో భాగంగా రూ.7.35 కోట్లతో గట్టమ్మ వద్ద, రూ.27.65 కోట్లతో లక్నవరం చెరువు, రూ.13.42 కోట్లతో మేడారం సమ్మక్క-సాలరమ్మ దేవాలయం, రూ.48 లక్షలతో దామెరవాయి పురాతన సమాధుల పరిరక్షణ మొదలగు అభివృద్ధి పనులు చేపట్టాం.

సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ.. శుభాభివందనాలు

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి సహకారం అందిస్తున్న జిల్లా ఇన్‌ఛార్జి త్రి, జడ్పీ ఛైర్మన్‌, ఎంపీ, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు శుభాభివందనాలు. కేసులను సత్వరం పరిష్కరించడంలో చొరవ చూపిస్తున్న న్యాయమూర్తులకు శుభాకాంక్షలు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమవుతున్న జిల్లా పోలీసు శాఖ అధికారులకు, ప్రజలను చైతన్య పరచడంలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు వివరించి ప్రభుత్వ పథకాల ఫలాలు చివరి గడపకు చేరేలా తమ వంతు సహకారం అందిస్తున్న ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతున్నాన’ని ప్రభుత్వ విప్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ పోరిక గోవిందునాయక్‌, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ బడే నాగజ్యోతి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బుచ్యయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు