logo

ధాన్యం మిల్లులో అగ్నిప్రమాదం

నర్సంపేట పట్టణం మాదన్నపేట రోడ్డులోని సుగుణ రైసు మిల్లులో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. మిల్లు యజమాని, కార్మికులు, అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేయడంతో

Published : 04 Jun 2023 05:19 IST

నర్సంపేట రైసుమిల్లులో కాలిన ధాన్యం, బియ్యం

నర్సంపేట, న్యూస్‌టుడే: నర్సంపేట పట్టణం మాదన్నపేట రోడ్డులోని సుగుణ రైసు మిల్లులో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. మిల్లు యజమాని, కార్మికులు, అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి విద్యుత్తు షార్ట్‌ సర్య్కూట్‌ కారణమని చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షులు, మిల్లు యజమాని ఊరటి సాంబయ్య తెలిపిన ప్రకారం.. మాదన్నపేట రోడ్డులోని మిల్లులో కొనుగోలు చేసిన ధాన్యం, బియ్యం కలిపి రూ.కోటికిపైగా  విలువ చేసే నిల్వలున్నాయి. మిల్లు యజమాని సాంబయ్య మిల్లు పక్కన భవనంలో నివాసముంటున్నారు.  ప్రమాదం జరిగిన సమయంలో మిల్లులో హమాలీలు, యజమాని లేరు. ఉదయం 9 గంటల ప్రాంతంలో మిల్లు నుంచి పెద్దఎత్తున పొగతోపాటు ఒక్కసారిగా మంటలు రేగడంతో పక్క గుడిసెలో ఉన్న ఒకరు చూసి కేకలు వేయడంతో యజమాని సాంబయ్య, హమాలీలు, కార్మికులంతా పరుగున మిల్లు వద్దకు చేరుకున్నారు. అగ్నిమాపక కేంద్రం అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి  గంట సేపు శ్రమించి మంటలను అదుపు చేశారు. లేదంటే ప్రమాదం తీవ్రత పెరిగి ఆస్తి నష్టం భారీగా ఉండేది.  మిల్లును ఆనుకొని వేసిన పెద్ద షెడ్డు నిండా ధాన్యం, బియ్యం బస్తాల నిల్వలున్నాయి. మిల్లు ఉత్తర దిశ, వెనక భాగంలోనూ ధాన్యం బస్తాలు ఉన్నాయి. మంటలు ఆర్పడం ఏమాత్రం ఆలస్యమైనా వీటికి అంటుకొని భారీ నష్టం జరిగేది. మిల్లు ముందు భాగంలో ఉన్న  కార్యాలయం గదిలో షార్ట్‌సర్య్కూట్‌ కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుందని గుర్తించారు. ఈ ప్రమాదంలో క్యాబిన్‌ కార్యాలయంలోని మిషన్లు, పుస్తకాలు, ఫర్నిచర్‌తోపాటు వెలుపల ఉన్న ధాన్యం, బియ్యం బస్తాలు, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. రూ.10లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని సాంబయ్య చెప్పగా అగ్నిమాపక కేంద్ర అధికారి జైపాల్‌రెడ్డి రూ.6 లక్షల నష్టం వాటిలినట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని