మందకొడిగా ‘కవచ్’ పనులు
ఒడిశా రైలు ప్రమాదంతో ఆ శాఖ దిగ్భ్రాంతికి లోనయింది. ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ దుర్ఘటనతో భారతీయ రైల్వే చేపట్టిన ‘కవచ్’ నిర్మాణ పనులు మరోసారి తెరమీదకు వచ్చాయి.
రైలు ఇంజిన్‌లో కవచ్ యంత్రం (డీఎంఐ)
కాజీపేట, న్యూస్‌టుడే: ఒడిశా రైలు ప్రమాదంతో ఆ శాఖ దిగ్భ్రాంతికి లోనయింది. ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ దుర్ఘటనతో భారతీయ రైల్వే చేపట్టిన ‘కవచ్’ నిర్మాణ పనులు మరోసారి తెరమీదకు వచ్చాయి. అత్యంత రద్దీగా ఉండే కీలకమైన కాజీపేట- సికింద్రాబాద్ మధ్య ఈ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఎదురెదురుగా వచ్చే రైళ్లను సెన్సర్ల ద్వారా గుర్తించడం, పట్టాలమీద పడిన వస్తువులను గుర్తించి రైలు దానికదే ఆగిపోయే విధంగా రూపొందించిన అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఇది.
* ప్రతి రోజు కాజీపేట, వరంగల్ మీదుగా వందకు పైగా రైళ్లు ప్రయాణం చేస్తాయి. బల్లార్షా- వరంగల్- విజయవాడ మార్గంలో మూడో లైను నిర్మాణం కూడా జరుగుతోంది. ఈక్రమంలో రైళ్ల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కవచ్ నిర్మాణం వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్ల ద్వారా నడిచే రైళ్లకు త్వరగా అనుసంధానించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
టవర్ల నిర్మాణ దశలోనే..: ప్రస్తుతం సికింద్రాబాద్ - కాజీపేట 135 కి.మీ. మార్గంలో ఆయా రైల్వే స్టేషన్లలో కవచ్‌కు సంబంధించిన టవర్ల నిర్మాణం జరుగుతోంది. రైల్వే పట్టాల మీద రేడియేషన్ ప్లేట్లు, ప్రతి రైల్వే గేటు వద్ద సెన్సర్లు, రైల్వే స్టేషన్ల వద్ద టవర్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికి ఇవి ప్రాథమిక స్థాయిలోనే ఉన్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తి కావడానికి మరో ఆరు నెలలు పట్టవచ్చని తెలిపారు.
ఈ మార్గంలో అత్యవసరం..
కాజీపేట- విజయవాడ, కాజీపేట- బల్లార్షా మార్గంలో నిత్యం అనేక రైళ్లు ప్రయాణం చేస్తుంటాయి. బల్లార్షా- విజయవాడ మార్గం గ్రాండ్‌ట్రంక్ రూట్ (అత్యధికంగా రైళ్లు ప్రయాణం చేసే మార్గం)గా పేరుపొందింది. బల్లార్షా మార్గం నుంచి కాజీపేటకు అత్యధికంగా గూడ్సు రవాణా జరుగుతోంది. ఇలాంటి మార్గంలో కవచ్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు లేకపోవడం కొంత నిరాశను కలిగిస్తోంది. రెండో దశ పూర్తయిన తర్వాత బల్లార్షా- వరంగల్- విజయవాడ మార్గంలో కవచ్ నిర్మాణం జరిగే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.