10న ఆర్‌అండ్‌బీ సర్కిల్ కార్యాలయం ప్రారంభం
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన రహదారులు భవనాల శాఖకు సంబంధించిన సర్కిల్ కార్యాలయంతో పాటు పలు సబ్ డివిజన్లను ఈ నెల 10న ప్రారంభించాలని నిర్ణయించారు.
కార్యాలయానికి కేటాయించిన భవనం ఇదే..
న్యూస్‌టుడే, భూపాలపల్లి : భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన రహదారులు భవనాల శాఖకు సంబంధించిన సర్కిల్ కార్యాలయంతో పాటు పలు సబ్ డివిజన్లను ఈ నెల 10న ప్రారంభించాలని నిర్ణయించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సుపరిపాలన పేరిట చేపట్టే కార్యక్రమంలో కొత్తగా ఏర్పడిన రహదారులు భవనాల శాఖ బిల్డింగ్ సబ్ డివిజన్‌తో ఇతర సబ్ డివిజన్లను జిల్లా మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలతోనే ప్రారంభించనున్నారు. కొత్తవాటి ఏర్పాటులో ప్రభుత్వం రెండు నెలల క్రితమే ఆమోదముద్ర వేసింది. మొదటగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(ఈ నెల 2న) ప్రారంభించాలని నిర్ణయించారు. కార్యక్రమాలు ఎక్కువగా ఉండటంతో తేదీని మార్చినట్లు సంబంధిత డివిజన్ అధికారి ఒకరు తెలిపారు.
రహదారుల పర్యవేక్షణకు : రహదారుల విస్తీర్ణం పెరుగుతున్నందున నిర్మాణాల పర్యవేక్షణకు కొత్తగా భూపాలపల్లిలో ఆర్‌అండ్‌బీ సర్కిల్ కార్యాలయంతో పాటు సబ్ డివిజన్ల ఏర్పాట్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇప్పటివరకు వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రంలోని సర్కిల్ కార్యాలయాన్ని రెండుగా విభజించి, ప్రత్యేకంగా భూపాలపల్లి, ములుగు జిల్లాలకు కలిపి జయశంకర్ జిల్లా కేంద్రంలోనే రోడ్లు భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ) సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం వరంగల్ ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నాగేందర్‌రావుకు భూపాలపల్లి సర్కిల్‌కు ఎస్‌ఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కొత్త సర్కిల్, డివిజన్ కొత్తగా జిల్లాల ఆవిర్భావం తర్వాతనే ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులను ప్రభుత్వం నియమించింది. ఆర్‌అండ్‌బీ శాఖలో మాత్రం కొత్తగా జిల్లా ఏర్పడిన నాటి నుంచి నేటికీ ములుగులోనే గతంలో ఏర్పాటైన ఈఈ స్థాయి అధికారి పర్యవేక్షణలోనే భూపాలపల్లి జిల్లాలో ఆ శాఖకు సంబంధించి వివిధ అభివృద్ధి పనుల పర్యవేక్షణ కొనసాగింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొత్తగా రెండు జిల్లాలకు సంబంధించి భూపాలపల్లి, ములుగు జిల్లాలకు కలిపి సర్కిల్ కార్యాలయంతో పాటు కొత్తగా ఈఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అయితే సర్కిల్ కార్యాలయం హెడ్‌క్వార్టర్ భూపాలపల్లిలోనే ఉంటుంది. ఇక్కడి నుంచే(సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీరు) ఎస్‌ఈ ములుగు జిల్లాలో సంబంధిత శాఖకు చెందిన అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారు.
సబ్ డివిజన్ కార్యాలయాల ఏర్పాటు : ఇంతవరకు జిల్లాలోని 11 మండలాల్లో కేవలం ఒకే ఒక్క డీఈ పోస్టు ద్వారానే రోడ్లు, తదితర రోడ్లు భవనాల నిర్మాణ పనుల పర్యవేక్షణ కొనసాగుతుంది. దీంతో సదరు డీఈపై అదనపు భారం పడింది. ఇప్పుడు ప్రత్యేకంగా జిల్లాకు ప్రస్తుతం కొత్తగా కాటారంలో ఒక సబ్ డివిజన్ కార్యాలయంతో పాటు భూపాలపల్లిలో రెండు సబ్ డివిజన్ కార్యాలయాలు మంజూరయ్యాయి. కాటారంలో ఏర్పాటు చేసే సబ్ డివిజన్ పరిధిలో మహదేవపూర్, మల్హర్, మహాముత్తారం, కాటారం, పలిమెల మండలాల్లో జరిగే అభివృద్ధి పనుల పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. భూపాలపల్లిలో ఏర్పాటు చేసే రెండు సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఇందులో ఒకటి.. క్వాలిటీ కంట్రోల్ బోర్డు సబ్ డివిజన్ కార్యాలయంతో పాటు బిల్డింగ్ (భవనాల పర్యవేక్షణ) విభాగం డీఈ కార్యాలయం ఏర్పాటు కానుంది. అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ ఏఈ కొత్త పోస్టు మంజూరైంది. ఈ మేరకు జిల్లాకు కేటాయించిన ఐదుగురు ఏఈ పోస్టుల్లో ప్రస్తుతం ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అందుబాటులో మినిస్టీరియల్ సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిని ఆయా విభాగాలకు సర్దుబాట్లు చేస్తారు. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో జరిగే వివిధ అభివృద్ధి పనుల టెండర్లు ఇక్కడి నుంచే కొనసాగనున్నాయి. పూర్తిస్థాయి అధికారులతో పాటు సిబ్బందిని నియమిస్తే ఆ శాఖకు సంబంధించిన పనులకు ఎలాంటి జాప్యం లేకుండా ఉంటుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసే నూతన సర్కిల్ కార్యాలయాన్ని ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయంలో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కొనసాగుతున్న ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయాన్ని గణపురం మండలంలోని గాంధీనగర్ గ్రామంలోకి మార్చనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.