logo

సంక్షేమంలో మనమే ఆదర్శం

అన్ని రాష్ట్రాలకు సంక్షేమంలో మనమే ఆదర్శమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని కొంపెల్లిలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, రైతు వేదిక ప్రారంభోత్సవం ఏర్పాటు చేశారు.

Published : 04 Jun 2023 05:28 IST

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి టౌన్‌, న్యూస్‌టుడే : అన్ని రాష్ట్రాలకు సంక్షేమంలో మనమే ఆదర్శమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని కొంపెల్లిలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, రైతు వేదిక ప్రారంభోత్సవం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతో పురోగతి సాధించుకున్నామని తెలిపారు. దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుందామని చెప్పారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నామని పేర్కొన్నారు. చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందన్నారు. అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. రైతు బంధు, బీమా, ఉచిత విద్యుత్తు అందిస్తోందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు, తాగు నీరు ఇస్తోందని అన్నారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాలు మరో 19 రోజుల పాటు ఉంటాయని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎడ్ల బండ్ల ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ కళ్లెపు శోభ, ఎంపీపీ లావణ్య, ఏవో విజయ్‌ భాస్కర్‌, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ సంపత్‌, భారాస నాయకులు రఘుపతిరావు, సాగర్‌రెడ్డి పాల్గొన్నారు.

భూపాలపల్లి కలెక్టరేట్‌, గణపురం : రైతు సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ కార్యాచరణ అమలు చేస్తోందని.. ప్రతి దశలోనూ అన్నదాతలకు అండగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గణపురం మండలం చెల్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్నటువంటి భూ సమస్యల వివరాలు సేకరించి జులై మొదటి వారంలో పరిష్కరిస్తామని చెప్పారు. రైతు వేదిక సమీపంలోని మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న లావాదేవీలు, స్టాకు, నాణ్యత తదితర వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, డీఆర్డీవో పురుషోత్తం, ఎంపీడీవో అరుంధతి, ఎంపీపీ రజిత, పీఏసీఎస్‌ ఛైర్మన్లు సత్యనారాయణరెడ్డి, పూర్ణచందర్‌రెడ్డి, సర్పంచి మధుసూదన్‌రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నగేశ్‌  పాల్గొన్నారు.

కొంపల్లిలో ఎడ్ల బండ్ల ర్యాలీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని