పుర ఆదాయానికి గండి ట్రేడ్ లైసెన్స్‌లపై దృష్టి ఏదీ?
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్‌ల జారీపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో ‘పుర’ ఆదాయానికి గండి పడుతోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నింటికీ ప్రభుత్వం ట్రేడ్ లైసెన్సు తప్పనిసరి చేసింది.
న్యూస్‌టుడే, భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్‌ల జారీపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో ‘పుర’ ఆదాయానికి గండి పడుతోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నింటికీ ప్రభుత్వం ట్రేడ్ లైసెన్సు తప్పనిసరి చేసింది. ఇన్నాళ్లు అవసరమైన దుకాణదారులు మాత్రమే అనుమతి పత్రం తీసుకొనేందుకు ముందుకొచ్చేవారు. లైసెన్స్‌ల జారీలో నిర్లక్ష్యం, అరకొర ఆన్‌లైన్ విధానంతో ఆదాయం లక్ష్యం నీరుగారుతోంది. భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 30 వార్డుల్లో 1,601 వరకు దుకాణాలున్నాయి. అనధికారికంగా మరో 200లకు పైగానే ఉంటాయని అంచనా.. ఇప్పటివరకు 774 దుకాణాలను మాత్రమే అధికారులు ఆన్‌లైన్ చేశారు. దీంతో రూ.లక్షలాది రూపాయల ఆదాయం సమకూరాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో భారీగా ఆదాయానికి గండి పడుతోంది. ట్రేడ్ లైసెన్సుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో పురపాలక సంఘానికి రూ.15.66 లక్షల వరకు డిమాండ్ ఉంటే ఇప్పటి వరకు రూ.8.01 లక్షల వరకు వసూలైనట్లు అధికారులు తెలిపారు.
పెరుగుతున్న దుకాణాలు..
రోజురోజుకు పట్టణ విస్తీర్ణంతో పాటు కొత్తగా ఏర్పడుతున్న కాలనీలతో దుకాణాల సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు రహదారులు, ప్రధాన కేంద్రాలకు పరిమితమైన వ్యాపార సంస్థలు, దుకాణాలు, హోటళ్లు, ఫలహార శాలలు, పాన్ షాపులు కాలనీల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ఆ స్థాయిలో ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, కనీస అవసరాలు కల్పించాల్సిన బాధ్యత పురపాలక సంఘంపై పడింది. ఈ భారాన్ని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మెకానిక్, వడ్రంగి, వెల్డింగ్, ఎంటర్‌ప్రైజెస్, రైస్ మిల్లులు, పూల దుకాణాలు, తదితర వ్యాపార సంస్థల నుంచి పన్ను వసూలు చేయాల్సి ఉంది. ప్రతి దుకాణానికి ట్రేడ్ లైసెన్సు జారీ చేసి, ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో సంబంధిత అధికారులు అవసరమైన మేర చొరవ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నిధుల్లేక పలు అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. దుకాణాలను మొత్తం ఆన్‌లైన్ చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు నెలకొన్నాయి.
లైసెన్సులు తీసుకునేలా చర్యలు : నరేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్
మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో దుకాణదారులు ట్రేడ్ లైసెన్సులు తీసుకునేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు లైసెన్సులు తీసుకోని వారికి పాలక సభ్యుల ఆమోదం మేరకు నోటీసులు జారీ చేస్తాం. బాధ్యతగా ప్రతి వ్యాపారి కొత్త నిబంధనల ప్రకారం ట్రేడ్ లైసెన్సులు తీసుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.