logo

సంక్షేమంలో దేశానికే ఆదర్శం తెలంగాణ

రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్‌ హనుమంతరావు అన్నారు. బచ్చన్నపేట మండలం కొడవటూర్‌లో శనివారం రైతు దినోత్సవం నిర్వహించారు.

Published : 04 Jun 2023 05:36 IST

కొడవటూర్‌లో ట్రాక్టర్‌ నడుపుతున్న ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, చిత్రంలో కమిషనర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ శివలింగయ్య

బచ్చన్నపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్‌ హనుమంతరావు అన్నారు. బచ్చన్నపేట మండలం కొడవటూర్‌లో శనివారం రైతు దినోత్సవం నిర్వహించారు. స్థానిక ఉన్నతపాఠశాల నుంచి రైతు వేదిక వరకు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్‌ శివలింగయ్య, కమిషనర్‌ హనుమంతరావు పాల్గొన్నారు.  నూతనంగా నిర్మించిన రైతు వేదికను వారు ప్రారంభించారు. అంతకుముందు ఉన్నతపాఠశాల వద్ద బడిబాట కరపత్రాలను ఆవిష్కరించారు. హనుమంతరావు మాట్లాడుతూ 2014కు ముందు అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించినప్పుడు ఖాలీ బిందెలతో నిరసన తెలిపేవారని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. కలెక్టర్‌ శివలింగయ్య మాట్లాడుతూ రైతుల సమస్యలను వ్యవసాయాధికారులకు చెప్పాలన్నారు. రోహిణి కార్తెలోగా పంటల సాగు పనులు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను రైతులకు వివరించాలన్నారు. ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్మాణాత్మక ఆలోచన, పారదర్శక పాలనతో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. వ్యవసాయం పండగలా మారిందన్నారు. భూగర్భ జలాలు పెరగడంతో జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల భూమి సాగవుతోందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వినోద్‌కుమార్‌, ఉద్యానశాఖ అధికారిణి కేఆర్‌ లత, డీఐవో శ్రీనివాస్‌, ఆర్డీవో మధుమోహన్‌, తహసీల్దార్‌ వినాయలత, రైతు బంధుసమితి జిల్లా కన్వీనర్‌ ఇర్రి రమణారెడ్డి, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ పులిగిళ్లు పూర్ణచందర్‌, ఎంపీడీవో రఘురామకృష్ణ, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ చల్లా శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచి గంగం సతీష్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ అనీల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సాగు రంగానికి పెద్ద పీట

జనగామ రూరల్‌ : తెలంగాణ ఆవిర్భావం తర్వాత రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్‌ శివలింగయ్య అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని వడ్లకొండలో నిర్వహించిన రైతు దినోత్సవంలో ఉద్యానశాఖ కమిషనర్‌ హనుమంతరావు, ఎమ్మెల్యే, కలెక్టర్‌ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు బతుకమ్మలు, బోనాలు, డప్పు చప్పుళ్లతో వారికి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వివక్షతో రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వానాకాలంలో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల కళింగరాజు, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ బాల్దే సిద్దులు, రైతుబంధు జిల్లా, మండల కోఆర్డినేటర్లు రమణారెడ్డి, ప్రమోద్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు దీపిక, డీఏవో వినోద్‌కుమార్‌, ఉద్యానశాఖ జిల్లా అధికారిణి లత, సర్పంచి బొల్లం శారద, ఏఓ కరుణాకర్‌ పాల్గొన్నారు. పలు గ్రామాల్లో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించారు. చీటకోడూరులో ఎడ్లబండి ర్యాలీలో సర్పంచి కొత్త దీపక్‌రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గానుగుపహాడ్‌, చౌడారం, ఓబుల్‌కేశ్వాపూర్‌ గ్రామాల్లో రైతులు ర్యాలీ నిర్వహించారు. సర్పంచి శానబోయిన శ్రీనివాస్‌, ఎంపీటీసీ సభ్యురాలు పద్మ, ప్రత్యేకాధికారులు, ఏఈవోలు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు