logo

బడిలో చేరే రోజే పుస్తకాల పంపిణీ

 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది.

Published : 07 Jun 2023 04:29 IST

మండల కేంద్రాలకు వాహనంలో తరలిస్తున్న పుస్తకాలు

న్యూస్‌టుడే, వరంగల్‌ విద్యావిభాగం:  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు జిల్లా కేంద్రానికి ఒక లక్షా డెబ్భై వేల పుస్తకాలను పంపిణీ చేశారు  కొన్నేళ్లుగా సర్కారు బడుల్లో చదివే పిల్లలకు సకాలంలో పుస్తకాలు అందకపోవడంతో ఆ ప్రభావం బోధనపై పడేది. ఈ మస్యను అధికమించాలని నిర్ణయించి రానున్న విద్యా సంవత్సరానికి బడిలో చేరిన రోజే పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ప్రత్యేక రిజిస్టర్లలో వివరాలు

జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే పాఠ్యపుస్తకాల వివరాలను జిల్లా కేంద్రంలోని గోదాంలో ప్రత్యేక రిజిస్టర్లు ఏర్పాటు చేసి ఏ రోజు ఎన్ని పుస్తకాలు వచ్చాయో వివరాలను పొందుపరుస్తున్నారు. పుస్తకాలు భద్రపరిచే కేంద్రంలో నిత్యం నలుగురు సిబ్బంది 20 నుంచి 30 వేల పుస్తకాలను గదుల్లో భద్రపరుస్తున్నారు.

తెలుగు, ఆంగ్ల భాషల్లో..

కరోనాకు ముందు బడులు తెరిచే నాటికి పుస్తకాలు అందక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టారు. గత ఏడాది పుస్తకాల ముద్రణ ఆలస్యంగా ప్రారంభించడంతో జిల్లాకు సకాలంలో పుస్తకాలు చేరక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. గతేడాది నవంబరు వరకు పుస్తకాల సరఫరా కొనసాగింది. పదో తరగతి ఫలితాలపై ప్రభావం చూపింది. ఈసారి యంత్రాంగం ముందుగానే పంపిణీకి తగు చర్యలు చేపట్టడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులకు కాస్త ఉపశమనం లభించనుంది.

పెరుగుతున్న ఆదరణ

నిరుపేదలు చదివే సర్కారు బడుల్లో కార్పొరేట్‌కు దీటుగా మౌలిక వసతులు, డిజిటల్‌ తరగతులు, గ్రంథాలయాలు నెలకొల్పి నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుండటంతో ఆదరణ పెరుగుతోంది. ఉచిత పాఠ్య, రాత పుస్తకాలు, ఏకకూప దుస్తులు, పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా భత్యం, ఆత్మరక్షణ కోసం ప్రత్యేకంగా కరాటే తదితర కార్యక్రమాలు చేపడుతుండటంతో చాలా మంది తల్లిదండ్రులు, పిల్లలు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.

ద్విభాష.. క్యూఆర్‌ కోడ్‌

గతంలో పాఠ్య పుస్తకాలను ఒకే మాధ్యమంలో ముద్రించేవారు. ప్రస్తుతం పుస్తకంలో ఒకవైపు తెలుగు, మరో వైపు ఆంగ్లంలో ముద్రణ ఉంటుంది. తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్లంలో చదువుకోవడం పిల్లలకు సులభంగా ఉంటుంది. గత సంవత్సరం తొలిసారిగా 3 నుంచి 8 తరగతుల వరకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి వరకు అమలవుతోంది.

పక్కదారి పట్టకుండా..

ప్రభుత్వ బడుల్లో సరఫరా చేసే పుస్తకాలు పక్కదారి పట్టకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. కిందిస్థాయి సిబ్బంది ప్రైవేట్‌ మార్కెట్‌కు సరఫరా చేయకుండా ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం ప్రతి పుస్తకానికి వరుస సంఖ్య ముద్రించి క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేసింది. బహిరంగమార్కెట్లో అమ్మితే తెలిసే విధంగా ప్రభుత్వ స్టిక్కర్‌ అతికించింది. ఎవరైరా పుస్తకాలను అమ్మితే కఠినంగా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

ప్రాంరంభం రోజునే పంపిణీ..

ఎండీ.అబ్దుల్‌ హై, డీఈవో

ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థులకు బోధనలో ఇబ్బందులు రాకుండా ముందస్తుగా పాఠ్య పుస్తకాలు ముద్రించింది. జిల్లా కేంద్రానికి 67 శాతం పుస్తకాలు వచ్చాయి. వారంలోగా మిగితావి కూడా వస్తాయి. 14 మండల రిసోర్స్‌ కేంద్రాలకు వాటిని పంపిణీ చేశాం. అక్కడి నుంచి నేరుగా పాఠశాలలకు పంపిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం రోజే విద్యార్థులకు అందజేయాలని ఎంఈవోలకు సూచించాం. రాత పుస్తకాలను సైతం ప్రభుత్వం పంపిణీ చేయనుంది.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు