logo

జిల్లాలో రూ.150 కోట్ల అభివృద్ధి పనులు

సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో ఏర్పాటైన ములుగు జిల్లాలో ఈనెల 7న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటనలో భాగంగా సుమారు రూ. 150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

Updated : 07 Jun 2023 05:38 IST

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్‌

ములుగు, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో ఏర్పాటైన ములుగు జిల్లాలో ఈనెల 7న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటనలో భాగంగా సుమారు రూ. 150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మంగళవారం ములుగులోని జడ్పీ కార్యాలయంలో జడ్పీ ఛైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌, రాష్ట్ర రెడ్‌కో ఛైర్మన్‌ వై.సతీష్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సుమారు రూ. 200 కోట్ల విలువ చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించనున్నట్లు వివరించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలి పాల్గొననున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కనే రూ.65 కోట్లతో నిర్మించతలపెట్టిన కలెక్టర్‌ కార్యాలయ భవన సముదాయం, రూ.38.50 కోట్లతో జిల్లా పోలీసు కార్యాలయ భవనం, రూ.11.40 కోట్లతో మేడారంలో శాశ్వతంగా నిర్మించనున్న భవనాలు, రూ.1.20 కోట్లతో ఆదర్శ బస్టాండుకు, రూ.50 లక్షలతో నిర్మించనున్న సేవాలాల్‌ భవనానికి శంకుస్థాపన చేయనున్నారని స్పష్టం చేశారు. ఇవన్నీ ఒకే ప్రదేశంలో చేయనున్నట్లు వివరించారు. అక్కడి నుంచి నేరుగా ములుగు చేరుకొని రూ.2.50 కోట్లతో నిర్మించిన ములుగు పోలీసు స్టేషన్‌ భవనంతో పాటు జిల్లాలో మొత్తం రూ.12 కోట్లతో వివిధ ప్రాంతాలలో నిర్మించిన ఆదర్శ పోలీసుస్టేషన్ల భవనాలను ములుగు నుంచే ప్రారంభించనున్నట్లు వివరించారు. అక్కడి నుంచి రామప్ప చేరుకొని ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. అనంతరం ఇరిగేషన్‌ డేను పురస్కరించుకొని రామప్ప రిజర్వాయర్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించి గోదావరికి హారతి ఇస్తారని వివరించారు. అక్కడి నుంచి నేరుగా ములుగు పంచాయతీ వద్దకు చేరుకొని రూ.కోటితో నిర్మించిన శ్మశాన వాటిక, రూ. 2 కోట్లతో నిర్మించిన అంతర్గత సిమెంటు రోడ్లు, జిల్లా రవాణా కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. డిజిటల్‌ లైబ్రరీ, మీడియా సెంటర్‌, మరికొన్ని సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేయనున్నారని వివరించారు. అక్కడి నుంచి ములుగు సమీపంలోని సాధన పాఠశాల పక్కన ఏర్పాటు చేయనున్న అధికారిక బహిరంగ సభలో పాల్గొని సుమారు రూ. 200 కోట్ల విలువ చేసే పావలా వడ్డీ రుణాలు, ఇళ్ల స్థలాలకు పట్టాలు తదితర సంక్షేమ పథకాల అస్తులను లభ్ధిదారులకు అందించనున్నట్లు తెలిపారు. మంత్రులతో పాటు రాష్ట్ర డీజీపీ, అదనపు డీజీపీ, ఐజీ, రోడ్లు భవనాల శాఖ అధికారులు పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ పోరిక గోవిందునాయక్‌, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, జడ్పీటీసీ సభ్యులు సకినాల భవాని, గై రుద్రమదేవి, భారాస మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌, నాయకులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలిస్తున్న మంత్రి, చిత్రంలో ఎస్పీ గాష్‌ ఆలం, అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

ఏర్పాట్ల పరిశీలన

ములుగు: మంత్రి కేటీఆర్‌ పర్యటన ఏర్పాట్లను మంగళవారం మంత్రి సత్యవతి రాథోడ్‌ పరిశీలించారు. సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ ప్రదేశం, సభా వేదిక, ట్రాఫిక్‌, పార్కింగ్‌ ప్రదేశాలను సందర్శించారు. రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ గాష్‌ ఆలం, అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

వెంకటాపూర్‌: రామప్ప సరస్సు వద్ద బుధవారం నిర్వహించే సాగునీటి దినోత్సవానికి కేటీఆర్‌ రానున్న నేపథ్యంలో మంగళవారం మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎస్పీ గాష్‌ ఆలం, నీటిపారుదలశాఖ అధికారులతో వచ్చి పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. నీటిపారుదలశాఖ అధికారులు, భారాస నాయకులు తదితరులు ఉన్నారు.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని