logo

మార్కెట్‌లో గాడి తప్పిన పాలన

వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పాలన గాడి తప్పుతోంది. మార్కెట్‌లో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలపై గొంతు విప్పే వారే కరవయ్యారు.

Published : 07 Jun 2023 04:29 IST

న్యూస్‌టుడే, ఎనుమాముల మార్కెట్‌

పరిపాలన భవనం

వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పాలన గాడి తప్పుతోంది. మార్కెట్‌లో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలపై గొంతు విప్పే వారే కరవయ్యారు. రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు.. క్రయవిక్రయాల్లో వారికి ఎదురయ్యే సమస్యలు, వారి అవసరాలపై అధికారులను, వ్యాపారులను నిలదీసేందుకు ఏర్పాటైన పాలకవర్గం ఆ వైపు దృష్టి సారించడం లేదు. మరోవైపు అభివృద్ధి పనుల జాప్యంతో మార్కెట్‌ అధికారులకు తిప్పలు తప్పడంలేదు.

రైతాంగ సమస్యలపై గొంతువిప్పని పాలకవర్గం..

ఛైర్‌పర్సన్‌, వైస్‌ఛైర్మన్‌తో పాటు ఎనిమిది మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులతో ఉన్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గంలో కేవలం ఇద్దరు మాత్రమే వ్యవసాయానుభవం ఉన్నవారు. మిగిలినవారందరూ.. వ్యాపారులు, రాజకీయ నాయకులే.  పాలకవర్గం నియామకంలో పూర్తిస్థాయిలో రాజకీయ ప్రమేయం ఉండడంతో.. రైతుల సమస్యలు ఎరిగిన వారిని పాలకవర్గ సభ్యులుగా నియమించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండేళ్ల నుంచి మార్కెట్‌ అభివృద్ధి కోసం పాలకవర్గం నిర్వహించిన సమీక్ష సమావేశాల సంఖ్యను వేళ్లపై లెక్కించవచ్చు. గతేడాది జూన్‌లో మార్కెట్‌లో అభివృద్ధి పనులు, మరమ్మతులకు మార్కెటింగ్‌ శాఖ మంజూరు చేసిన రూ.2.02 కోట్లతో చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడం పాలకవర్గం పనితీరుకు అద్దంపడుతుంది. రైతులకు, వ్యాపారులకు, అధికారులకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించాల్సిన పాలకవర్గం రైతుల సమస్యలపై అధికారులను, వ్యాపారులను నిలదీసిన ఘటనలు మచ్చుకు కానరావు.  మార్కెట్‌ కమిటీకి అధికారికంగా ఆమె ఛైర్‌పర్సన్‌గా ఉన్నా.. పెత్తనమంతా ఆమె భర్తదే నడుస్తుందన్న విమర్శలున్నాయి. మార్కెట్‌కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. అభివృద్ధి పనులకు సంబంధించి గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులు.. తదితర  దస్త్రాలపై ఛైర్‌పర్సన్‌ సంతకం చేయాలన్నా.. మార్కెట్‌ అభివృద్ధికి సంబంధించి అత్యవసరమైన నిర్ణయం తీసుకోవాలన్నా.. ఆయనతో చర్చించిన తర్వాతే అని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.

పాలకవర్గం వైఫల్యానికి నిదర్శనమీ ఘటనలు..

* గతేడాది జనవరి 24న వ్యాపారులు మిర్చి ధరలను అమాంతం తగ్గించడంతో భగ్గుమన్న రైతులు ఆందోళనకు దిగారు. పరిపాలన భవనం ముందు గంటలపాటు నిరసన తెలపడంతో పాటు కాంటాలు, వాహనాలను ధ్వంసం చేశారు. రైతుల తరఫున నిలబడేందుకు, వారికి మద్ధతు ధర కల్పించేందుకు పాలకవర్గం వెనకాడింది. అప్పటి జిల్లా కలెక్టర్‌ సూచనలతో మార్కెట్‌ అధికారులే రైతులకు భరోసా కల్పించి.. వ్యాపారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషిచేశారు.

* ఈ ఏడాది మార్చిలో అంతర్రాష్ట్ర మార్కెట్‌ల పరిశీలన కోసం నాగ్‌పూర్‌, నిజామాబాద్‌ మార్కెట్‌లను పాలకవర్గ సభ్యులు సందర్శించారు. ఖర్చుల నిమిత్తం మార్కెట్‌ కమిటీ రూ.లక్ష సమకూర్చింది. రెండు నెలలు గడిచినా.. ఆ మార్కెట్‌లలో పరిశీలించిన అంశాలు, ఇక్కడ మార్కెట్‌లో అనుసరించాల్సిన, అమలుచేయాల్సిన విధివిధానాలపై పాలకవర్గం ఇప్పటివరకు సమీక్షలు నిర్వహించిన దాఖలాలులేవు.

* ఈ ఏడాది మార్చి 23న ఎనుమాముల మార్కెట్‌లో అకస్మాత్తుగా అకాల వర్షం కురవడంతో.. సుమారు 10వేలకు పైగా బస్తాలు వర్షపునీటిలో తడిసిపోయాయి. అదే అదనుగా బస్తాకు 4 కిలోల చొప్పున తరుగు తీస్తామని వ్యాపారులు ప్రకటించడంతో.. రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు ఒప్పుకోకపోవడంతో.. వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశారు. రైతులకు న్యాయం చేసేందుకు.. తడిసిన బస్తాలకు గిట్టుబాటు ధర కల్పనకు మార్కెట్‌ పాలకవర్గం వ్యాపారులతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. రైతులు తడిసిన పంట ఉత్పత్తులను తరుగు తీయకుండా కొనుగోలుచేయాలని డిమాండ్‌చేస్తూ.. మార్కెట్‌ ముందు ప్రధాన రహదారిపై సుమారు 4 గంటల పాటు బైఠాయించారు.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని