logo

చెరువుల పండగకు వేళాయే..

చెరువుల ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకం ద్వారా వాటికి మరమ్మతులు చేపటి పటిష్ఠం చేసింది.

Published : 08 Jun 2023 04:26 IST

విద్యుత్తు కాంతుల్లో భద్రకాళి బండ్‌

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌ : చెరువుల ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకం ద్వారా వాటికి మరమ్మతులు చేపటి పటిష్ఠం చేసింది. వివిధ పథకాల ద్వారా అభివృద్ధి, సుందరీకరణకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చెరువుల పండగ నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గ్రేటర్‌ పరిధిలోని చెరువులు, కుంటల వద్ద గురువారం ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లా పరిధిలో భద్రకాళి బండ్‌, వరంగల్‌ జిల్లాలో ఉర్సు చెరువు, ఖిలావరంగల్‌ గుండు చెరువు వద్ద మహిళలతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఇదీ అభివృద్ధి..: గ్రేటర్‌ పరిధిలో పలు చెరువులు, కుంటలను ప్రభుత్వం అభివృద్ధి పరుస్తోంది. హృదయ్‌, స్మార్ట్‌సిటీ, సీఎం హామీల నిధులతో సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. నగర ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ప్రత్యేక పనులు చేపడుతున్నారు. ఇప్పటికే భద్రకాళి బండ్‌ పర్యాటక కేంద్రంగా మారింది. దీనికి తోడు  హనుమకొండ పెద్ద వడ్డేపల్లి చెరువు పనులు శర వేగంగా సాగుతున్నాయి. కాజీపేట బంధం చెరువు, ఉర్సు రంగసముద్రం (ఉర్సు చెరువు) అభివృద్ధికి శంకుస్థాపనలు చేశారు.

గ్రేటర్‌ పరిధిలో 282..:

* వరంగల్‌ నూతన బృహత్‌ ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌)లో చెరువులు, కుంటల వివరాలు పొందు పరిచారు. అధికారిక లెక్కల ప్రకారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలో 1009, గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో 282 చెరువులు, కుంటలు ఉన్నాయని గుర్తించారు. రెవెన్యూ, భూమి, కొలతల శాఖ, సాగునీటి పారుదల శాఖ వద్ద వీటికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంది.

* మిషన్‌ కాకతీయ పథకం ద్వారా జిల్లాలో 50 నుంచి 60 శాతం చెరువులు, కుంటలను పునరుద్ధరించారు.

* వరంగల్‌-హనుమకొండ నగరాల మధ్య వారధిగా ఉన్న భద్రకాళి చెరువును హృదయ్‌, స్మార్ట్‌సిటీ పథకం ద్వారా సుమారు రూ.22.50 కోట్లతో మినీ ట్యాంక్‌ బండ్‌గా అభివృద్ధి పరిచారు. మరో రూ.62 కోట్లతో రెండో విడత పనులు జరుగుతున్నాయి. వరంగల్‌ పోతన రోడ్డులో 150 అడుగుల జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

* భద్రకాళి ఆలయం నుంచి కాపువాడ మత్తడి వరకు మినీ బండ్‌ను అభివృద్ధి పరిచారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఆహ్లాదం పంచేలా పనులు చేపట్టారు.

* హనుమకొండ పెద్ద వడ్డేపల్లి చెరువును ట్యాంక్‌ బండ్‌గా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయి.

*కాజీపేట బంధం చెరువు సుందరీకరణకు నిర్ణయించి, పనులకు శంకుస్థాపన చేశారు. 

* ఉర్సు రంగసముద్రం సుందరీకరణకు ప్రణాళిక సిద్ధమైంది. ఉర్సుగుట్ట, రంగలీల మైదానాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు నిధులు విడుదలయ్యాయి.

వీటిపై దృష్టి పెట్టాలి

వరంగల్‌ జిల్లా పరిధిలోని ఖిలావరంగల్‌ గుండు చెరువు, రంగశాయిపేట బెస్తం చెరువు, మామునూరు, గొర్రెకుంట కట్ట మల్లన్న, దేశాయిపేట చిన్న వడ్డేపల్లి చెరువు, ములుగు రోడ్డు కోట చెరువులు అభివృద్ధి పరచాలి. ఆక్రమణలు తొలగించి, ఎఫ్‌టీఎల్‌ నిబంధనలు అమలయ్యేలా చూడాలి. గుర్రపుడెక్కను పూర్తిగా తొలగించి, నీటి నిల్వ సార్థ్యం పెంచాలి.
* హనుమకొండ జిల్లా పరిధిలో హసన్‌పర్తి పెద్ద చెరువు, మడికొండ, కడిపికొండ, న్యూశాయంపేట కోటి చెరువు, భట్టుపల్లి చెరువులు అభివృద్ధి చేయాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని