logo

అభివృద్ధి.. ఆధ్యాత్మికం

ములుగు జిల్లాలో బుధవారం మంత్రి కేటీఆర్‌ పర్యటన అభివృద్ధి, ఆధ్యాత్మిక  కార్యక్రమాలతో సాగింది.

Published : 08 Jun 2023 04:52 IST

సందడిగా సాగిన మంత్రి కేటీఆర్‌ పర్యటన

ఈనాడు, వరంగల్‌, ఈనాడు డిజిటల్‌,జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వెంకటాపూర్‌, ములుగు రూరల్‌, న్యూస్‌టుడే: ములుగు జిల్లాలో బుధవారం మంత్రి కేటీఆర్‌ పర్యటన అభివృద్ధి, ఆధ్యాత్మిక  కార్యక్రమాలతో సాగింది. ములుగు జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం ఉండటంతో హోం మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ అంజనీకుమార్‌ సైతం పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు,  సత్యవతి రాథోడ్‌ హాజరయ్యారు. ములుగులో మూడు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సాధన డిగ్రీ కళాశాల మైదానంలో లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ఇతర యూనిట్లను పంపిణీ చేశారు. అక్కడే సభ జరిగింది. ఇది అధికారిక సభే అయినా కేటీఆర్‌తో పాటు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేయడంతో రాజకీయ సభ తరహాలో కొనసాగింది.

కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు..

ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీతక్క ఉండడంతో వచ్చేసారి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కేటీఆర్‌ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ములుగులో జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్‌ చలువ వల్లే సాధ్యమైందని అన్నారు. ఒకప్పుడు మండల కేంద్రంగా ఉన్న ములుగును జిల్లా కేంద్రంగా తిర్చిదిద్ది, మున్సిపాలిటీగా ప్రకటించింది తమ ప్రభుత్వమేనని వివరించారు.

కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం

రాష్ట్రంలో హెల్త్‌ ప్రొఫైల్‌ను తొలుత తాను సిరిసిల్లలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడగ్గా, దాంతోపాటు మారుమూల ప్రాంతమైన ములుగులో కూడా ప్రారంభించాలని సూచించారని అన్నారు. ఆయనకు ములుగంటే ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు.

ములుగు పోలీస్‌ స్టేషన్‌లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ను సీట్లో కూర్చోబెట్టి అభినందిస్తున్నమంత్రులు  

ఎవరేమన్నారంటే..

* కేసీఆర్‌ 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారు. ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రానికి అనేక పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వచ్చాయి.          

రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ


* మేడారం జాతరను రాష్ట్ర పండగ చేసి నిధులు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్‌. వైద్య వసతులన్నీ ములుగులోనే అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా 32 వేల మెజారిటీతో గెలిపించే బాధ్యత మాది. 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


* కాంగ్రెస్‌ హయాంలో ఐటీడీఏలు నిర్వీర్యమయ్యాయి. ఇప్పుడు గిరిజనులకు ఇది స్వర్ణయుగం.   ఈ రోజు రూ. 1.25 కోట్లతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. సుమారు రూ. 150 కోట్లతో వివిధ సంక్షేమ పథకాలను అందిస్తున్నాం.

మంత్రి సత్యవతి రాథోడ్‌



* ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఎక్కడ కాలుపెడితే అక్కడ అభివృద్ధి జరుగుతుంది అనేది నేటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉదాహరణ. ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాల ఇవ్వడం కేసీఆర్‌ ఘనత కాదా.

ఎంపీ మాలోతు కవిత


* ముఖ్యమంత్రి కేసీఆర్‌ ములుగు జిల్లా ఇస్తానని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయినా జిల్లా ఇచ్చారు. త్వరలోనే మల్లంపల్లిని మండలంగా చేసుకోబోతున్నాం.

జడ్పీ ఛైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌


తొలిసారి రామప్ప ఆలయ సందర్శన

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని తొలిసారి కేటీఆర్‌ సందర్శించారు. శిల్ప సౌందర్యంతో ఉట్టిపడే ఈ ఆలయాన్ని మొత్తం కేటీఆర్‌ ఆసక్తిగా తిలకించి విశేషాలు తెలుసుకున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో సైతం పాల్గొన్నారు. రామప్ప చెరువు వద్దకు వెళ్లి జలదినోత్సవం సందర్భంగా గంగకు ప్రత్యేక పూజలు చేసి పూలు చల్లి, తెలంగాణ రాష్ట్రంలో జలదృశ్యం సాకారమైన తీరును గుర్తు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని