logo

లక్ష్యం నెరవేరని తునికాకు సేకరణ

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది అతి తక్కువగా 43 శాతం తునికాకు సేకరణ జరిగింది. మహదేవపూర్‌ అటవీ డివిజన్‌లో 42.78 శాతం, భూపాలపల్లి డివిజన్‌లో 43.02 శాతం వరకే తునికాకు సేకరణ చేపట్టారు.

Published : 08 Jun 2023 04:52 IST

కల్లంలో తునికాకు బస్తాలు

భూపాలపల్లి, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది అతి తక్కువగా 43 శాతం తునికాకు సేకరణ జరిగింది. మహదేవపూర్‌ అటవీ డివిజన్‌లో 42.78 శాతం, భూపాలపల్లి డివిజన్‌లో 43.02 శాతం వరకే తునికాకు సేకరణ చేపట్టారు. అటవీశాఖ అధికారులు నిర్ణయించిన లక్ష్యం మేరకు సేకరణ జరగకపోవడంతో కూలీలకు అనుకున్నంత ఆదాయం రాలేదు. కొన్ని యూనిట్లలో మే 1 నుంచి తునికాకు సేకరణ ప్రారంభించగా, మరికొన్ని యూనిట్లలో మే 5, 6 తేదీల్లో సేకరణ మొదలుపెట్టగా గత నెల 31న ముగిసింది.

ముందస్తుగా టెండర్లు నిర్వహించినా..

సేకరణ ప్రారంభమైన పది రోజుల్లోనే దాదాపు 40-50 శాతం తునికాకు కట్టలు కల్లాల వద్దకు చేర్చేవారు. ఈ ఏడాది ఆకు సేకరణ ముగిసినా.. ప్రభుత్వం ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేదు. లక్ష్యాన్ని అందుకోకపోవడంతో కూలీలు సేకరించిన తునికాకును ఇళ్ల వద్దనే ఆరబెడితే ఆ కట్టలను సంబంధిత గుత్తేదారులు కొనుగోలు చేసుకునే అవకాశాన్ని అటవీశాఖ అధికారులు కల్పించారు. ఈ సీజన్‌లో వందశాతం సేకరణ చేపట్టాలనే లక్ష్యంతో అటవీశాఖ ముందస్తుగా తునికాకు టెండర్లను పూర్తి చేసినా.. ఆశించిన ఫలితాలు రాలేదు. అడవుల్లో తునికాకు ఎక్కువగా లేకపోవటం, అటవీ గ్రామాల్లో ఉపాధి పనుల కారణంగానే ఆకు సేకరణ తగ్గిందని భావిస్తున్నారు.

* జిల్లా వ్యాప్తంగా రెండు అటవీ డివిజన్లలో మొత్తం 10 యూనిట్లలో ప్రభుత్వం 12,100 స్టాండర్డ్‌ బ్యాగులు(ఎస్‌బీ) లక్ష్యం నిర్దేశించగా, కేవలం 5,577 ఎస్‌బీలు సేకరించడంతో 43 శాతం నమోదైంది. డివిజన్ల వారీగా తునికాకు సేకరణ వివరాలు పరిశీలిస్తే.. భూపాలపల్లి అటవీ డివిజన్‌లో మొత్తం 19 యూనిట్లు ఉండగా ఇందులో కేవలం నాలుగు యూనిట్లే అమ్ముడుపోయాయి. ఈ నాలుగు యూనిట్లలో 4,500 ఎస్‌బీల లక్ష్యం నిర్ణయించారు. ఈ డివిజన్‌లో 1,935 ఎస్‌బీలు సేకరించారు. మహదేవపూర్‌ డివిజన్‌లో 16 యూనిట్లు ఉండగా ఆరు యూనిట్లు అమ్ముడుపోగా, 7,600 ఎస్‌బీల లక్ష్యానికి గాను 3,642 ఎస్‌బీలు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎండిన తునికాకు బస్తాలు 1,580 వరకు తునికాకు కల్లాల నుంచి గుత్తేదారులు గోదాంలకు తరలించారు. ప్రభుత్వం ఒక ఎస్‌బీ సేకరణకు రూ.3వేలు చెల్లిస్తోంది. ఈ లెక్కన కూలీలకు దాదాపుగా రూ.1.37 కోట్ల వరకు ఆదాయం లభించనుంది.


గుత్తేదారులు ముందుకు రాలేదు
- లావణ్య, డీఎఫ్‌వో, భూపాలపల్లి

అటవీ ప్రాంతంలో నాణ్యత గల ఆకు లేకపోవడంతో ఆశించిన మేరకు తునికాకు సేకరణ జరగలేదు. ఈసారి ఆన్‌లైన్‌లో టెండర్లు నిర్వహించటంతో గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో చాలా వరకు తునికాకు యూనిట్లు అమ్ముడు పోలేదు. లక్ష్యానికి మించి చేపట్టిన యూనిట్లలో తునికాకు కూలీలకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని