logo

ఆర్థిక స్వావలంబన..మహిళలకు ఉపాధి కల్పన

నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. గృహిణిగా బాధ్యతు నిర్వర్తిస్తూనే పలు వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలను సమర్థంగా నిర్వహిస్తున్నారు.

Published : 08 Jun 2023 04:52 IST

ఏకరూప దుస్తులు కుట్టే పనిలో మగువలు..

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. గృహిణిగా బాధ్యతు నిర్వర్తిస్తూనే పలు వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతూ విజయాల బాటలో పయనిస్తున్నారు. చిన్న తరహా, కుటీర పరిశ్రమల వంటివి స్థాపించి తాము స్వయం ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకూ ఉపాధి కల్పిస్తున్నారు. తమకు ఆసక్తి ఉన్న రంగంలో ఉపాధి అవకాశాలను వెతుక్కొని స్థిర పడుతున్నారు. ఈ కోవకు చెందిన వారే జనగామ మండలం యశ్వంతాపూర్‌కు చెందిన తిరుమల్‌రెడ్డి జెసింతామేరి. ఈమె చిన్నపాటి టైలర్‌. మహిళలకు సంబంధించిన జాకెట్లు, పంజాబీ డ్రెస్‌లు, ఇతర దుస్తులు కుడుతుంటారు. దుస్తులు కుట్టే పనినే వ్యాపారంగా మలుచుకొని ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. తాను స్థిరపడటమే కాకుండా మరికొందరు మహిళలకు ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

పాఠశాలలకు ఏకరూప దుస్తుల విక్రయం

జెసింతామేరి జనగామ జిల్లాలోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి ఆర్డర్లు తీసుకొని విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టి విక్రయిస్తారు. ఆయా పాఠశాలల నుంచి ఆర్డర్‌ తీసుకున్న తర్వాత వారు సూచించిన రంగులు, నాణ్యత కలిగిన వస్త్రాలు,  బ్యాడ్జిలను హైదరాబాద్‌లో హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తారు. యశ్వంతాపూర్‌లోని తన ఇంటిలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుట్టు పని కేంద్రంలో ఏకరూప దుస్తులను కుడుతున్నారు. ఇందుకోసం జెసింతామేరి 15 మంది కుట్టు పనులు వచ్చిన మహిళలను పనికి కుదుర్చుకున్నారు. వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. ఏడాదికి రూ.24 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆదాయాన్ని ఏకరూప దుస్తుల విక్రయాల ద్వారా పొందుతున్నారు. ఇందులో కూలీల వేతనాలకు రూ.18 లక్షలు పోగా జేసింతామేరి రూ.7 లక్షల వరకు సంపాదిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో మార్కెటింగ్‌

జెసింతామేరి తాను పాఠశాలలకు సరఫరా చేసే ఏకరూప దుస్తుల వ్యాపారం గురించి తన మిత్రులు, బంధువుల వాట్సప్‌ గ్రూపులు, ఆన్‌లైన్‌ ద్వారా ప్రచారం చేస్తుండటంతో వ్యాపారం అనతికాలంలోనే వృద్ధి చెందింది. గత పదేళ్లుగా ఏకరూప దుస్తుల వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడుకు చెందిన పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఆర్డర్లు జెసింతామేరికి రావడం విశేషం. నాణ్యమైన వస్త్రాలనే తీసుకోవడం, కుట్టు పనిలో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పదేళ్లుగా జెసింతామేరి నిర్వహిస్తున్న వ్యాపారానికి ఆదరణ లభిస్తోంది. చిన్నపాటి దర్జీగా జీవితాన్ని ప్రారంభించిన జెసింతామేరి.. తాను ఆర్థికాభివృద్ధి సాధించడమే కాకుండా మరి కొందరు మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.


ప్రభుత్వం ప్రోత్సాహమందించాలి

-తిరుమల్‌రెడ్డి జెసింతామేరి

మాది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. కుట్టుపనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నా. పాఠశాలలకు చెందిన కొందరు.. తమ పిల్లలకు ఏకరూప దుస్తులు కుట్టమని ఇచ్చినప్పుడు నాలో కొత్త ఆలోచన వచ్చింది. పాఠశాలలకు ఏకరూప దుస్తులను మనమే తయారు చేసి విక్రయిస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. నా భర్త రవీందర్‌రెడ్డి సహకారంతో గ్రామంలోనే పది మంది కుట్టు శిక్షణ పొందిన 15 మంది మహిళలతో కలిసి ఏకరూప దుస్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించాం. పదేళ్లుగా వ్యాపారం బాగానే ఉంది. ప్రభుత్వం మాలాంటి మహిళలకు పరిశ్రమల శాఖ నుంచి రుణ సదుపాయం కల్పిస్తే మరింతగా మా వ్యాపారాన్ని విస్తరించే  వీలుంటుంది. ప్రభుత్వం మాలాంటి వాళ్లకు సహకరించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని