logo

మధ్యాహ్న భోజనం.. కొత్త విధానానికి శ్రీకారం

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు జరగనున్నాయి. పాఠశాలల్లో వంటలు చేస్తున్న ఏజెన్సీలకు ఇస్తున్న వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచిన ప్రభుత్వం మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది.

Published : 09 Jun 2023 03:48 IST

న్యూస్‌టుడే, దేవరుప్పుల, భూపాలపల్లి

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు జరగనున్నాయి. పాఠశాలల్లో వంటలు చేస్తున్న ఏజెన్సీలకు ఇస్తున్న వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచిన ప్రభుత్వం మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది.

ఇకపై ఇలా..  

పాఠశాలల్లో భోజనం వండి వడ్డించే ఏజెన్సీ మహిళలకు ప్రతి నెలా విద్యార్థుల సంఖ్య ఆధారంగా పౌరసరఫరాలశాఖ నుంచి సన్న బియ్యాన్ని తూకం వేసి అందించేవారు. సరకులు, కూరగాయలను మాత్రం ఏజెన్సీ మహిళలే దుకాణాల్లో కొనుగోలు చేసి వంటలు చేసేవారు.  కస్తూర్బా విద్యాలయాలు, గురుకుల పాఠశాలల తరహాలో దినుసుల సరఫరాకు టెండర్లు పిలిచి, గుత్తేదారుల ద్వారా పాఠశాలలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  జిల్లా స్థాయిలో గుత్తేదారులను గుర్తించి వారి ద్వారా కూరగాయలు, దినుసులు, కోడి గుడ్లు తదితరాలను సరఫరా చేయనుంది.  విద్యార్థులకు అందించే భోజనం మెనూలో పలు మార్పులు చేసింది. వారంలో ఏ రోజు ఏ వంట చేయాలో నిర్దేశించింది. ఈ వివరాలను పాఠశాల గోడలపై రాసి ప్రదర్శించాలని, మెనూలో తేడాలు లేకుండా చూడాలని ఆదేశించింది. విద్యార్థులకు నిర్దేశిత పరిమాణంలో ఆహారపదార్థాలు అందించాలని సూచించింది.

సాధ్యమయ్యేనా..

కేజీబీవీలు, గురుకులాల్లో 200 మందికిపైగా విద్యార్థులుంటారు. వీరికి సరకులను సరఫరా చేసే గుత్తేదారుకు కొంత ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. చాలా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 10, 20కి మించి లేదు. గుత్తేదారులు వీరికి సరకులు సరఫరా చేయడం అనుకున్నంత సులభం కాదని అంటున్నారు. చాలా పాఠశాలలు  దూరంగా విసిరేసినట్లున్నాయి. పప్పులు, నూనె, కూరగాయల రక్షణ బాధ్యతను ఎవరు తీసుకుంటారన్నది ప్రశ్న. వీటిని ఏజెన్సీ మహిళలే కొనుగోలు చేస్తే రక్షణ బాధ్యతను వారే చూసుకునేవారు. గుత్తేదారు తెచ్చిన కూరగాయల రక్షణపై  ఏజెన్సీ మహిళలు అంతగా ఆసక్తి చూపరని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని