logo

బడుల ప్రారంభం రోజే.. పాఠ్యపుస్తకాల పంపిణీ!

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్య పుస్తకాలు అందజేసేందుకు విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

Published : 09 Jun 2023 04:05 IST

జిల్లా గోదాంలో నిల్వ చేసిన పాఠ్యపుస్తకాలు

భూపాలపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్య పుస్తకాలు అందజేసేందుకు విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలకు సకాలంలో పుస్తకాలు అందకపోవడంతో వాటి ప్రభావం ఉత్తీర్ణత శాతంపై పడేది. ఈ సమస్యను అధిగమించేందుకు విద్యాశాఖ అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన గోదాంలో నిల్వ చేసిన పుస్తకాలను జిల్లాలోని మొత్తం 11 మండలాలకు సరఫరా చేసేందుకు విద్యాశాఖ అధికారులు టెండర్లు నిర్వహించి వాహనాల్లో సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 70 వేల పుస్తకాలు పలు మండలాలకు చేరవేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 27,340 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

85 శాతం...

జిల్లాలో విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు పరిగణలోకి తీసుకుంటే ఇప్పటివరకు 85 శాతం మాత్రమే వచ్చాయి. ఇంకా 15 శాతం రావాల్సి ఉంది. వాస్తవానికి 1,74,815 పుస్తకాలు అవసరం ఉండగా 1,48,295 పుస్తకాలు జిల్లా గోదాంకు చేరాయి. మిగతా 26,520 పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు. గత విద్యా సంవత్సరం నవంబరు నెలాఖరు వరకు సరఫరా కొనసాగింది. పుస్తకాల విషయంలో ఈ విద్యా సంవత్సరం అధికారులు చాలా వరకు విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తున్నారు.

ద్విభాషా మాధ్యమంలో

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే పుస్తకాల్లో ఓ వైపు తెలుగు, మరో వైపు ఆంగ్లంలో ముద్రణ ఉంటుంది. తెలుగు మాధ్యమం నుంచి, ఆంగ్లంలో సులువుగా అర్థమవుతోందన్న ఉద్దేశంతో ఇలా ముద్రించారు. గతేడాది తొలిసారిగా 3 నుంచి 8వ తరగతి వరకు ముద్రించారు. ఈ సారి తొమ్మిదో తరగతి వరకు అమలవుతోంది. దీనికి ‘క్యూఆర్‌ కోడ్‌’ ఉంటుంది. ఈ సారి పుస్తకాల వరస సంఖ్యను ముద్రించారు. అవి పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టారు. బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తే సులువుగా గుర్తించేలా ప్రభుత్వ స్టిక్కర్‌ ఉంటుంది. డీఈవో రాంకుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల ప్రారంభం రోజునే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. జిల్లా కేంద్రంలోని గోదాంలో నిల్వచేసిన పుస్తకాలను ఇప్పటికే చాలావరకు ఆయా మండలాలకు తరలించాం. ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు అందజేస్తామని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని