logo

ప్రకృతి వనం.. నిర్వహణ ఘనం!

మహిళా సర్పంచులు గ్రామాభివృద్ధిలో తమదైన ముద్ర వేస్తున్నారు.. సర్పంచిగా గెలుపొంది, తమ బాధ్యత తీరిందనుకోకుండా గ్రామ ప్రగతిలో భాగస్వాములవుతున్నారు.

Updated : 09 Jun 2023 05:28 IST

న్యూస్‌టుడే, టేకుమట్ల (భూపాలపల్లి జిల్లా)

మహిళా సర్పంచులు గ్రామాభివృద్ధిలో తమదైన ముద్ర వేస్తున్నారు.. సర్పంచిగా గెలుపొంది, తమ బాధ్యత తీరిందనుకోకుండా గ్రామ ప్రగతిలో భాగస్వాములవుతున్నారు. సిబ్బంది కొరత, అరకొర నిధులున్న పంచాయతీల్లోనూ గ్రామాల్లో పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. గాడి   తప్పిన పల్లెప్రకృతి వనాలను ప్రత్యేక చొరవతో నిర్వహణ చేపడుతున్నారు. మండు టెండల్లో సంరక్షిస్తున్నారు. ఇలా పలువురు మహిళా సర్పంచుల ప్రత్యేక చర్యలతో ఆదర్శంగా నిలుస్తున్న ప్రకృతి వనాలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనమిది.

ల్లెల్లో పచ్చదనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రతి పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూముల్లో మొక్కలు నాటి పెంచేలా చర్యలు చేపడుతోంది. గతంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆయా ప్రకృతి వనాల నిర్వహణ, పర్యవేక్షణ పనులు చేపట్టేవారు. 2022 మార్చి 31 నుంచి నూతన నిబంధనలు అమల్లోకి రావడంతో గ్రామ పంచాయతీల నిర్వహణ బాధ్యతను అప్పగించారు. ప్రస్తుతం పల్లె ప్రకృతి వనాల్లో ప్రారంభంలో నాటిన మొక్కలు పెరిగి పెద్దవయ్యాయి. మండుటెండల్లో మొక్కలు మాడిపోకుండా పలువురు మహిళా సర్పంచులు నిర్వహణ చేపడుతున్నారు. మొక్కలకు ఎరువులు వేస్తూ.. పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు ప్రతి రోజూ నీటిని పట్టేలా సిబ్బందిని నియమించి కొంత ఖర్చు చేస్తున్నారు. తద్వారా మరింత పచ్చదనంతో, ఆహ్లాదభరితంగా మారి గ్రామస్థులను ఆకర్షిస్తున్నాయి.


తుంపర విధానంలో నీటిని అందిస్తూ..

తుంపర విధానంలో నీటిని తడుపుతున్న ఈ పల్లె ప్రకృతి వనం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పంగిడిపల్లిలోనిది.. గ్రామ సర్పంచి ప్రియాంక మహాజన్‌ వేసవిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి వనంలో అరుదైన మొక్కలు నాటారు. నిర్వహణ కోసం ఓ వ్యక్తికి రూ.6 వేలు ఇస్తూ నియమించారు. ప్రతి రోజూ నీటిని పట్టిస్తూ, నెల నెలా మొక్కల పెంపకానికి ఎరువులను చల్లిస్తున్నట్లు ఆమె చెప్పారు. వనంలోని కలుపు మొక్కలను తొలగించేందుకు రూ.12 వేలతో గ్రాస్‌ కటింగ్‌ యంత్రాన్ని కొనుగోలు చేసి నెలకోసారి పంచాయతీ సిబ్బందితో కలుపును తొలగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.


సేంద్రియ ఎరువులను చల్లిస్తూ..

మొక్కలకు ఎరువును చల్లుతున్న ఈ దృశ్యం చిట్యాల మండలం నవాబుపేట పల్లె ప్రకృతి వనంలోనిది. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా ప్రతి రోజూ పంచాయతీ సిబ్బందితో నీటిని పట్టిస్తూ.. గ్రామంలో తయారు చేసిన సేంద్రియ ఎరువులతో పాటు అప్పుడప్పుడూ డీఏపీ చల్లిస్తున్నట్లు సర్పంచి కసిరెడ్డి సాయిసుధ తెలిపారు. ప్రతి నెలా రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు పల్లె ప్రకృతి వనం నిర్వహణకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల ఏపుగా పెరిగిన గడ్డిని యంత్రాలతో కటింగ్‌ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఉపాధి కూలీలతో పిచ్చి మొక్కలను తొలగిస్తున్నట్లు చెప్పారు.


గ్రామస్థులను ఆకర్షిస్తూ..

ఈ పల్లె ప్రకృతి వనం మహాముత్తారం మండలం పెగడపల్లిలోనిది. పెగడపల్లి, గ్రామ శివారు ఆంజనేయపల్లికి కలిపి పెగడపల్లిలో రెండెకరాల విస్తీర్ణంలో ప్రకృతివనాన్ని ఏర్పాటు చేశారు. రాజమండ్రి నుంచి ప్రత్యేక మొక్కలను తెప్పించారు. మొక్కల సంరక్షణకు భూగర్భ పైపులైను వేసి అక్కడికక్కడే చెట్లకు నీరందేలా పనులు చేపట్టారు. మొక్కలకు ఎరువులుగా స్థానికంగా లభించే మేకల ఎరువును తెప్పించి చల్లడం, మొక్కలపై పురుగు మందు పిచికారీ, నెలకోసారి దాదాపు 25 మంది కూలీలతో కలుపు తీయడం వంటివి చేస్తున్నట్లు సర్పంచి కొర్ర వినోద చెప్పారు. సేద తీరేందుకు దాతల సహాయంగా వనంలో బెంచీలను ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉండడంతో గ్రామస్థులందరినీ ఆకర్షిస్తోంది. కూలీలకు పారిశుద్ధ్యం నిధుల నుంచి రూ.6 వేలు, మరో రూ.2 వేలు నిర్వహణకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని