అన్నను హత్య చేసిన తమ్ముళ్లు..!
బీమా డబ్బులను పంచుకునే విషయంలో తోడబుట్టిన తమ్ముళ్లే అన్నను హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
బీమా డబ్బులు పంచుకునే విషయంలో గొడవ
మహ్మద్ సాధిక్ (పాత చిత్రం)
కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: బీమా డబ్బులను పంచుకునే విషయంలో తోడబుట్టిన తమ్ముళ్లే అన్నను హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కామారెడ్డి పట్టణ సీఐ నరేష్ కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లాకేంద్రంలోని ఇస్లాంపురా బతుకమ్మ కుంట కాలనీలో నివాసం ఉండే ఫాతిమాబీ-నన్ను దంపతులకు నలుగురు కుమారులు, కూతురు జహేరాబేగం సంతానం. దివ్యాంగుడైన పెద్ద కుమారుడు మహ్మద్ సాధిక్(41) తన భార్య తస్లీమ్‌తో జనగామ పట్టణంలోని ధర్మకంచ ప్రాంతానికి వలస వెళ్లాడు. తల్లిదండ్రులతో ముగ్గురు కుమారులు సలీం ఘోరీ, ఖాజా, అమ్జద్ కామారెడ్డిలోనే నివాసముంటున్నారు. ఏడాది కిందట ఖాజా రహదారి ప్రమాదంలో మరణించారు. అతడిపై ఉన్న బీమా డబ్బులు రూ.5 లక్షలు వచ్చాయి. ఈ డబ్బులో సగాన్ని మృతుడి భార్యకు అందించగా మిగిలిన రూ.2.50 లక్షలను తల్లి ఫాతిమాబీకు అందించారు.
రోదిస్తున్న మృతుడు సాధిక్ భార్య తస్లీమ్, వెనకాల కూతురు
సమానంగా ఇచ్చినా..
తనకు అందిన డబ్బుల్లోంచి ఫాతిమాబీ బుధవారం ఉదయం ఖాజా కుటుంబంతో పాటు ముగ్గురు కుమారులు, కూతురికి రూ.10 వేల చొప్పున ఇచ్చింది. ఈ క్రమంలో తమ్ముళ్లు సలీం ఘోరీ, అమ్జద్ అన్న సాధిక్‌తో గొడవకు దిగారు. అనంతరం ముగ్గురు కలిసి మద్యం తాగేందుకు బయటకు వెళ్లారు. అర్ధరాత్రి సలీం ఘోరీ, అమ్జద్ మాత్రమే ఇంటికి చేరుకున్నారు. అనుమానం వచ్చిన తల్లి ఫాతిమా అన్న రాలేందేంటని అడగగా.. జనగామ వెళ్లాడని చెప్పారు. గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తిని పాత బస్టాండ్ ప్రాంతంలో ఎవరో హత్య చేశారని సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఆధార్‌కార్డుల ఆధారంగా మృతుడు మహ్మద్ సాధిక్‌గా గుర్తించారు. అక్కడ లభించిన ఫోన్ నంబర్ల ఆధారంగా సాధిక్ చెల్లెలు జహేరాబేగంకు సమాచారమిచ్చారు. డాగ్ స్క్వాడ్ ఆధారంగా సాధిక్‌ను హత్య చేసింది అమ్జద్‌గా గుర్తించారు. సలీం ఘోరీ కూడా సాధిక్ హత్యలో పాలుపంచుకున్నాడంటూ పోలీసులు తేల్చారు. సాధిక్ వద్ద ఉన్న రూ.10 వేల బీమా డబ్బులతో పాటు తల్లి ఫాతిమా వద్ద రూ.2 లక్షలను కూడా తామే సొంతం చేసుకోవచ్చనే దురుద్దేశంతోనే అన్న హత్యకు సోదరులు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా సాధిక్ హత్యలో భాగమైన ఇద్దరు గురువారం రాత్రి వరకు మద్యం మైకంలోనే ఉండడంతో పోలీసులకు పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నారని తెలుస్తోంది. సాధిక్-తస్లీమ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా వారికి వివాహమైంది. జహేరాబేగం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.