logo

ప్రజల వద్దకు పరుగులు

ఇన్నాళ్లు ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ యంత్రాంగం ఇప్పుడు ప్రజల వద్దకు పరుగులు పెడుతోంది. కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

Updated : 09 Jun 2023 05:24 IST

హనుమకొండ ఎక్సైజ్‌ కాలనీలో ఆస్తి పేరు మార్పిడి పెండింగ్‌ అర్జీపై అధికారులతో

మాట్లాడుతున్న కమిషనర్‌ రిజ్వాన్‌ బాషా

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌ : ఇన్నాళ్లు ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ యంత్రాంగం ఇప్పుడు ప్రజల వద్దకు పరుగులు పెడుతోంది. కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పెండింగ్‌ సమస్యలపై సిబ్బందిని నిలదీస్తుండటంతో వారికి ముచ్చెమటలు పడుతున్నాయి. ప్రజావాణిలో వచ్చే అర్జీలు, ఫిర్యాదులకు జవాబుదారీ తనం ఉండాలని కమిషనర్‌ ఆదేశించడంతో అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల్లో కదలిక వచ్చింది. గతంలో గ్రీవెన్‌సెల్‌లో ఇచ్చిన వినతులు బుట్టదాఖలయ్యాయి. నాలుగైదు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కు ఉండేది కాదు. కమిషనర్‌ రిజ్వాన్‌ బాషా వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చింది. అధికారులే ఫిర్యాదు దారులకు ఫోన్‌చేసి, వివరాలు తెలుసుకుంటున్నారు. వారి ఇళ్లకు వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

కమిషనర్‌ కదలడంతో..

ప్రజావాణిలో వచ్చే అర్జీల పరిష్కారానికి స్వయంగా కమిషనర్‌ రిజ్వాన్‌ బాషా ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఆస్తి పేరు మార్చడం లేదని హనుమకొండ ప్రాంతం ఎక్సైజ్‌ కాలనీకి చెందిన వ్యక్తి గ్రీవెన్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. పలుమార్లు విన్నవించినా పన్నుల విభాగం ఉద్యోగులు పట్టించుకోవడం లేదని చెప్పడంతో ఈ నెల 7 బుధవారం కమిషనర్‌ క్షేత్రస్థాయికి వెళ్లారు. కాజీపేట సర్కిల్‌ ఉపకమిషనర్‌ జోనా, ఆర్వో యూసూఫ్‌ ఉద్దీన్‌, ఆర్‌ఐ, బిల్‌ కలెక్టర్‌తో కలిసి నేరుగా ఫిర్యాదు దారుని ఇంటికే వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఫైల్‌ ఎందుకు పెండింగ్‌లో పెట్టారని సిబ్బందిపై కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. కమిషనర్‌ క్షేత్రస్థాయి తనిఖీలతో అధికారులు అప్రమత్తమయ్యారు.


విభాగాల వారీగా ఇలా..

* ఈ నెల 5న జరిగిన ప్రజావాణిలో రికార్డు స్థాయిలో 86 అర్జీలు వచ్చాయి. టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించి 41, పన్నుల విభాగానికి సంబంధించి 11, ఇంజినీరింగ్‌ 19, ప్రజారోగ్యం 07, తాగునీటి సరఫరా 06, వీధి దీపాలకు సంబంధించి 02 వినతులు వచ్చాయి.

* హనుమకొండ, వరంగల్‌ ప్రాంతాల నుంచి 20-25 అర్జీలు పదే పదే వచ్చినట్లు కమిషనర్‌ గుర్తించారు. ఇలాంటి వాటిని తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రణాళిక విభాగంలో అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల మధ్య సమన్వయ లేదనే విమర్శలున్నాయి. కమిషనర్‌ చివాట్లతో ఆ విభాగం అధికారులు కదిలారు.

* ఇంజినీరింగ్‌, పన్నుల విభాగాల్లో పెండింగ్‌ అర్జీలు బయటకు తీశారు. సిటీజన్‌ ఛార్టర్‌ నిబంధనల ప్రకారం నిర్ణీత గడువుల్లోపు అర్జీలు పరిష్కరించాలని కమిషనర్‌ ఆదేశించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని